
పార్టీ కార్యాలయాల ఏర్పాటు..
జిల్లా, మండల కేంద్రాల్లో పార్టీ కార్యాలయాలు ఏర్పా టు చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి సూచించారు. శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయం లో జిల్లా సమీక్ష సమావేశం నిర్వహించారు.
సాక్షి, హైదరాబాద్ : జిల్లా, మండల కేంద్రాల్లో పార్టీ కార్యాలయాలను ఏర్పాటు చేసుకోవాలని, అందుకోసం జిల్లాలో ముగ్గురు సభ్యులతో కమిటీని ఏర్పాటుచేస్తామని వైఎస్సార్‌సీపీ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో పొంగులేటిశ్రీనివాసరెడ్డి అధ్యక్షతన జరిగిన ఆదిలాబాద్ జిల్లా పార్టీ సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పార్టీని బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఈ భేటీలో జిల్లా నాయకులు రవిప్రసాద్, అనిల్‌కుమార్, ప్రమీల, అలీముద్దీన్, షబ్బీర్, రాజ్‌కిరణ్, మిశ్రం శంకర్, నాగోరావు, పురుషోత్తం, రాష్ట్ర పార్టీ నాయకులు జనక్‌ప్రసాద్, నల్లా సూర్యప్రకాష్ కె.శివకుమార్, కొండా రాఘవరెడ్డి పాల్గొన్నారు. తెలంగాణలో పార్టీని వచ్చే అయిదారు నెలల్లో బలోపేతం చేసేందుకు కృషి చేస్తామన్నారు. గతంలో పార్టీలో ఉండి ఇప్పుడు స్తబ్దంగా ఉన్న నాయకుల జాబితాను నియోజకవర్గాల వారీగా తయారు చేసి తనకు అందజేయాలని జిల్లా నాయకులను ఆయన కోరారు. ముందుగా ఈ నాయకులతో తాను మాట్లాడి, ఆ తర్వాత పార్టీ పెద్దలతో కూడా మాట్లాడిస్తానని చెప్పారు.
గతంలో పార్టీలో ఉన్న నాయకులు మళ్లీ చురుకైన పాత్రను నిర్వహించేలా చూస్తామన్నారు. పార్టీలోని ఇతర నాయకులతో పార్టీ జిల్లా కన్వీనర్ మాట్లాడి నెలరోజుల్లో జిల్లాస్థాయిలో ఒక సదస్సును నిర్వహించాలని చెప్పారు. పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి అవసరమైన సహకారాన్ని అందిస్తామని వారికి పొంగులేటి హామీనిచ్చారు. జిల్లాకు చెందిన వారికి, స్థానికులకు పార్టీలో ప్రాధాన్యతనివ్వాలని కొందరు జిల్లా నాయకులు కోరారు. చురుకుగా పనిచేసే వారికి పార్టీలో తగిన ప్రోత్సాహం ఇవ్వాలని వారు విజ్ఞప్తిచేశారు. జిల్లా నాయకులు చేసిన సూచనలను పరిగణనలోకి తీసుకుంటామని రాష్ట్రపార్టీ నాయకులు చెప్పారు.