దయన్నా.. ఏమైందన్నా!
తెలంగాణ ఉద్యమ సమయంలో పోలీస్ పహారాలో ఎర్రబెల్లి పాలకుర్తి నియోజకవర్గం చుట్టేసి సమస్యలు తెలుసుకు న్నారు. అలాంటిది ఇప్పుడు జిల్లా కేంద్రానికి వచ్చినా.. పాలకుర్తి వైపు చూడకపోవడం టీడీపీ శ్రేణుల్లో చర్చనీయాం శమైంది.
సాక్షి ప్రతినిధి, వరంగల్ : ఈ సారి ఎన్నికల్లో తెలంగాణ వ్యాప్తంగా టీడీపీకి ఎదురుగాలి వీచింది. ఇంత తీవ్ర వ్యతిరేకతలోనూ ఆ పార్టీకి చెందిన ఎర్రబెల్లి దయాకర్‌రావు పాలకుర్తి నియోజకవర్గం నుంచి మరోసారి విజయం సాధించారు. అంతేకాదు... ఎన్నికల్లో వరుస విజయాలతో రికార్డు సృష్టిం చారు. రాజకీయ పార్టీలకతీతంగా ప్రజలందరితో మంచి సంబంధాలు కలిగి ఉంటారని ఎర్రబెల్లికి పేరుంది. ప్రజా సంబంధాల విషయంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది.
సొంత నియోజకవర్గంలోని ప్రజల విషయంలో ఇది ఇంకా ఎక్కువగా ఉంటుంది. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి అవసరాలపై స్పందిస్తారని, ఈ ప్రత్యేకతే ఆయన విజయాలకు ప్రధాన కారణమని రాజకీయ విశ్లేషకుల అంచనా. అరుుతే... సాధారణ ఎన్నికల ఫలితాలు వచ్చి నెలన్నర దాటింది. ప్రతి వారం నియోజకవర్గంలోని ప్రతి మండలంలో పర్యటించే అలవాటు ఉన్న ఎర్రబెల్లి దయాకర్‌రావు పాలకుర్తికి రాకుండా ఉండడం చర్చనీయూంశంగా మారింది. ఎన్నికల్లో సొంత పార్టీకి చెందిన నేతలు వ్యవహరించిన తీరుపై ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, అందుకే పాలకుర్తి మండలంలోనే అడుగుపెట్టడం లేదనే చర్చ జోరందుకుంది.
సోమవారం పర్యటనకు స్వస్తి
ఎర్రబెల్లి దయాకర్‌రావు 2009 ఎన్నికల్లో పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలిచారు. అప్పటి నుంచి ప్రతి సోమవారం ఆయన పాలకుర్తి మండల కేంద్రంలో అందరికీ అందుబాటులో ఉంటున్నారు. నియోజకవర్గ ప్రజలు, టీడీపీ నాయకులు, కార్యకర్తలకు అవసరమైన పనుల విషయంలో సత్వరమే స్పందించేవారు. టీడీపీకి వీచిన ఎదురుగాలిలోనూ తాజాగా మళ్లీ గెలిచిన దయాకర్‌రావు సోమవారం పాలకుర్తి పర్యటనకు స్వస్తి పలికారు. ఎన్నికల ఫలితాలు రాగానే... పాలకుర్తి దేవస్థానంలో దైవ దర్శనానికి వచ్చి వెళ్లిన ఎర్రబెల్లి మళ్లీ మండలానికి రాలేదు. ఎన్నికలకు సంబంధించి ఆ మండలంలో సొంత పార్టీ నేతలు వ్యవహరించిన తీరు కారణంగా ఆయన దూరంగా ఉంటున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పోలింగ్ ముందు రోజు ఎర్రబెల్లి దయాకర్‌రావు అనారోగ్యంతో ఇబ్బంది పడ్డారు. ఈ మేరకు సహకరించాల్సిన స్థానిక మండల టీడీపీ నేతలు... ఆయనకు వ్యతిరేకంగా పనిచేసినట్లు స్థానికంగా ప్రచారం జరుగుతోంది.
తక్కువ ఓట్లు రావడం వల్లే....
ముఖ్యంగా ఎన్నికల నిధుల ఖర్చు విషయంలో నష్టం కలిగించేలా టీడీపీ మండల నేతలు వ్యవహరించినట్లు చెప్పుకుంటున్నారు. పోలింగ్ రోజు దయాకర్‌రావు పర్యటించే పరిస్థితి లేకపోవడంతో ద్వితీయ శ్రేణి నేతలు కొందరు నిధులను సొంతానికి వాడుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. పోలీసులు డబ్బులు పట్టుకున్నారని చెప్పి కొందరు నేతలు తప్పించుకున్నట్లుగా ఆ పార్టీ శ్రేణులే చర్చించుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు స్తబ్దుగా ఉన్న ఎర్రబెల్లి... ఫలితాలు వచ్చిన తర్వాత ఈ తతంగంపై ఆరా తీశారు.
పాలకుర్తి మండలంలో తనకు 5 వేల ఓట్ల మెజార్టీ వస్తుందని ఎర్రబెల్లి భావించారు. కానీ... అక్కడ 459 ఓట్ల మెజార్టీ మాత్రమే వచ్చింది. మండల కేంద్రంలో టీడీపీ ఏకంగా మూడో స్థానానికి పరిమితమైంది. సొంత పార్టీ నేతలు వ్యవహరించిన తీరే ఇందుకు కారణమని దయూకర్‌రావు బలంగా విశ్వసిస్తున్నట్లు తెలిసింది. స్థానిక సంస్థల్లో టీడీపీకి వచ్చిన ఓట్ల కన్నా... మండలంలో ఆయనకు తక్కువ రావడం వంటి పరిణామాలు దయూకర్‌రావును బాధించాయని... అందుకే మండలానికి దూరంగా ఉంటున్నట్లు టీడీపీ శ్రేణులు చెవులు కొరుక్కుంటున్నారుు.