వైఎస్‌ఆర్ సీపీ కర్నూలు జిల్లానేత హత్యకేసును ఛేదించిన పోలీసులు
రాజకీయ కక్షలతోనే మట్టుబెట్టారు పోలీసుల అదుపులో నిందితులు
అచ్చంపేట రూరల్ : వైఎస్‌ఆర్ సీపీ కర్నూలు జిల్లా నేత వసంతరావు హత్యకేసును పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. పాతకక్షల నేపథ్యంలోనే మట్టుబెట్టారని ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రధాన నిందితుడు బట్టి వెంకట్‌రెడ్డితో పాటు అతడి అనుచరులను తమ అదుపులోకి తీసుకున్నారు. జిల్లా అదనపు ఎస్పీ మల్లారెడ్డి ఆదివారం అచ్చంపేటలో వివరాలు వెల్లడించారు. ఈనెల 15న అమ్రాబాద్ మండలం ఈగలపెంట సమీపంలో హన్మకొండ మలుపు వద్ద వసంతరావును హత్యచేసిన సంఘటన కర్నూలు, మహబూబ్‌నగర్ జిల్లాల్లో సంచలనం రేకెత్తించింది.
కాగా, ఈ కేసును జిల్లా పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకుని తమదైన శైలిలో విచారణ చేపట్టారు. మృతుడు వసంతరావుకు శత్రువులు ఎవరున్నారనే కోణంలో దర్యాప్తు సాగింది. సున్నిపెంటకు చెందిన బట్టి వెంకట్‌రెడ్డి, వసంతరావుకు రాజకీయంగా కక్షలు ఉన్నాయని పోలీసులు తెలుసుకున్నారు. వెంకట్‌రెడ్డి భూకబ్జాలకు పాల్పడుతున్నాడని పలుమార్లు వసంతరావు ఉన్నతాధికారులకు ఫిర్యాదుచేశాడు. తనను ఇబ్బందులకు గురిచేస్తున్నాడని అతడిపై వెంకట్‌రెడ్డి మరింత కక్ష పెంచుకుని చంపాలని నిర్ణయించుకున్నాడు. హత్యచేయాలని భావించి పలుమార్లు విఫలమయ్యాడు.
హత్య జరిగిందిలా..
ఈ క్రమంలో 15న ఉదయం 6గంటల సమయంలో వసంతరావు షిష్టుకారులో డ్రైవర్ శివకుమార్‌తో కలిసి హైదరాబాద్‌కు బయలు దేరుతుండగా ఈగలపెంట ప్రాంతంలోని లింగాల ఘాట్ హన్మకొండ మలుపువద్ద వెంకట్‌రెడ్డి, అతడి అనుచరులు రామసుబ్బారెడ్డి, నాగేశ్వర్‌రావు, చిన్నన్న, రూప్రాషానీ, చిన్న వెంకటేశ్వర్లు, గుండయ్య యాదవ్, గురువయ్య, భరత్ కాపుకాచి తాము వెంట తెచ్చుకున్న ఫోర్స్-1 కారుతో వసంతరావు కారును ఢీకొట్టి బయటకు లాగి మారణాయుధాలతో హత్యచేశారు.
ఇదిలాఉండగా, శనివారం అమ్రాబాద్ మండలం మన్ననూర్ చెక్‌పోస్టు వద్ద నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా వివరాలు వెలుగుచూశాయని అదనపు ఎస్పీ మల్లారెడ్డి తెలిపారు. వారి నుంచి కత్తులు, గొడ్డలి, తపంచా, పిస్టల్, రెండు రివాల్వర్లు, మందుగుండు సామగ్రి, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని వివరించారు. నిందితులను సోమవారం అచ్చంపేట కోర్టులో హాజరుపర్చనున్నట్లు ఆయన తెలిపారు. ప్రధాన నిందితుడు వెంకట్‌రెడ్డి గతంలో సీపీఐ ఎంఎల్‌లో పనిచేశాడని తెలిపారు.
పోలీసుల కృషి భేష్
ఈ కేసును చేధించిన నాగర్‌కర్నూల్ డీఎస్పీ గోవర్దన్, అచ్చంపేట సీఐ వెంకటేశ్వర్లు, ఈగలపెంట, అమ్రాబాద్, సిద్ధాపూర్ పోలీసుల కృషిని ప్రశంసించారు. వారికి పోలీసుశాఖ నుంచి ప్రోత్సాహకాలు అందిస్తామన్నారు. సమావేశంలో నాగర్‌కర్నూల్ డీఎస్పీ గోవర్దన్, అచ్చంపేట సీఐ వెంకటేశ్వర్లు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
వీడిన మిస్టరీ
Published Mon, May 25 2015 4:35 AM | Last Updated on Tue, Aug 21 2018 5:46 PM
Advertisement