
యువజనోత్సవంలో కళాకారుల ప్రదర్శన
* రాష్ట్ర యువజనోత్సవాల ప్రారంభోత్సవంలో మంత్రి మహేందర్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను జాతీయ స్థాయిలో చాటిచెప్పాలని మంత్రి పి.మహేందర్‌రె డ్డి కళాకారులకు సూచించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని శిల్పారామంలో రాష్ట్ర యువజనోత్సవాలను ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ కళాకారుల్లో దాగిన సృజనాత్మకతను వెలికి తీసేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.
అస్సాంలోని గౌహతిలో ఈ నెల 8 నుంచి జరిగే జాతీయ యువజనోత్సవాలలో తెలంగాణ సంస్కృతిని చాటిచెప్పేలా ప్రదర్శనలుండాలని సూచించారు. ప్రారంభ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ సలహా దారు కె.వి.రమణాచారి, రాష్ట్ర యువజన సర్వీసులు, క్రీడల కార్యదర్శి లవ్ అగర్వాల్, టెన్నిస్ క్రీడా కారిణి నైనా జైస్వాల్, స్థానిక ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ తదితరులు పాల్గొన్నారు. కాగా, అట్టహాసంగా ప్రారంభమైన యువజనోత్సవాల్లో 18 అంశాల్లో పోటీలను నిర్వహిస్తున్నారు.
10 జిల్లాల నుంచి దాదాపు 650 మంది కళాకారులు విచ్చేశారు. పల్లే అందాలు సింగారించుకున్న శిల్పారామంలో కళాకారుల కోలాహలం నెలకొంది. సంప్రదాయ వేదికలో సంప్రదాయ నృత్యాలు, యాంఫీ థియేటర్‌లో జానపద నృత్యా లు, గేయాలు, శిల్పసంధ్యా వేదికలో సంప్రదాయ వాయిద్యాలు, క్రాఫ్ట్ సెంటర్‌లో వ్యాస రచన, వక్తృత్వం, మిమిక్రీ తదితర పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో విజేతలు గౌహతిలో జరిగే జాతీయ యువజనోత్సవాల్లో పాల్గొంటారు.