యువత తలచుకుంటే దేశాన్నే అద్భుతంగా తీర్చిదిద్దగలరు. అలాంటి వారు త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కీలకం కానున్నారు. గ్రేటర్‌లో అభ్యర్థుల గెలుపు శాసించనున్నారు. ‘యువతరం శివమెత్తితే లోకమే మారిపోదా.. చీకటే మాసిపోదా’.. అంటూ యువతలోని శక్తి సామర్థ్యాలను ఓ కవి ఎలుగెత్తి చాటాడు. అదే ఇప్పుడు నిజం కానుంది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలో 56.69 శాతంగా ఉన్న 18–39 ఏళ్ల వయసు వారు రాజకీయ పార్టీలు, అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్ణయించనున్నారు.
సాక్షి,సిటీబ్యూరో: యువతరం శివమెత్తితే...నవతరం గళమెత్తితే...లోకమే మారిపోదా...చీకటే మాసిపోదా...అంటూ యువతలోని శక్తి సామర్థ్యాలను ఓ అభ్యుదయ కవి ఎలుగెత్తి చాటాడు. హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల పరిధిలోని 18–39 ఏళ్ల వయస్సున్న వారి ఓట్లే ముందస్తు ఎన్నికల్లో నిర్ణయాత్మకపాత్ర పోషించనున్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే రాజకీయపార్టీలు, అభ్యర్థుల భవితవ్యం యువ ఓటర్ల వేలిచుక్కలోనే ఉంది. ఎన్నికల ప్రచారంలోనూ యువత జోరే కనిపిస్తోంది. ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులకు సోషల్‌మీడియా ప్రచారంతోపాటు ఇంటింటికి తిరిగి ఓట్లు అభ్యర్థించడం, పాదయాత్రలు, బైక్‌ర్యాలీలు, ఇంటింటికీ తిరిగి స్టిక్కర్లు, కరపత్రాలు పంచడం వంటి పనులన్నీ యువతే చక్కబెడుతుండడం విశేషం.
యువమంత్రం..
హైదరాబాద్ జిల్లా పరిధిలో మొత్తంగా 39,60,706 ఓటర్లు ఉండగా, వీరిలో 18–39 ఏళ్ల మధ్య వయస్సున్నవారి ఓట్లు 22,45,616. అంటే యువత ఓట్ల శాతం 56.69. ఇక పొరుగునే ఉన్న ఉమ్మడి రంగారెడ్డి (ప్రస్తుత రంగారెడి, మేడ్చల్, వికారాబాద్ జిల్లాలు కలిపి) జిల్లా పరిధిలో మొత్తంగా 50,56,900 లక్షల మంది ఓటర్లు ఉండగా, వీరిలో 18–39 ఏళ్ల మధ్య వయస్సున్నవారు 29,09,237 మంది. మొత్తం ఓటర్లలో యువత ఓట్లు శాతం 57.53.
ప్రచారంలోనూ యువతే..
ఎన్నికల ప్రచారంలోనూ యువ తరమే ముందుంది. ఇప్పటికే టీఆర్‌ఎస్, బీజేపీ, మజ్లిస్, బీఎల్‌ఎఫ్‌లు తమ అభ్యర్థులను ప్రకటించిన విషయం విదితమే. ఆయా పార్టీల అభ్యర్థులు ప్రచారంలో స్పీడ్ పెంచారు. ఈ ప్రచారంలోనూ ఎక్కడా చూసినా అధిక సంఖ్యలో యువకులే కనిపిస్తున్నారు. 18–25 ఏళ్ల మధ్యనున్న వారితో పాదయాత్రలు, బైక్‌ర్యాలీలు, ఇంటింటి ప్రచా రం చేయిస్తున్నారు. షార్ట్‌ఫిల్మ్‌లు, వాట్సాప్, ఫేస్‌బుక్, ట్విట్టర్ ప్రచారాల్లోనూ వీరి సేవలు వినియోగించుకుంటున్నారు. ఇందుకోసం వారికి ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్లు భారీగానే అందజేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment