8 నుంచి షర్మిల పరామర్శ యాత్ర
పాలమూరులో 5 రోజుల పాటు 8 నియోజకవర్గాల్లో పర్యటన
వైఎస్సార్‌సీపీ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ పొంగులేటి వెల్లడి
అనంతరం తెలంగాణలోని మిగతా జిల్లాల్లో యాత్ర
సాక్షి, హైదరాబాద్: దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి మరణాన్ని తట్టుకోలేక మృతిచెందిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల డిసెంబర్ 8వ తేదీన మహబూబ్‌నగర్ జిల్లాలో ‘పరామర్శ యాత్ర’ను ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగా ఆమె జిల్లాలో 4 నుంచి 5 రోజుల పాటు షాద్‌నగర్, జడ్చర్ల, కల్వకుర్తి, అచ్చంపేట, మక్తల్, కొడంగల్, వనపర్తి, గద్వాల అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పర్యటిస్తారు.
దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి మరణాన్ని తట్టుకోలేక మృతిచెందిన 16 కుటుంబాలను పరామర్శిస్తారు. వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో గతంలోనే ఓదార్పు యాత్ర చేపట్టారు. వివిధ కారణాల వల్ల ఆ తరువాత ఈ ప్రాంతంలో ఓదార్పు కార్యక్రమం సాగలేదు. దీంతో తాజాగా పరామర్శ యాత్రకు షర్మిల శ్రీకారం చుడుతున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా యాత్ర పూర్తయ్యాక తెలంగాణలోని మిగతా ఎనిమిది జిల్లాల్లో కూడా షర్మిల పర్యటిస్తారు.
మీడియాతో మాట్లాడుతున్న వైఎస్సార్‌సీపీ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ పొంగులేటి తదితరులు
ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో వైఎస్సార్‌సీపీ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన జరిగిన రాష్ట్ర కమిటీ సమావేశం యాత్రకు తుదిరూపునిచ్చింది. ఈ సమావేశంలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు తాటి వెంకటేశ్వర్లు, పాయం వెంకటేశ్వర్లుతో పాటు తెలంగాణ సీనియర్ నేతలు ఎడ్మ కిష్టారెడ్డి, రెహ్మాన్, గట్టు రామచంద్రరావు, శివకుమార్, గట్టు శ్రీకాంత్‌రెడ్డి, జనక్ ప్రసాద్, నల్లా సూర్యప్రకాష్, కొండా రాఘవరెడ్డి పాల్గొన్నారు. ఈ భేటీలో రైతుల ఆత్మహత్యలు, విష జ్వరాల వల్ల మరణాలు, ఇతర ముఖ్యమైన సమస్యలపైనా చర్చించారు.
మనోధైర్యాన్ని కలిగిస్తారు: పొంగులేటి
2009 సెప్టెంబర్ 25న కర్నూలు జిల్లా నల్లకాలువ సభలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీ మేరకు వైఎస్సార్ మరణాన్ని తట్టుకోలేక మరణించిన కుటుంబాలను షర్మిల పరామర్శిస్తారని పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. గతంలో అనివార్య కారణాల వల్ల ఈ కార్యక్రమం వాయిదా పడిందని... దీంతో డిసెంబర్ 8న మహబూబ్‌నగర్ జిల్లాలో ‘పరామర్శ యాత్ర’ను వైఎస్సార్ కుమార్తె షర్మిల ప్రారంభిస్తారని ఆయన చెప్పారు. వైఎస్ మరణాన్ని తట్టుకోలేక మరణించిన వారి కుటుంబాలకు ఆమె మనోధైర్యాన్ని కలిగిస్తారని తెలిపారు. శుక్రవారం నిర్వహించిన పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశంలో.. ఈ పరామర్శ యాత్రతో పాటు రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, అసెంబ్లీలో పార్టీ సభ్యులు అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించినట్లు పొంగులేటి చెప్పారు. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు రోజు రోజుకు పెరుగుతున్నాయని, విష జ్వరాల బారిన పడి గిరిజనులు, గిరిజనేతరులు చనిపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.