రోడ్డు ప్రమాదంలో వైఎస్‌ఆర్ సీపీ నాయకుని దుర్మరణం
జూలూరుపాడు: జూలూరుపాడు పోలీస్ స్టేషన్ సమీపంలో తల్లాడ-కొత్తగూడెం ప్రధాన రహదారిపై గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో కరివారిగూడెం గ్రామ మాజీ సర్పంచ్, వైఎస్‌ఆర్ సీపీ మండల సీనియర్ మండల నాయకుడు ఆంగోతు కృష్ణారావు(65) మృతిచెందారు.
పోలీసులు తెలిపిన ప్రకారం...
కరివారిగూడెం గ్రామ సర్పంచ్ ఆంగోతు ధనమ్మ భర్త, మాజీ సర్పంచ్, వైఎస్‌ఆర్ సీపీ నాయకుడు ఆంగోతు కృష్ణారావు గురువారం జూలూరుపాడులోని తన కూతురు ఝాన్సీ ఇంటికి వెళ్లారు. అక్కడ మనుమరాళ్లుతో కొద్దిసేపు గడిపి తిరిగి కరివారిగూడెం గ్రామానికి ద్విచక్ర వాహనంపై వెళుతున్నారు.
కొత్తగూడెం వైపు నుంచి జూలూరుపాడుకు వస్తున్న బోర్‌వెల్ వాహనం.. స్థానిక పోలీస్ స్టేషన్ సమీపంలో గేదెలను తప్పించే క్రమంలో కృష్ణారావు ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది. కృష్ణారావు అక్కడికక్కడే మృతిచెందారు. ఆయనకు భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు. ప్రమాద స్థలంలో కృష్ణారావు మృతదేహాన్ని చూసి కుటుంబీకులు, బంధువులు గుండెవిసేలా రోదించారు.
కరివారిగూడెం గ్రామస్తులు, వైఎస్‌ఆర్ సీపీ కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో ఘటన స్థలానికి చేరుకున్నారు. కృష్ణారావు దుర్మరణంతో ఆయన స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కొత్తగూడెం ఏరియా ఆస్పత్రికి ఎస్‌ఐ ఎన్.గౌతమ్ తరలించి, కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఆంగోతు కృష్ణారావు మృతిపట్ల ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వైరా ఎమ్మెల్యే బానోతు మదన్‌లాల్ ఒక ప్రకటనలో సంతాపం తెలిపారు. పార్టీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు పూర్ణకంటి నాగేశ్వరరావు, మండల కన్వీనర్ పొన్నెకంటి వీరభద్రం, రైతు విభాగం జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు దారావతు నాగేశ్వరరావు తదితరులు కూడా వేరొక ప్రకటనలో సంతాపం తెలిపారు.