నారుమడిలో దివంగత నేతకు పుష్పాంజలి ఘటిస్తున్న రైతన్నలు
సాక్షి, వరంగల్ రూరల్: ప్రజల్లో నుంచి పుట్టిన నాయకుడు వైఎస్సార్.. పేదల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు తపోదీక్షలా అహర్నిశలు శ్రమించిన రుషి ఆయన.. కులమతాలకు, రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేసిన కృషీవలుడు ఆయన. పల్లె కన్నీరు తుడిచిన మనసున్న మారాజు రాజన్న.. ప్రజల ఆకాంక్షలకు, అవసరాలకు పెద్దపీట వేసిన పెద్దాయన పాలన రైతులకు నిజంగా స్వర్ణ యుగమే. రూపాయి చేతిలో లేకున్నా ఆరోగ్యశ్రీ కార్డు పట్టుకుని వెళ్తే పేదోడికి కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఉచిత వైద్యం అందించారు.
వేలాది మంది విద్యార్థులకు ఉన్నత విద్యను అందించి.. లక్షలాది మంది రైతులకు చేయూతనందించారు.. ఓరుగల్లుతో ఆయనకు విడదీయరాని అనుబంధం ఉంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ 9వ వర్ధంతి నేడు. ఆయన దూరమై తొమ్మిదేళ్లవుతున్నా వరంగల్ ప్రజలు వైఎస్సార్‌ను ఇంకా గుర్తు చేసుకుంటున్నారు. ప్రేమ, ఆప్యాయతలకు నిలువెత్తు రూపంగా మారిన పెద్దాయన వర్ధంతిని పురస్కరించుకొని ఉమ్మడి వరంగల్ జిల్లాలో అనేక కార్యక్రమాలను చేపట్టడానికి వైఎస్సార్ అభిమానులు సన్నాహాలు చేసుకుంటున్నారు. మహానేత జిల్లాకు అందించిన సేవలపై ప్రత్యేక కథనం..
ఉచిత విద్యుత్..
2004లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలి సంతకం ఉచిత విద్యుత్ ఫైల్‌పై చేశారు. రైతులకు ఉచిత విద్యుత్‌ను అందించి వారికి భరో సానిచ్చారు. అంతకుముందు విద్యుత్ బిల్లులు చెల్లించలేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడేవారు. చంద్రబాబు హయాంలో కరెంట్ బిల్లులు చెల్లించలేదని రైతులను జైలుకు పంపిన సంఘటనలు సైతం ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ను అందించి అన్నదాతలకు అండగా ఉన్నారు. ఒకేసారి రూ.లక్షలోపు రు ణమాఫీ ద్వారా రైతుల హృదయాల్లో నిలిచారు.
దేవాదుల..
ప్రజల ఆశీర్వాదంతో 2004 నుంచి 2009 వరకు దివంగత మహానేత ముఖ్యమంత్రిగా సుపరిపాలన సాగించారు. ఆయన పరిపాలన కాలంలో జిల్లాలో రిజర్వాయర్ల నిర్మాణంపై దృష్టి సారించారు. జే చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల పథకం మొదటి దశలో రూ.844 కోట్లు, రెండో దశలో రూ.1,887 కోట్లు, మూడో దశలో రూ.5,410 కోట్లను కేటాయించారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు ద్వారా 1,78,562 ఎకరాలకు సాగు నీరందిస్తున్నారు. మొదటి ఫేజ్‌లో 77,770 ఎకరాలకు, సెకండ్ ఫేజ్‌లో 1,00,762 ఎకరాలకు నీరందిస్తున్నారు. ఉత్తర తెలంగాణలో ఎనిమిది జిల్లాల్లో గోదారమ్మ పరవళ్లు తొక్కుతోంది.
కేటీపీపీ..
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో చెల్పూర్‌లో కాకతీయ థర్మల్ విద్యుత్ కేంద్రంను జూన్ 1, 2006న మొదటి దశ 500 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్‌ను రూ.3 వేల కోట్ల వ్యవయంతో నిర్మించేందుకు శంకుస్థాపన చేశారు. ఇందులో ఫిబ్రవరి 19, 2009న విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమైంది. అదేరోజు రెండోదశ 600 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్‌కు శంకుస్థాపన చేశారు. స్థానికంగా ఉత్పత్తి అయ్యే బొగ్గును ఇతర ప్రాంతాలకు తరలించకుండా అక్కడే విద్యుత్ తయారీ కేంద్రంను ఏర్పాటు చేయాలని ఆలోచనతో డాక్టర్ వైఎస్సార్ కేటీపీపీని నిర్మించారు. అది తెలంగాణలో వెలుగులు విరజిమ్ముతోంది.
రాజన్నలాంటి పాలనను ప్రజలు కోరుకుంటున్నారు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ము ఖ్యమంత్రి, పేదల పెన్నిధి డాక్టర్ వైఎస్ రాజ శేఖర్‌రెడ్డిలాంటి పాలనను ప్రజలు కోరుకుంటున్నారు. ప్రస్తుతం తెలంగాణలో సీఎం కేసీఆర్ పాలనపై ప్రజలు విస్తుపోతున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్య శ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, 108, 104, పావలావడ్డీ రుణాలు, ఆపద్బంధులాంటి అనేక సంక్షేమ పథకాలే నేటికి ప్రజలకు ఉపయోగపడుతున్నాయి. – సంగాల ఈర్మియా, వైఎస్సార్‌సీపీ అర్బన్ జిల్లా అధ్యక్షుడు
ఫీజు రీయింబర్స్‌మెంట్‌తోనే నా చదువు..
మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పేదవిద్యార్థుల కోసం ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం నాకు ఒక వరం. ఈ పథకంతో నేను ఉన్నత చదువులు చదివి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాను. – జి.రణధీర్, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్, వరంగల్
ఆరోగ్యశ్రీతో గుండె ఆపరేషన్ అయింది
మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం ద్వారా నేను గుండె ఆపరేషన్ చేసుకున్నాను. కార్పొరేట్ ఆస్పత్రిలో వైద్యం చేపించుకునే ఆర్థిక పరిస్థితి లేకుండె. ఆరోగ్యశ్రీ కింద ఆపరేషన్‌కు రూ.1.70 లక్షలు మంజూరయ్యాయి. 2013లో హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో ఆపరేషన్ చేశారు. –నర్మెట బుచ్చివీరు, కడిపికొండ
నారుమడిలో దివంగత నేతకు పుష్పాంజలి ఘటిస్తున్న రైతన్నలు
ఇందిరమ్మ ఇళ్లు..
ఇంటి స్థలం ఉండి ఇల్లు నిర్మించుకోలేని పేదలకు ఇందిరమ్మ పథకం పేరుతో గృహ నిర్మాణాలకు ఆర్థిక సాయం చేశారు. అలాగే బ్యాంక్ నుంచి కూడా రుణం వచ్చేలా కృషి చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో లక్షలాది మంది గృహాలు నిర్మించుకున్నారు. వైఎస్సార్ మరణం తర్వాత వారి ఇళ్లలో వైఎస్సార్ చిత్ర పటాలను సైతం ఏర్పాటు చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment