వైఎస్ షర్మిల 'పరామర్శ యాత్ర' పోస్టర్ విడుదల
హైదరాబాద్: దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి మరణాన్ని తట్టుకోలేక మృతిచెందిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల డిసెంబర్ 8వ తేదీన మహబూబ్‌నగర్ జిల్లా కల్వకుర్తి నుంచి ‘పరామర్శ యాత్ర’ను ప్రారంభించనున్నారు. మరో వారం రోజుల్లో తెలంగాణలో షర్మిల జరప తలపెట్టిన పరామర్శ యాత్ర కు సంబంధించి పోస్టర్ ను ఆదివారం విడుదల చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన 18 కుటుంబాలను షర్మిల పరామర్శిస్తారని ఖమ్మం ఎంపీ, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు.
ఐదు రోజుల పాటు సాగే ఈ యాత్రలో 10 నియోజకవర్గాల్లో పరామర్శయాత్ర కొనసాగుతుందని ఆయన తెలిపారు. దీంతో పాటు ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను కూడా షర్మిల పరామర్శిస్తారని పొంగులేటి తెలిపారు. తెలంగాణ అమరవీరుల కుటుంబాలను కూడా యాత్రలో పరామర్శించేందుకు ప్రయత్నిస్తామన్నారు. నల్లకాలువలో వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన వాగ్దానం నిలబెట్టుకోవడానికే పరామర్శయాత్ర చేపడుతున్నట్లు ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.