టీఆర్‌ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలి
- మేనిఫెస్టో హామీలను ఏం చేశారు..?
- వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి
సాక్షి, ఖమ్మం: ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో టీఆర్‌ఎస్ పూర్తిగా విఫలమైందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. ఈ వైఫల్యాలను వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు క్షేత్రస్థాయిలో ఎండగట్టాలని పిలుపునిచ్చారు.
పార్టీ జిల్లా కార్యాలయంలో బుధవారం నిర్వహించిన ఇల్లెందు నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడారు. రైతాంగానికి రూ. లక్ష రుణ మాఫీ అని చెప్పిన కేసీఆర్ ఆ వాగ్దానాన్ని ఏం చేశారని ప్రశ్నించారు. విడతల వారీగా మాఫీ చేస్తామని చెబుతున్న ప్రభుత్వం అది వడ్డీకే సరిపోతుందన్న విషయాన్ని గుర్తించాలన్నారు. కొత్త రుణాలు అందక.. పాత రుణాలు మాఫీ కాక.. రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం మాత్రం మొద్దునిద్రలో ఉందన్నారు.
తెలంగాణ ఏర్పాటు అయితే తమ బతుకులు బంగారుమయం అవుతాయనుకున్న ప్రజల ఆశలను ముఖ్యమంత్రి కేసీఆర్ అడియాశలు చేశారన్నారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో సీమాంధ్ర పార్టీ అని హేళన చేసే పార్టీలకు తగిన బుద్ధి చెబుతామని ఎంపీ హెచ్చరించారు. రాష్ట్రంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అన్నా.. ఆయన కుటుంబం అన్నా ప్రజలకు అపారమైన ప్రేమ ఉందన్నారు. అధికార దాహంతో ఎమ్మెల్యేలు దూరమైనా.. నేతలు పార్టీని వదిలి వెళ్లినా.. ప్రజా సమస్యలపై వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇతర పార్టీలకు దీటుగా ఉద్యమిస్తుందని పేర్కొన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ రాష్ట్రస్థాయిలో ఇక ఉద్యమాలకు శ్రీకారం చుడతామని తెలిపారు.
సమావేశంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇల్లెందు నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ రవిబాబునాయక్, మహబూబాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ తెల్లం వెంకట్రావు, యువజన విభాగం నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల కోఆర్డినేటర్ సాధు రమేష్‌రెడ్డి, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఎండి.ముస్తఫా, జిల్లా అధికార ప్రతినిధి గుండా వెంకటరెడ్డి, మందడపు వెంకటేశ్వరరావు, నాయకులు బండి సత్యనారాయణ, ఏలూరి కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు