కాంగ్రెస్‌లో.. జెడ్పీ చిచ్చు
చైర్మన్ పదవికి పరిశీలనలో ఎమ్మెల్యే బాలునాయక్ పేరు
తెరపైకి భారతీ రాగ్యానాయక్ కూడా....
రెండు మూడు రోజుల్లో రానున్న స్పష్టత
జిల్లా పరిషత్ చైర్మన్ పీఠం కాంగ్రెస్ నేతల్లో చిచ్చుపెట్టేలా కనిపిస్తోంది. జెడ్పీ చైర్మన్ పదవి మొదటిసారి ఎస్టీలకు రిజర్వు అయ్యింది. జిల్లావ్యాప్తంగా ఎస్టీ విభాగంలో జనరల్, మహిళలకు రిజర్వు చేసిన జెడ్పీటీసీ స్థానాలు ఏడు. దీంతో ఈ ఏడుగురిలో ఒకరికి పీఠం దక్కుతుంది. అయితే, మాజీ మంత్రులు జానారెడ్డి, దామోదర్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మధ్య ఈ పదవి కోసం పోటీ ఉండేలా కనిపిస్తోంది.
తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడ, హుజూర్‌నగర్, దేవరకొండ నియోజకవర్గాల పరిధిలోనే ఎస్టీలకు రిజర్వు చేసిన జెడ్పీటీసీ స్థానాలున్నాయి. మాజీ ఎమ్మెల్యే భారతీ రాగ్యానాయక్, దేవరకొండ ఎమ్మెల్యే బాలూ నాయక్‌ల పేర్లు జెడ్పీచైర్మన్ పదవి కోసం తెరపైకి వచ్చాయి.
సాక్షిప్రతినిధి, నల్లగొండ జిల్లా పరిషత్ ఎన్నికలకు సోమవారం నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ మొదలైంది. రెండుమూడు రోజుల్లో జెడ్పీటీసీ స్థానాల్లో బరిలో మిగిలే అభ్యర్థుల జాబితా తేలిపోతుంది. జిల్లాలోని 59 జెడ్పీటీసీ స్థానాలకు గాను ఎస్టీలకు ఏడు స్థానాలు రిజర్వు అయ్యాయి.
ఇందులో నాలుగు మహిళలకే కేటాయించారు. చిలుకూరు, చింతపల్లి, నూతన్‌కల్ ఎస్టీ జనరల్ స్థానాలు కాగా, కోదాడ, నేరేడుచర్ల, సూర్యాపేట, తుంగతుర్తి జెడ్పీటీసీ స్థానాలు ఎస్టీ మహిళలకు రిజర్వు చేశారు. దీంతో ఈ ఏడు చోట్ల గెలిచే అభ్యర్థులనే పదవి వరిస్తుంది. అయితే, అధికార కాంగ్రెస్ పార్టీలో అపుడే ఈ పదవిని తమ అనుచరులకు ఇప్పించుకునే ప్రయత్నాలు మొదలయ్యాయి.
జిల్లాలో ఇటీవల ముఖ్యమైన పదవులు కొన్ని హుజూర్‌నగర్, కోదాడ నియోజకవర్గాలకు కేటాయించారు. దీంతో ఈసారి తమ నియోజకవర్గానికి చెందిన వారి, తన అనుచరుల కోసం మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే ఆర్.దామోదర్‌రెడ్డి పట్టుబట్టే అవకాశాలున్నాయి. కాగా,సీనియర్ నేత జానారెడ్డి ఆలోచన మరో విధంగా ఉందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. దేవరకొండ మాజీ ఎమ్మెల్యే భారతీ రాగ్యానాయక్ పేరును చైర్‌పర్సన్ పదవి కోసం తెరపైకి తెచ్చారు.
గడిచిన ఇరవై నాలుగు గంటల్లో మరో పేరుపైనా కాంగ్రెస్‌లో జోరుగా ప్రచారం జరిగింది. దేవరకొండ సిట్టింగ్ ఎమ్మెల్యే బాలూనాయక్ పేరు జెడ్పీచైర్మన్ పదవి కోసం పరిశీలిస్తున్నారని చెబుతున్నారు. అయితే, ఆయన ఇందుకు ససేమిరా అన్నారని, తనకు ఎమ్మెల్యే టికెట్ మాత్రమే కావాలని డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. ఒక వేళ భారతీ రాగ్యానాయక్‌ను బరిలోకి దింపాలని చూసినా, ఆమె పోటీ చేయడానికి చింతపల్లి జనరల్ స్థానం మినహా మరో అవకాశం లేదు.
గతంలో దేవరకొండ ఎమ్మెల్యేగా ఆమె భర్త రాగ్యానాయక్, ఆ తర్వాత ఆమె ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆ తర్వాత కూడా ఎమ్మెల్సీగా పదవి దక్కించుకున్న భారతీ రాగ్యానాయక్ మిర్యాలగూడ నియోజకవర్గానికే పరిమితమయ్యారు. అయితే, ఇప్పటికే దేవరకొండ నియోజకవర్గంలో రాగ్యానాయక్ కుటుంబం పట్ల ఓటర్లతో సానుభూతి ఉందని, దీంతో ఆమెను చింతపల్లి జెడ్పీటీసీ స్థానం నుంచి బరిలోకి దింపాలన్న వాదనను సీనియర్ నేత జానారెడ్డి తెచ్చారని అంటున్నారు.
అదే సమయంలో దేవరకొండ ఎమ్మెల్యే బాలూనాయక్ పేరుపైనా జోరుగా ప్రచారం ఉంది. ఒక వేళ బలవంతంగా కాంగ్రెస్ నుంచి జెడ్పీ అభ్యర్థిగా పోటీ చేయాల్సిందేనని అధినాయకత్వం పట్టుబట్టేట్టయితే, ఆయన పార్టీ మారేందుకు కూడా సిద్ధపడతారన్న ఊహాగానాలు బయలు దేరాయి. బాలూనాయక్ టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకుంటారని జరుగుతున్న ప్రచారం దీనికి బలం చేకూరుస్తోంది.
మరో వైపు ఆయనకు టికెట్ నిరాకరించే పక్షంలో కాంగ్రెస్‌లోని బలమైన వర్గంగా ఉన్న నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి వర్గం వైపు ఆయన వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదన్న అభిప్రాయం బలంగా వ్యక్తం అవుతోంది.
ఈ ఇద్దరు నేతలను మినహాయిస్తే, కాంగ్రెస్‌లో జెడ్పీ పీఠానికి సరిపోయే స్థాయిలో ఒక్క నాయకుడూ కనిపించడం లేదన్న అభిప్రాయం పార్టీ వర్గాల్లోనే ఉంది. ఈ నెల 24వ తేదీన జెడ్పీటీసీ స్థానాలకు తుది జాబితా సిద్ధమయ్యాక మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.