ఎల్లో టెన్ సస్పెన్షన్
హైదరాబాద్: అసెంబ్లీ సమావేశాల్లో విపక్షాల వేడి తగ్గలేదు. రెండో రోజు కూడా నిరసనల పర్వం కొనసాగింది. సభలో గందరగోళ పరిస్థితి నెలకొంది. దీంతో ఇందుకు కారణమైన పది మంది టీడీపీ సభ్యులపై వేటు పడింది.
హైదరాబాద్: అసెంబ్లీ సమావేశాల్లో విపక్షాల వేడి తగ్గలేదు. రెండో రోజు కూడా నిరసనల పర్వం కొనసాగింది. సభలో గందరగోళ పరిస్థితి నెలకొంది. దీంతో ఇందుకు కారణమైన పది మంది టీడీపీ సభ్యులపై వేటు పడింది. సభా కార్యక్రమాలకు అడ్డుతగులుతున్న ఎమ్మెల్యేలను సమావేశాలు ముగిసే వరకూ సస్పెండ్ చేయాలని శాసనసభ వ్యవహారాల మంత్రి హరీశ్‌రావు ప్రతిపాదించడం, తీర్మానాన్ని సభ ఆమోదించడం క్షణాల్లో జరిగిపోయింది. అసెంబ్లీ కార్యకలాపాలను ఎవరు అడ్డుకోవాలని చూసినా పనిగట్టుకొని సస్పెండ్ చేస్తామని సీఎం కె.చంద్రశేఖర్‌రావు వ్యాఖ్యానించడంతో సభలో మరింత వేడి పుట్టింది. శనివారం బడ్జెట్ సమావేశాల ప్రారంభంలోనే గవర్నర్ ప్రసంగానికి టీడీపీ, కాంగ్రెస్ సభ్యులు అడుగడుగునా అడ్డుతగిలిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం కూడా సభ మొదలుకాగానే అగ్గి రాజుకుంది. గవర్నర్ ప్రసంగం సందర్భంగా జాతీయ గీతాన్ని అవమానపరిచిన ప్రతిపక్ష సభ్యులు క్షమాపణ చెప్పాలని అధికార పార్టీ ఒకవైపు.. మంత్రివర్గంలో అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించాలని టీడీపీ సభ్యులు మరోవైపు పట్టుబట్టడంతో తీవ్ర దుమారం రేగింది. ఈ క్రమంలో స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టిన టీడీపీ నేతలు ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తూ నిరసనకు దిగారు. దీంతో ఈ సమావేశాలు ముగిసేవరకు పది మంది టీడీపీ సభ్యులను సస్పెండ్ చేయాలని మంత్రి హరీశ్‌రావు ప్రతిపాదించారు. ఈ తీర్మానాన్ని స్పీకర్ మధుసూదనాచారి ఆమోదించడంతో సదరు ఎమ్మెల్యేలను మార్షల్స్ బలవంతంగా సభ నుంచి బయటకు తీసుకెళ్లారు. అయితే ఈ చర్యపై కాంగ్రెస్, బీజేపీ అభ్యంతరం తెలిపాయి.
ఆది నుంచీ సభలో గందరగోళం
ఉదయం 10 గంటలకు ప్రారంభం కావాల్సిన అసెంబ్లీ.. సోమవారం గంట ఆలస్యంగా 11 గంటలకు మొదలైంది. ఆ వెంటనే టీడీపీ సభ్యులు పోడియంలోకి దూసుకొచ్చారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ మంత్రివర్గంలో మాల, మాదిగ, మహిళలకు ప్రాతినిధ్యం కల్పించాలంటూ నినాదాలు చేశారు. దీంతో మంత్రి హరీశ్‌రావు కల్పించుకుని.. జాతీయ గీతాన్ని అవమానించిన సభ్యులు భేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దీనిపై మాట్లాడటానికి టీడీపీపక్ష నేత ఎర్రబెల్లి దయాకర్‌రావుకు స్పీకర్ మైక్ ఇచ్చారు. అయితే ఆయన మాట్లాడేందుకు లేచినా ఇతర సభ్యుల నినాదాలతో గందరగోళం మధ్య మాట్లాడలేకపోయారు. దీంతో మళ్లీ హరీశ్‌రావు లేచి మాట్లాడుతూ.. టీడీపీ సభ్యుల ధోరణి చూస్తే సభను అడ్డుకోవడానికే వచ్చినట్లు అనిపిస్తోందన్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో పది మంది సస్పెన్షన్ కోరుతున్నట్లు మంత్రి ప్రతిపాదించారు. దీంతో టీడీపీ సభ్యులు ఎర్రబెల్లి దయాకర్‌రావు(పాలకుర్తి), రేవంత్‌రెడ్డి(కొడంగల్), సండ్ర వెంకట వీరయ్య(సత్తుపల్లి), వివేకానంద(కుత్బుల్లాపూర్), అరికెపూడి గాంధీ(శేరిలింగంపల్లి), సాయన్న(కంటోన్మెంట్), మాగంటి గోపీనాథ్(జూబ్లీహిల్స్), మాధవరం కృష్ణారావు(కూకట్‌పల్లి), ప్రకాశ్‌గౌడ్(రాజేంద్రనగర్), రాజేందర్‌రెడ్డి(మక్తల్)ని బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకూ సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. అయితే ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్, బీజేపీ తప్పుబట్టాయి. టీడీపీ సభ్యులను రెండు, మూడు రోజుల పాటు కాకుండా సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్ చేయడం సరికాదని, దీనిపై పునరాలోచించాలని కోరాయి. జాతీయ గీతాలాపన సందర్భంగా జరిగిన మొత్తం వ్యవహారానికి సంబంధించిన వీడియోలను పరిశీలించి పారదర్శకంగా వ్యవహరించాలని ఆ పార్టీలు అభిప్రాయపడ్డాయి.
సభను అడ్డుకుంటే అంతే: కేసీఆర్
సస్పెన్షన్‌పై పునరాలోచించాలని సీఎల్పీ నేత జానారెడ్డి చేసిన సూచనపై ముఖ్యమంత్రి స్పందించారు. టీడీపీ సభ్యులు ఉద్దేశపూర్వకంగానే సభను అడ్డుకోవాలని చూస్తున్నారని, దీన్ని ఉపేక్షించబోమని అన్నారు. ‘అసంబద్ధమైన, అనవసరమైన రభస సృష్టించాలనే ఉద్దేశంతో టీడీపీ సభ్యులున్నారు. ఇంత అసహనంగా వ్యవహరించడం రాష్ట్రానికి మంచిది కాదు. ప్రతిరోజూ వాయిదా తీర్మానాలు జరగాలంటే కుదరదు. జాతీయగీతాన్ని అవమానించడమే కాకుండా గవర్నర్‌నూ కించపరిచారు. అధికారపక్ష సభ్యులు కూడా అలా ప్రవర్తించి ఉంటే వారితోనూ క్షమాపణ చెప్పిద్దాం. ప్రతి అంశంపై చర్చకు మేం సిద్ధంగా ఉన్నాం. అవసరమైతే బడ్జెట్ సమావేశాలను మరిన్ని రోజులు పెంచడానికీ సిద్ధమే. అయితే కొందరు మాత్రం సభ జరగనివ్వమంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోం. సభను జరగనివ్వని వారిని పనిగట్టుకొని సస్పెండ్ చేస్తాం. ఇంకా ఏ రకమైన చర్యలకైనా వెనుకాడం. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర ఔన్నత్యాన్ని జాతీయ స్థాయిలో కాపాడుతాం. దాన్ని దెబ్బతీయాలని చూస్తే గుణపాఠం తప్పదు’ అని కేసీఆర్ ఘాటుగా వ్యాఖ్యానించారు. ఇప్పటికిప్పుడు కొంపలు అంటుకోవట్లేదని, తప్పుచేసినట్లు సదరు సభ్యులు తెలుసుకుంటే సస్పెన్షన్ కుదింపుపై రెండుమూడు రోజుల తర్వాత నిర్ణయం తీసుకుందామని సీఎం అన్నారు. కేసీఆర్ మాట్లాడిన తర్వాత.. పార్టీ ఫిరాయింపులు, కరువు మండలాల ప్రకటనపై పలువురు సభ్యులు ఇచ్చిన వాయిదా తీర్మానాలను తిరస్కరిస్తున్నట్లు ప్రకటించిన స్పీకర్ సభను మంగళవారానికి వాయిదా వేశారు.