
మురిసిన మిర్యాల
⇒ నియోజకవర్గంలోని నాలుగు కుటుంబాలకు పరామర్శ
⇒ మూడోరోజు ప్రేమానురాగాల మధ్య సాగిన షర్మిల యాత్ర
⇒ నందిపాడు, సల్కునూరు, సీతారాంపురం, ఆలగడపలలో పర్యటన
⇒ ఆప్యాయతతో పలకరించిన షర్మిలను చూసి ఆనందబాష్పాలు
⇒ వైఎస్ పాలనను గుర్తు తెచ్చుకున్న మృతుల కుటుంబ సభ్యులు
తెలుగింటి ఆడబిడ్డ... ఆల‘గడప’ తొక్కగా...
సల్కునూరు ప్రజలు..సాదర స్వాగతం పలకగా...
మిర్యాల మురిసిపోయింది...
సీతారాంపురం...జనపురమైంది...
నందిపాడు...ఆనందతాండవం చేసింది...
రాజన్నబిడ్డకు మూడో రోజూ మిర్యాలగూడ నియోజకవర్గ ప్రజలు అడుగడుగునా ఆదరాభిమానాలు చూపారు. పరామర్శయాత్రలో భాగంగా షర్మిల శుక్రవారం నియోజకవర్గ పరిధిలోని నాలుగు కుటుంబాలను ఓదార్చారు.
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : జిల్లాలో నిర్వహిస్తున్న పరామర్శయాత్రలో భాగంగా షర్మిల మూడోరోజు శుక్రవారం మిర్యాలగూడ నియోజకవర్గంలో పర్యటించారు. నియోజకవర్గ పరిధిలోని నంది పాడు క్యాంపు, సల్కునూరు, మిర్యాలగూడ, ఆలగడపలలో నాలుగు కుటుంబాలను సందర్శించారు. ఆయా కుటుంబాలకు చెందిన సభ్యులతో మాట్లాడి వారి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. షర్మిల రాకతో ఆ కుటుంబాలు ఉద్వేగానికి లోనయ్యాయి. ఎంతో ఆప్యాయంగా తమను పలకరించిన వైఎస్ తనయను చూసి ఆనంద భాష్పాలు రాల్చాయి.
వైఎస్ లాంటి నాయకుడు రాడని, భవిష్యత్తులో రాలేడని చెప్పిన వారు తండ్రి లాంటి నాయకుడిలా జగనన్నను తీర్చిదిద్దాలని దేవుడిని వేడుకుంటున్నట్టు షర్మిలకు చెప్పారు. షర్మిల కూడా పరామర్శకు వెళ్లిన కుటుంబాల సభ్యులతో ఎంతో ప్రేమగా ఉన్నారు. వారిని ఆప్యాయంగా పేరుపేరునా పలకరించారు. వారు తనపై ఉన్న అభిమానంతో చేసి పెట్టిన పాయసం, స్వీట్లు తిని, కుటుంబసభ్యులకు తినిపించారు. మొత్తంమీద మూడోరోజు మిర్యాలగూడ నియోజకవర్గంలో షర్మిల యాత్ర ప్రేమానురాగాల మధ్య సాగింది.
మూడో రోజు యాత్ర సాగిందిలా...
పరామర్శ యాత్రలో భాగంగా శుక్రవారం ఉదయం 11 గంటలకు బయలుదేరిన షర్మిల ముందుగా నందిపాడు క్యాంపులోని పేరం దుర్గమ్మ కుటుంబాన్ని సందర్శించారు. దుర్గమ్మ కుటుంబ సభ్యులు బొట్టు పెట్టి వైఎస్ తనయను తమ ఇంట్లోకి ఆహ్వానించారు. తమ కుటుంబ పరిస్థితులను దుర్గమ్మ కోడలు జ్యోతి, కూతుళ్లు సంజాత, సైదమ్మ, జ్యోతిలు షర్మిలకు వివరించారు. వారి కుటుంబ పరిస్థితి తెలుసుకున్న షర్మిల వారి కుటుంబానికి ధైర్యం చెప్పి వెళ్లారు. అక్కడి నుంచి నేరుగా వేములపల్లి మండలం సల్కునూరు గ్రామానికి వెళ్లి అక్కడ రేఖ ఇద్దయ్య కుటుంబాన్ని పరామర్శించారు.
ఇద్దయ్య కుటుంబసభ్యులు షర్మిలకు మంగళహారతులు పట్టి ఇంట్లోకి తీసుకెళ్లారు. ఇద్దమ్మ కోడలు జానకమ్మ తమ కుటుంబ పరిస్థితిని షర్మిల దృష్టికి తీసుకెళ్లారు. వారి కుటుంబానికి అండగా ఉంటామని చెప్పిన షర్మిల అక్కడి నుంచి శెట్టిపాలెం గ్రామానికి వెళ్లారు. అక్కడ భోజనం పూర్తి చేసుకుని మార్గమధ్యంలో గ్రామంలోనే ఉన్న వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అక్కడి నుంచి మిర్యాలగూడ పట్టణంలోని సీతారాంపురం చిన్నమసీదు వెనుక ఉన్న అక్కిమళ్ల సుందర్ కుటుంబం వద్దకు వెళ్లారు. అక్కడ సుందర్ భార్య కృష్ణవేణి, కూతురు పద్మలు తమ కుటుంబ పరిస్థితిని షర్మిలకు వివరించారు. కనీసం తనకు ఉండడానికి ఇల్లు కూడా లేదని, తాను ఒంటరిగా ఉంటున్నానని రోదిస్తూ చెప్పిన కృష్ణవేణిని చూసి షర్మిల చలించి కన్నీళ్లు పెట్టుకున్నారు.
అక్కడ వారి కుటుంబానికి భరోసా చెప్పి షర్మిల నేరుగా ఆలగడప గ్రామానికి వెళ్లి అక్కడ కొప్పోజు సావిత్రమ్మ కుటుం బాన్ని పరామర్శించారు. సావిత్రమ్మ ఇద్దరు కుమార్తెలు షర్మిలతో మాట్లాడారు. ఆలగడప వెళ్లిన సందర్భంగా షర్మిలకు స్థానికులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. గ్రామస్తులంతా షర్మిలను చూసేందుకు కదలివచ్చారు. అక్కడ మూడోరోజు యాత్ర ముగించుకున్న షర్మిల నేరేడుచర్ల మండలంలోని సిటీసెంట్రల్ స్కూల్‌లో రాత్రిబస చేశారు.
దేవుడు నాలాంటి వాళ్లను తీసుకెళ్లినా బాగుండేది...
పరామర్శలో భాగంగా షర్మిల ఆయా కుటుంబాల వద్దకు వెళ్లినప్పుడు వారి కుటుంబ సభ్యుల ఆనందాలకు అవధులు ఉండడం లేదు. ఆనందం.. ఆవేదన... ఉద్వేగం కలగలిపిన ఆనంద భాష్పాలతో ఆమెతో తమ కష్టసుఖాలను పంచుకున్నారు. పేరం దుర్గమ్మ కుటుంబం వద్దకు వెళ్లినప్పుడు ఆమె కోడలు జ్యోతి మాట్లాడుతూ ‘వైఎస్సార్ ఉంటే మాకు ఈ రేకుల ఇల్లు ఉండేది కాదు. ఎక్కడ నిద్రపోవాలో కూడా అర్థం కాని పరిస్థితి. ఇళ్లంతా పుచ్చిపోయి ఉంది. ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకున్న ఇల్లు ఇవ్వలేదు. వర్షం వస్తే ఇళ్లంతా సరవలు పెట్టాలి, దుప్పట్లు కూడా తడిసిపోతున్నాయి.
మా అక్కలాగా మాతో మాట్లాడుతున్నావు. ఐదేండ్లయినా ఎవరూ వచ్చి పలకరించలేదు. మీరు అండ దండగా ఉంటారని మా ఆశ. వైఎస్ మా అన్నయ్య అని నా తోబుట్టువు మా అత్తయ్య ఎప్పుడు చెపుతుండేది. వైఎస్ చనిపోయిన రోజు మా అత్త చాలా బాధపడింది. దేవుడు నాలాంటి వాళ్లను తీసుకెళ్లిన బాగుండేది. అంతటి మంచి పాలన చేసే వైఎస్‌ను తీసుకెళ్లాడని ఏడ్చింది.’ అని చెప్పింది. దుర్గమ్మ కోడలు సైదమ్మ మాట్లాడుతూ ‘వైఎస్ ఉన్నప్పుడు 20 మంది ఉంటే అందరికి పింఛన్లు వచ్చాయి. పింఛన్లు రూ.200కు పెంచిన ఘనత వైఎస్‌దే. ఆ నాయకుడు భవిష్యత్తులో మళ్లీ రాడు. ఆయనలాగా ప్రజలను, పేదలను ఆదుకునేవాడు కరువయ్యాడు, ఆయనలాగా జగనన్నను తీర్చిదిద్దాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను.’ అని చెప్పారు.
పావలా వడ్డీ వస్తుందా తల్లీ..!
అక్కడే ఉన్న మహిళలనుద్దేశించి షర్మిల ‘ఎవరైనా డ్వాక్రాగ్రూపుల్లో ఉన్నారా... ప్రభుత్వం వడ్డీ చెల్లిస్తుందా.’ అని ప్రశ్నించగా చెల్లించడం లేదని అక్కడి మహిళలు చెప్పారు. వైఎస్ ఉన్నప్పుడులా వడ్డీ పథకం కింద రూపాయి కడితే ముప్పావలా తిరిగి ఇచ్చేవారని, ఇప్పుడు ఎలాంటి సాయమూ అందడం లేదని చెప్పారు. సల్కునూరులో ఇద్దయ్య కుటుంబాన్ని సందర్శించినప్పుడు కూడా షర్మిల పలు ప్రశ్నలు వేసి ప్రజల స్థితిగతులను తెలుసుకున్నారు. ‘ వ్యవసాయం ఎట్లుంది? పంట ఎందుకు పండడం లేదు? బోర్లున్నాయా? నీళ్లులేవా? పొలానికి ఏడుగంటల ఉచిత విద్యుత్ వస్తోందా?’ అని ఆమె ఆరాతీయడం గమనార్హం.
షర్మిల వెంట పరామర్శయాత్రలో వైఎస్సార్‌సీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఒంగోలు ఎంపీ వై.వి.సుబ్బారెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి, మైనార్టీ విభాగం అధ్యక్షుడు ముస్తఫా అహ్మద్, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గట్టు శ్రీకాంత్‌రెడ్డి, గున్నం నాగిరెడ్డి, పార్టీ రాష్ట్ర నాయకులు షర్మిలా సంపత్, గూడూరు జైపాల్‌రెడ్డి, ఇరుగు సునీల్ కుమార్, నల్లగొండ జిల్లా మిర్యాలగూడ, నాగార్జున సాగర్, మునుగోడు నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లు ఎం.డి.సలీం, మల్లు రవీందర్‌రెడ్డి, ముదిరెడ్డి గవాస్కర్‌రెడ్డి, జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడు పచ్చిపాల వేణుయాదవ్ తదితరులున్నారు.