పుష్కరిణిలో స్నానమాచరిస్తున్న భక్తులు (ఇన్‌సెట్‌లో) కొత్త పుష్కరిణి నమూనా మ్యాప్
యాదగిరికొండ : తిరుమల తరహాలో రూపుదిద్దుకుంటున్న యాదాద్రి శ్రీలక్ష్మీనారసింహస్వామి ఆలయ అభివృద్ధి పనుల్లో భాగంగా యాదగిరికొండపై ఉన్న విష్ణు పుష్కరిణిపై వైటీడీఏ అధికారులు దృష్టి సారించారు. ఈ మేరకు పుష్కరిణి విస్తరణకు అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. ఇందుకోసం రూ.20కోట్లు కేటాయించారు. త్వరలో పనులు కూడా ప్రారంభం కానున్నాయి. భక్తుల సౌకర్యార్థం విష్ణు పుష్కరిణిని వెడల్పు చేయడంతో పాటు లోతు కూడా పెంచనున్నారు. ప్రస్తుతం పుష్కరిణి చుట్టూ సత్యనారాయణ వ్రత మండపం, ఇతర నిర్మాణ పనులు జరుగుతున్నందున ఆటంకం కలగకుండా అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగా పుష్కరిణిలో స్నానమాచరించేందుకు వచ్చే భక్తులకు ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
విష్ణు పుష్కరిణి ప్రాశస్త్యం
స్వామి సన్నిధికి వచ్చే భక్తుల్లో యాబై శాతం కొండపై ఉన్న విష్ణు పుష్కరిణిలో పుణ్యస్నానమాచరిస్తారు. అనంతరం స్వామి, అమ్మవారిని దర్శించుకుంటారు. ఈ పుష్కరిణిలోని ఓ ప్రాంతంలో సహజ సిద్ధంగా ఏర్పడిన నీటి గుంట ఉంది. అందులోనుం చి నిత్యం ఎడతెరిపి లేకుండా నీటిధార వస్తుంది. గతంలో చాలా పెద్ద దార వస్తుండేది. కాల క్రమేణా మరమ్మతుల నిమిత్తం పుష్కరిణిలో కాంక్రీటు వేయడం, కరువు పరిస్థితుల కారణంగా నీటి గుంట మూసుకుపోవడంతో పాటు జల దార కూడా తగ్గుముఖం పట్టింది. ఈ నీటిలో స్నానాలు ఆచరిస్తే గ్ర హ, గృహ, ఈతి, రోగ బాధలు పోతాయ ని భక్తుల విశ్వాసం.అంతేకాకుండా ఈ కోనేరు నుంచి స్వామి వారికి అభిషేకానికి బందేతీర్థం తీసుకెళ్తుంటారు. అందుకే ఈ క్షేత్రానికి వచ్చే భక్తులు పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించి దర్శనానికి వెళ్తుంటారు.
తిరుమలను తలపించేలా పుష్కరిణి విస్తరణ
యాదగిరికొండపై ప్రస్తుతం ఉన్న పుష్కరిణి 36 మీటర్లు వెడల్పు, 18 మీటర్ల పొడవు ఉంది. ఇందులో భక్తుల కోసం నాలుగు స్నానపు గదులు, నాలుగు కుళాయిలు మాత్రమే ఉన్నాయి. ఇవి భక్తుల అవసరాలకు సరిపోవడం లేదు. కొత్తగా రానున్న పుష్కరిణి 55మీటర్ల వెడల్పు, 31మీటర్ల పొడవుతో రానుంది. అంతేకాకుండా భక్తులు స్నానమాచరించేందుకు విడివిడిగా సుమారు 20 స్నానపు గదులు నిర్మించనున్నారు. అలాగే పురుషులు, మహిళలు దుస్తులు మార్చుకునేందుకు వేర్వేరుగా గదులు, ప్రత్యేకంగా నీటి షవర్లు, విడిగా వేడినీటి షవర్లు ఏర్పాటు చేయనున్నారు. వికలాంగులు, చిన్న పిల్లలకు సైతం ప్రత్యేక గదులు రానున్నాయి.
ఆధ్యాత్మికత ఉట్టిపడేలా..
పుష్కరిణి మధ్యలో కల్యాణ మండపం, అందులో ప్రత్యేకంగా స్వామివారి పాదాలను ఏర్పాటు చేయనున్నారు. ఈ పాదాలపై ప్రతి భక్తుడు నీటిని పోసే విధంగా ప్రత్యేక క్యూలైన్లు రానున్నాయి. ఈ కల్యాణ మండపం చుట్టూ ప్రత్యేక గ్రిల్స్ ఏర్పాటు చేస్తున్నారు.వీటితో పాటు పుష్కరిణికిలోనికి వెళ్లే ముందు 11అడుగుల ఎత్తులో అందమైన కమాను, దీనిపై ఐదు అడుగుల ఎత్తున్న విష్ణుమూర్తి విగ్రహం రానుందని అదికారులు తెలిపారు. చిన్నజీయర్ స్వామి సూచనల ప్రకారం పుష్కరిణి చుట్టూ గోడకు అందమైన శిల్పాలు రానున్నాయి.
పది వేల మంది స్నానమాచరించేలా..
ప్రస్తుతం ఉన్న పుష్కరిణిలో రోజూ రెండు వేల మంది మాత్రమే స్నానమారచిండానికి వీలుగా ఉంది. దీన్ని పది వేల మంది సాన్నమాచరించేందుకు వీలుగా నిర్మాణం చేయనున్నారు. ప్రధానాలయ నిర్మాణం పూర్తయ్యేలోగా పుష్కరిణి విస్తరణ పనులు పూర్తి చేసేందుకు వైటీడీఏ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment