సాక్షి, సిటీబ్యూరో(హైదరాబాద్): సాఫీగా సాగిపోతున్న ఆ కుటుంబంలో ఒక్కసారిగా పెద్ద కుదుపు. పిల్లలను మంచిగా చదివించాలని పట్టుదలతో శ్రమిస్తున్న ఆ తల్లిదండ్రులకు తీరని కష్టం. ఉద్యోగం కోల్పోయినా కుల వృత్తి చేసుకుంటూ అతడు, కూలీ పనికి వెళ్తూ ఆమె కుటుంబాన్ని పోషిస్తున్నారు. కష్టపడి పిల్లలను చదివిస్తున్నారు. తల్లిదండ్రుల ఆశలకు అనుగుణంగా కొడుకు సరస్వతీ పుత్రుడు. చదువులో రాణిస్తూ పేరు తెచ్చుకున్నాడు. అయితే ఆ సరస్వతీ పుత్రుడికి విధి ‘రక్త’ పరీక్ష పెట్టింది. కొడుకు ప్రాణాలకు ముప్పుండడంతో తల్లిదండ్రులు చికిత్స కోసం సర్వం ధారపోశారు. అయినా సరిపోకపోవడంతో దాతల కోసం ఎదురు చూస్తున్నారు.
ఆ కుటుంబ దీనగాథ ఇదీ...
ప్రకాశం జిల్లా కారంచేడుకు చెందిన జరుగుమల్లి రంగయ్య, అంజన దంపతులకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. కొడుకు రాజేశ్‌బాబును విజయవాడలోని ఓ ప్రైవేట్ కళాశాలలో చేర్పించారు. తల్లిదండ్రుల ఆశలకు అనుగుణంగా రాజేశ్ ఇంటర్ ఫస్టియర్‌లో అత్యధిక మార్కులు సాధించి టాపర్‌గా నిలిచాడు. ఇంతలో ఊహించని విధంగా రాజేశ్ అనారోగ్యానికి గురయ్యాడు. స్థానిక ఆస్పత్రుల చుట్టూ తిప్పినా జబ్బును కనిపెట్టలేకపోయారు. చివరకు నిమ్స్‌కు తీసుకురగా, అతడికి ‘అప్లాస్టిక్ అనీమియా’ ఉందని డాక్టర్లు నిర్ధారించారు. చికిత్సకు రూ.25 లక్షల వరకు ఖర్చవుతుందని వైద్యులు తెలపడంతో రంగయ్య హతాశుడయ్యాడు. క్షౌ రవృత్తి చేసుకుంటూ సంసారాన్ని నెట్టుకొస్తున్న అతడు వైద్య పరీక్షల కోసమే రూ.8 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాడు. తనకున్న కొద్దిపాటి పొలం, బంగారం అమ్మేసి కొడుక్కి వైద్యం చేయించాడు. డబ్బులు సరిపోకపోవడంతో దొరికిన చోటల్లా అప్పులు చేశాడు. మొత్తం ఇప్పటివరకు రూ.12 లక్షల వరకు ఖర్చుచేశారు.
ఎన్ని మందులు వాడినా వ్యాధి నయం కాకపోవడంతో మూల కణాల మార్పిడి (స్టెమ్ సెల్ ట్రాన్స్‌ప్లాంటేషన్) చేయాలని నిమ్స్ వైద్యులు నిర్ణయించారు. వంద శాతం మూల కణాలు సరిపోలిన వ్యక్తి నుంచి రాజేశ్‌కు స్టెమ్ సెల్స్ ఎక్కిస్తే అతడికి వ్యాధి నయమవుతుందని నిమ్స్ హెమటాలజీ నిపుణురాలు డాక్టర్ రాధిక చెప్పారు. ధాత్రి ఫౌండేషన్ ద్వారా మూలకణ దాత దొరికాడు. చికిత్సకు మొత్తం రూ.25 లక్షలు ఖర్చవుతుంది. అయితే ఈ చికిత్స అందించే నిపుణులు అందుబాటులో లేకపోవడంతో వేలూరు(తమిళనాడు)లోని సీఎంసీకి సిఫార్స్ చేశారు. నిమ్స్ వైద్యుల సహాయంతో సీఎంసీలో అపాయింట్‌మెంట్ కూడా తీసుకున్నారు. చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో ఏం చేయాలో తెలియక తండ్రి రంగయ్య సతమతమవుతున్నాడు. మరోవైపు కుమారుడి ఆరోగ్యం రోజురోజుకు క్షీణిస్తుండటంతో ఆందోళన చెందుతున్నాడు. దాతలు స్పందించి ఆర్థిక సాయం అందించాలని వేడుకుంటున్నాడు. సహాయం చేయాలనుకునేవారు 92473 56545 నంబర్‌లో రంగయ్యతో నేరుగా మాట్లాడి వివరాలు తెలుసుకోవచ్చు.
బ్యాంకు వివరాలు..
పేరు: జరుగుమల్లి రంగయ్య
ఆంధ్రాబ్యాంక్, కారంచేడు బ్రాంచ్
అకౌంట్ నంబర్: 033210100033069
ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్: ఏఎన్‌డీబీ 0000332
అప్లాస్టిక్ అనీమియా అంటే?
మన శరీరంలో తగినన్ని కొత్త రక్త కణాలు తయారు కాకపోవడాన్ని అప్లాస్టిక్ అనీమియాగా పేర్కొంటారు. దీని బారినపడితే తరచూ ఆయాసం వస్తుంది. ఇన్ఫెక్షన్లు ఎక్కువగా ఉంటాయి. రక్తస్రావం అధికంగా ఉంటుంది. గుండె వేగంగా కొట్టుకుంటుంది. చర్మం పాలిపోయి స్కిన్‌పై రాషెష్ వస్తాయి. కళ్లు తిరగటం, తలపోటు వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఒక్కోసారి ముక్కు, చిగుళ్ల నుంచి కూడా రక్తం రావొచ్చు. వ్యాధి ముదిరిన వారికి మూలకణ మార్పిడి చేయాల్సిందే. ఇది చాలా సుదీర్ఘమైన, క్లిష్టమైన చికిత్స. తేడా వస్తే ప్రాణాలే పోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment