ముగిసిన ‘పరామర్శ’ | ys sharmila paramarsha yathra | Sakshi
Sakshi News home page

ముగిసిన ‘పరామర్శ’

Published Fri, Jun 12 2015 11:29 PM | Last Updated on Fri, May 25 2018 9:20 PM

ముగిసిన ‘పరామర్శ’ - Sakshi

ముగిసిన ‘పరామర్శ’

జిల్లాలో షర్మిల మలివిడత యాత్ర పూర్తి
 
♦ చివరి రోజు ఒక కుటుంబానికి పరామర్శ
♦ మలివిడతలో మొత్తం 6 నియోజకవర్గాలు...18 కుటుంబాలు
♦ తొలివిడత కలిపి మొత్తం 48 కుటుంబాలను కలిసిన వైఎస్ తనయ
♦ వైఎస్సార్ కాంగ్రెస్ కేడర్‌లో నూతనోత్సాహం
     
  ప్రేమతో మజ్జిగన్నం, పాయసం, స్వీట్లు...  కొబ్బరిబోండాలు, మజ్జిగ, పాలు.. వైఎస్ తనయ షర్మిలకు అందించి తమ అభిమానం చాటుకున్నవారు కొందరైతే..సంప్రదాయం ప్రకారం ఇంటికి వచ్చిన ఆడపడుచుకు చీర, గాజులు అందించిన వారు మరికొందరు.. ఇదీ..షర్మిల పట్ల జిల్లా ప్రజలు చూపిన ఆదరణ..ఆప్యాయత. రెండు విడతలుగా జరిగిన షర్మిల పరామర్శయాత్రకు జిల్లా ప్రజల నుంచి మంచి స్పందన కనిపించింది.
 
 సాక్షి ప్రతినిధి, నల్లగొండ : తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్. వైఎస్. రాజశేఖర్‌రెడ్డి హఠాన్మరణాన్ని జీర్ణించుకోలేక జిల్లాలో అసువులుబాసిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్. జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన మలివిడత పరామర్శయాత్ర ముగిసింది. చివరి రోజైన శుక్రవారం ఆమె చౌటుప్పల్ మండలంలోని అంకిరెడ్డిగూడెంలో ఒక కుటుంబాన్ని పరామర్శించారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి వారి కష్టసుఖాలు తెలుసుకున్నారు.

మలివిడత యాత్రలో భాగంగా ఆమె జిల్లాలోని ఆరు నియోజకవర్గాల్లో నాలుగు రోజులు పర్యటించి 18 కుటుంబాలను కలుసుకుని వైఎస్ కుటుంబ ప్రతినిధిగా ఆత్మీయతను పంచారు. కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరితో మాట్లాడి వారేం చేస్తున్నారో తెలుసుకుని, తగిన సూచనలు చేస్తూ, సలహాలిస్తూ, కుటుంబ బాధ్యతలు మోస్తున్న వారికి బాధ్యతలను గుర్తు చేస్తూ ఆప్యాయంగా సాగిన పరామర్శయాత్ర ఆయా కుటుంబాల సభ్యుల్లో మనోస్థైర్యాన్ని నింపింది.

 చివరి రోజు ఒక్కటి...
 మలివిడత పరామర్శయాత్రలో భాగంగా నాలుగోరోజు షర్మిల చౌటుప్పల్ మండలం అంకిరెడ్డిగూడెంలో బిట్ర వసంతరావు కుటుంబాన్ని కలుసుకున్నారు. ఆయన భార్య వెంకట్రావమ్మ, తల్లిదండ్రులు అనంతమ్మ, వెంకటేశ్వర్లు, కుమారుడు రాము మనోజ్‌తో మాట్లాడారు. అందరూ ధై ర్యంగా ఉండాలని చెప్పిన షర్మిల, బాగా చదువుకుని మంచి పేరు తెచ్చుకోవాలని వసంతరావు కుమారుడు రాము మనోజ్‌కు సూచించారు. ఈ సందర్భంగా వెంకట్రావమ్మ తన తల్లి ఇటీవలే చనిపోయారన్న విషయాన్ని చెప్పినప్పుడు షర్మిల కూడా కంటతడి పెట్టుకున్నారు.

ఆ సమయంలో పరామర్శ ప్రాంగణంలో ఉన్నవారి కళ్లు కూడా చెమ్మగి ల్లాయి. వసంతరావు కుటుంబ సభ్యులు బోరున విలపించడంతో షర్మిల కూడా ఉద్వేగాన్ని ఆపులేకపోయారు. వారికి ధైర్యం చెప్పిన షర్మిల తమ కుటుంబం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. దీంతో షర్మిల మలివిడత పరామర్శయాత్ర ముగిసినట్టయింది. షర్మిల వెంట వైఎస్సార్‌సీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఖమ్మం జిల్లా పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు డాక్టర్ గట్టు శ్రీకాంత్‌రెడ్డి, గాదె నిరంజన్‌రెడ్డి, ఎడ్మ కిష్ణారెడ్డి, నల్లా సూర్యప్రకాశ్, నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల పార్టీ అధ్యక్షులు అయిల వెంకన్నగౌడ్, మామిడి శ్యాంసుందర్‌రెడ్డి, పార్టీ కార్యక్రమాల కమిటీ అధ్యక్షుడు పి. సిద్ధార్థరెడ్డి, పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులు భీష్వరవీందర్, వెల్లాల రామ్మోహన్, ముజ్తబా అహ్మద్, మెండెం జయరాజ్, పార్టీ రాష్ట్ర కార్యదర్శిలు వేముల శేఖర్‌రెడ్డి, పార్టీ సంయుక్త కార్యదర్శులు గూడూరు జైపాల్‌రెడ్డి, ఇరుగు సునీల్‌కుమార్, జిల్లా మైనార్టీ విభాగం అధ్యక్షుడు ముస్తఫా తదితరులున్నారు.

 ఆరు నియోజకవర్గాలు... నాలుగు రోజులు
 జిల్లాలో షర్మిల మలివిడత యాత్ర ఉత్సాహంగా సాగింది. మొదటి రోజు భువనగిరి, ఆలేరు నియోజకవర్గాల్లో ఐదు కుటుంబాలను షర్మిల కలుసుకున్నారు. అక్కడ ప్రజల నుంచి మంచి స్పందన కనిపించింది. రెండోరోజు ఆలేరు, తుంగతుర్తి, నకిరేకల్ నియోజకవర్గాల మీదుగా ఆరు కుటుంబాలను పరామర్శిస్తూ యాత్ర సాగింది. మూడోరోజు నల్లగొండ, మునుగోడు నియోజకవర్గాల పరిధిలో మరో ఆరు కుటుంబాలను ఆమె కలుసుకున్నారు. చివరిరోజు మిగిలిన ఒక్క కుటుంబాన్ని పరామర్శించి ఆమె హైదరాబాద్ వెళ్లిపోయారు.

ఈ నాలుగు రోజుల పాటు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ శ్రేణులన్నీ శ్రమించి యాత్రను విజయవంతం చేశాయి. పరామర్శయాత్రలో భాగంగా జిల్లాలో మొత్తం 48 కుటుంబాలను కలుసుకున్నారు షర్మిల. తొలివిడతలో భాగంగా ఈ ఏడాది జనవరిలో జరిగిన యాత్రలో ఆమె దేవరకొండ, నాగార్జునసాగర్, మిర్యాలగూడ, హుజూర్‌నగర్, కోదాడ, సూర్యాపేట నియోజకవర్గాల్లో ఆరు రోజుల పాటు పర్యటించి 30 కుటుంబాలను కలుసుకున్నారు. మలివిడతలో 18 కుటుంబాలను కలుసుకున్నారు. ఈ సందర్భంగా షర్మిలకు జిల్లాలో అడుగడుగునా ఆత్మీయ స్వాగతం లభించింది.

 ‘ఫ్యాను’... మరింత జోరు
 జిల్లాలో షర్మిల చేపట్టిన యాత్రతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నెలకొంది. జగన్‌మోహన్‌రెడ్డి సోదరి పార్టీ పక్షాన చేపట్టిన యాత్ర విజయవంతం కావడం ఆ పార్టీ నేతలకు కొత్త ఊపిరినిచ్చింది. ఇటీవలే జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన అయిల వెంకన్నగౌడ్‌తో పాటు పార్టీ శ్రేణులన్నీ పరామర్శ యాత్ర కోసం కృషి చేశాయి. క్షేత్రస్థాయిలో ఉన్న కార్యకర్తలందరూ షర్మిల యాత్రతో మళ్లీ పునరుత్తేజితులయ్యారు. వైఎస్సార్ ఆశయ సాధనే ధ్యేయంగా పార్టీ పటిష్టత కోసం కృషి చేసేందుకు తమకు ఈ యాత్ర ఎంతో స్ఫూర్తిని నింపిందని, జగనన్న ఇచ్చిన మాట తప్పడనే దానికి నిదర్శనమే ఈ యాత్ర అని ఆ పార్టీ నేతలంటున్నారు.
 
 అందరికీ కృత జ్ఞతలు  

 షర్మిల పరామర్శ యాత్ర జిల్లాలో విజయవంతంగా జరిగేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గట్టు శ్రీకాంత్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. పరామర్శకు సహకరించిన పలు కుటుంబాలకు, స్థానిక ప్రజాప్రతినిధులకు, పార్టీ నాయకులకు, ప్రజలకు ఆయన పార్టీ పక్షాన కృతజ్ఞతలు తెలియజేశారు. షర్మిల యాత్ర స్ఫూర్తితో జిల్లాలో పార్టీని మరింత బలోపేతం చేసుకుంటామని, క్షే త్రస్థాయి నుంచి పార్టీకేడర్‌ను ఏర్పాటు చేసుకుంటామని ఆయన వెల్లడించారు.
 - డాక్టర్ గట్టు శ్రీకాంత్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement