సాక్షి, దేవరకద్ర: వలసల జిల్లాగా పేరు పడిన పాలమూరును సస్యశ్యామలం చేసేందుకు ప్రాజెక్టులు కడ్తాంటే అడ్డుకున్నరు.. ఇప్పుడు వారే దొంగ ఏడ్పులు ఏడుస్తుండ్రు.. ఇది పోను ‘ఆంధ్రా బాబు’తో పొత్తుపెట్టుకుని మీ ముందుకు వచ్చిండ్రు.. సిగ్గు లేని వారికి ప్రజలే తగిన బుద్ధి చెప్పాలి.
తెలంగాణ ప్రజలకు ద్రోహం చేసిన ఆంధ్రబాబును కాంగ్రెస్ వారు భుజాలపై మోస్తున్నందుకు సిగ్గుపడాలని సీఎం కేసీఆర్ విమర్శించారు. శనివారం దేవరకద్రలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన ప్రసంగించారు. రాష్ట్రంలో చేపట్టిన ప్రాజెక్టులను అడ్డుకోడానికి చంద్రబాబు 35 కేసులు వేయించారని, ఇప్పటికీ సుప్రీంకోర్టులో ఓ కేసు నడుస్తుందని ఆరోపించారు.
తెలంగాణ ప్రజలు బాగుపడడం చూసి.. చంద్రబాబు కళ్లు మండుతున్నాయని, దీనికి కాంగ్రెస్ వారు తాళం కొడుతున్నారని విమర్శించారు. పాలమూరు ప్రాజెక్టులపై మహాకూటమి పేరుతో పోటీ చేస్తున్న నాయకులు కోర్టులో కేసులు వేసి ప్రజల ముందు దొంగ ఏడ్పులు ఏడుస్తున్నారని ఎద్దేవా చేశారు. ప్రాజెక్టులపై కేసులు వేసిన వారిని తరమికొట్టాలని, ఎన్నికల్లో వారికి డిపాజిట్లు రాకుండా పాలమూరు ప్రజలు ఓట్లు వేయాలని పిలుపునిచ్చారు.
కోయిల్‌సాగర్, భీమా, కల్వకుర్తి, నెట్టెంపాడు ప్రాజెక్టులు పూర్తి చేసి సాగునీటిని అందిస్తున్నామన్నారు. కర్వెన, వట్టెం రిజర్వాయర్లతో పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేస్తామన్నారు. ఎన్నికల్లో టికెట్లు అమ్ముకునే సంస్కృతి కాంగ్రెస్‌దని.. వారి నాయకులే ఆరోపిస్తున్నారని విమర్శించారు. పార్టీ టికెట్లను అమ్ముకునే చరిత్ర ఉన్న వీరు నిజంగా ప్రజలకు మేలు చేస్తారా అని ఆలోచించాలని కోరారు.
నాలుగున్నరేళ్లలోనే అభివృద్ధి..
తెలంగాణ ప్రజలను 67 ఏళ్లపాటు పాలించిన కాంగ్రెస్, టీడీపీలు చేయని ఆభివృద్ధిని.. తాము కేవలం నాలుగున్నరేళ్లలో చేశామన్నారు. పాలమూరు జిల్లాలో 20 లక్షల ఎకరాలకు సాగునీరం దించడానికి కంకణం కట్టుకున్నామన్నారు. పాలమూరు ప్రాజెక్టును రూ.35 వేల కోట్లతో చేపట్టా మని, ఈ ప్రాజెక్టుపై కాంగ్రెస్ నాయకులు కోర్టు లో కేసులు వేశారని ఆరోపించారు.
ఇక్కడి నుంచి పోటీ చేస్తున్న పవన్‌కుమార్ కూడా ప్రాజెక్టు మీద కేసులు వేశారని, ఈ విషయంలో ప్రజలు చూస్తూ ఊరుకోరాదన్నారు. ఆంధ్రబాబుకు వంతపాడే ఓ నాయకుడు మక్తల్ నుంచి పోటీ చేస్తున్నారని, ఇక్కడి నుంచి ఇంటికి ఒకరు వెళ్లి వ్యతిరేకంగా ప్రచారం చేసి ఓడించాలని సూచించారు.
తెలంగాణ గడ్డపై నుంచి..
తెలంగాణ గడ్డపై నిలబడి ఆంధ్రకు ప్యాకేజీలు ప్ర కటిస్తారా అంటూ సీఎం కేసీఆర్ సోనియా, రాహుల్‌గాంధీలను దుయ్యబట్టారు. తెలంగాణలో సభలు పెట్టి ఆంధ్రకు విభజన చట్టం ప్రకారం ప్యాకేజీలు అమలు చేస్తామని చెప్పడంపై మండిపడ్డారు.
తెలంగాణకు విభజన చట్టం ప్యాకేజీలు వర్తించవా.. ఇక్కడ పారిశ్రామిక ప్యాకేజీలు ఇచ్చి న తర్వాతనే ఆంధ్రకు ఇస్తామని.. ఇక్కడికి వస్తున్న రాహుల్‌గాంధీ ప్రకటిస్తారా అని ప్రశ్నించారు.
దేవుడు పంపిన దూత కేసీఆర్
దేవుడు పంపిన దూత కేసీఆర్ అని ఎంపీ జితేందర్‌రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏడు నెలల్లోనే తుమ్మిళ్ల ప్రాజెక్టును పూర్తి చేసి సాగునీటిని అందించారని కొనియాడారు. ఉమ్మడి జిల్లాలో చేపట్టిన పాలమూరు ప్రాజెక్టు పూర్తయితే 8 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు.
రాష్ట్రాన్ని 67 ఏళ్లు పాలించిన నేతలు తెలంగాణలో కేవలం లక్ష ఎకరాలకు మాత్రమే సాగు నీరందించారని విమర్శించారు. వలసలు, పేద జిల్లాగా పేరున్న పాలమూరుకు వలసలు వచ్చేలా చేశారన్నారు.
మళ్లీ ఆశీర్వదించండి
గతంలో ఉద్యమం త ర్వాత గెలిపించిన ప్ర జలు..ఇప్పుడు అదే స్ఫూర్తితో ఆశీర్వదిం చి గెలిపించాలని టీఆర్‌ఎస్ అభ్యర్థి ఆల వెంకటేశ్వర్‌రెడ్డి కోరారు. 67 ఏళ్లలో జరగని అభివృద్ధిని నాలుగున్నర ఏళ్లలో చేశామన్నారు. రూ.130 కోట్లు వెచ్చించి.. నియోజకవర్గంలో 400 చెరువులను పునరుద్ధరించామన్నారు.
అలాగే రూ.2,600 కోట్లతో కర్వెన ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయని, దీంతో ప్రతి ఎకరాకు సాగు నీరందుతుందన్నారు. దేవరకద్ర ఆర్‌ఓబీకి రూ.24.75 కోట్లు మంజూరు చేయించామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment