మీ భవిష్యత్తుకు నాది భరోసా! | YS Sharmila Paramarsa Yatra in Ranga Reddy district | Sakshi
Sakshi News home page

మీ భవిష్యత్తుకు నాది భరోసా!

Published Wed, Jul 1 2015 1:25 AM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM

మీ భవిష్యత్తుకు నాది భరోసా! - Sakshi

మీ భవిష్యత్తుకు నాది భరోసా!

వైఎస్ మరణం తట్టుకోలేక  చనిపోయినవారి కుటుంబాలతో షర్మిల
ఇంటికి పెద్దదిక్కు లేకుంటే  ఎంత ఆవేదన ఉంటుందో నాకు తెలుసు
  ఏ కష్టమొచ్చినా ఫోన్ చేయండి.. ఆదుకుంటాం
  బాధలో ఉన్నవారికి బాసటగా నిలవాల్సిన  బాధ్యత అందరిపైనా ఉంది
  ర ంగారెడ్డి జిల్లాలో రెండోరోజు కొనసాగిన పరామర్శ యాత్ర

 
 సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ‘ఇంటికి పెద్ద దిక్కు లేకపోతే ఎంత ఆవేదన ఉంటుందో నాకు తెలుసు.. పిల్లల భవిష్యత్తు కోసం గుండె నిబ్బరం చేసుకోండి.. ఏ కష్టమొచ్చినా నాకు ఫోన్ చేయండి..’ అంటూ వైఎస్ మరణం తట్టుకోలేక చనిపోయినవారి కుటుంబాలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల భరోసా ఇచ్చారు. ‘బాధ్యత ఒకరిచ్చేది కాదు.. తమకు తామే తీసుకోవాలి.. బాధలో ఉన్న కుటుంబానికి బాసటగా నిలవాల్సిన బాధ్యత అందరిపై ఉంది’ అని అన్నారు. వైఎస్ మరణాన్ని తట్టుకోలేక రంగారెడ్డి జిల్లాలో ప్రాణాలు విడిచిన వారి కుటుంబాలను పరామర్శిస్తున్న షర్మిల మంగళవారం రెండోరోజు కండ్లకోయ, మేడ్చల్, కేశవరం, ల క్ష్మాపూర్, మూడు చింతలపల్లిలో 5 కుటుంబాలను కలిశారు. వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు. తమ కుటుంబీకులు చనిపోయిన సంఘటనను గుర్తుచేసుకుని విలపించడంతో షర్మిల భావోద్వేగానికి లోనయ్యారు. ‘వైఎస్సార్ మరణంతో నా కొడుకు అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు..’ అని కేశవపురంలో వెంకటేశ్ తండ్రి యాదయ్య కన్నీరుమున్నీరవడం చూసి షర్మిల చలించిపోయారు. ‘పెద్దయ్యా.. ధైర్యంగా ఉండు.. వైఎస్ కుటుంబం మీకు అండగా ఉంటుంది’ అంటూ కళ్లు చెమర్చారు. ఏ సహాయం కావాల్సినా ఫోన్ చేయాలని ఓదార్చారు.
 
 ఉద్వేగ క్షణాలు.. ఆత్మీయ పలకరింపులు..
 పరామర్శ యాత్రలో భాగంగా తొలుత కండ్లకోయ గ్రామానికి వెళ్లిన షర్మిల.. సాయిబాబాగౌడ్ కుటుంబాన్ని కలుసుకున్నారు. కుటుంబ పెద్ద ఆకాల మరణంతో ముగ్గురు ఆడపిల్లలను సాకలేకపోతున్నానని, చనిపోవడానికి కూడా ప్రయత్నించానని సాయిబాబా గౌడ్ భార్య అరుణజ్యోతి చెప్పడంతో షర్మిల ఉద్వేగానికి గురయ్యారు. ‘పిల్లలను బాగా చదివించు. ఉద్యోగాలు వస్తాయి. జీవితంలో స్థిరపడితే అన్నీ సమస్యలు తొలిగిపోతాయి’ అని ఆమెకు గుండె ధైర్యం చెప్పారు. పిల్లల ఉన్నత చ దువులకు ఆసరాగా నిలుస్తామని చెప్పారు. అనంతరం లక్ష్మాపూర్‌లో నూతనకంటి మహేశ్ కుటుంబాన్ని కలిసి వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు.
 
 కుమారుడి మరణాన్ని తట్టుకోలేక తండ్రి పక్షవాతం బారిన పడి చనిపోయాడంటూ విలపించిన మహేశ్ తల్లి సావిత్రిని అక్కునచేర్చుకున్నారు. ‘ప్రస్తుతం ఫీజు రీయింబర్స్‌మెంట్ ఆగిపోయింది. 108 సర్వీసులు నిలిచిపోయాయి. నాన్నగారు ప్రవేశపెట్టిన అన్ని పథకాలకు కోత పెట్టారు’ అని లక్ష్మాపూర్ సర్పంచ్ శ్యామల..షర్మిల ముందు ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం మేడ్చల్ ఇందిరానగర్ కాలనీలో వైఎస్ ఆకస్మిక మరణానికి తట్టుకోలేక మరణించిన కొల్తూరి ముత్యాలు కుటుంబాన్ని షర్మిల ఓదార్చారు. భర్త మరణంతో తామంతా అనాథలుగా మారమంటూ కన్నీరు పెట్టుకున్న ముత్యాలు భార్య యాదమ్మకు ధైర్యం చెప్పారు. తన విజిటింగ్ కార్డు ఇచ్చి ఎలాంటి సమస్యలు ఉన్నా ఫోన్ చేయాలని సూచించారు. తర్వాత మూడు చింతలపల్లిలో జామ కిష్టయ్య కుటుంబాన్ని పరామర్శించారు.
 
 ప్రతి కుటుంబానికి మేమున్నాం: పొంగులే టి
 వైఎస్ మరణంతో చనిపోయినవారి ప్రతి కుటుంబానికీ ఆసరాగా ఉంటామని వైఎస్సార్ సీపీ తెలంగాణ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్, ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు. వైఎస్ మరణించి ఆరేళ్లయినా.. అభిమానం చెక్కుచెదరలేదంటే ఆయన అమలు చేసిన సంక్షేమ పథకాలే కారణమన్నారు. షర్మిల వెంట పార్టీ ప్రధాన కార్యద ర్శులు శివకుమార్, ఎడ్మ కిష్టారెడ్డి, నల్లా సూర్యప్రకాశ్, గాదె నిరంజన్‌రెడ్డి, మతిన్ ముజాద్ అలీ, అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి, జిల్లా అధ్యక్షుడు సురేశ్‌రెడ్డి, కరీంనగర్, మహబూబ్‌నగర్, వరంగల్ జిల్లాల అధ్యక్షులు భాస్కర్‌రెడ్డి, శ్యాంసుందర్‌రెడ్డి, జిన్నారెడ్డి మహేందర్‌రెడ్డి, రాష్ట్ర అనుబంధ విభాగాల అధ్యక్షులు భీష్వ రవీందర్, సయ్యద్ ముజతబా అహ్మద్, జార్జ్ హెర్బత్, ప్రఫుల్లారెడ్డి, ఎం.జయరాజ్, సందీప్‌కుమార్, రామ్మోహన్, శ్రీనివాస్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు కుసుమ కుమార్‌రెడ్డి, బి.రఘురామరెడ్డి, సామ యాదిరెడ్డి, జి.రాంభూపాల్‌రెడ్డి, అమృతాసాగర్, సూర్యనారాయణ రెడ్డి, భగవంతరెడ్డి, శ్రీధర్‌రెడ్డి, కె.వెంకట్‌రెడ్డి, సంయుక్త కార్యదర్శులు బంగి లక్ష్మణ్, నేతలు  మేరీ, షర్మిల సంపత్, బ్రహ్మానందరెడ్డి, సుభాన్‌గౌడ్, విజయ్‌కుమార్‌రెడ్డి, సంతోష్‌రెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement