
మరమ్మతుల మాయ
సాక్షిప్రతినిధి, నల్లగొండ :లక్ష రూపాయలకుపైన ఖర్చుపెట్టి చేపట్టే ఏ పనినైనా ఈ-ప్రొక్యూర్‌మెంట్ ద్వారా టెండరు నిర్వహించాల్సిందే అన్నది కొత్త ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. కానీ, రాజకీయ ఒత్తిళ్ల ముందు ప్రభుత్వ నిబంధనలు గాలికి కొట్టుకుపోతున్నాయి. వాస్తవానికి ఎన్నికలకు ముందు స్పెషల్ ఆఫీసర్లపాలన సమయంలోనే జెడ్పీ గెస్ట్‌హౌస్‌కు మరమ్మతులు జరిగాయి. రంగులు మార్చి ఎలాగైతేనేం కొత్తగా తయారు చేశారు. శానిటేషన్, తాగునీటి సౌకర్యం, ఇతరత్రా మరమ్మతు పనుల కోసం మొత్తంగా రూ.10లక్షలు వెచ్చించారు. దీనికోసం టెండర్లు నిర్వహించి పనులు చేపట్టారు. జెడ్పీ సాధారణ నిధి (జనరల్ ఫండ్) నుంచి మరో రూ.5లక్షలు ఖర్చుపెట్టి ఏసీలు, సోఫాసెట్లు, బెడ్స్ తదితరాలను కొనుగోలు చేశారు. కాగా, ఈ పనిని మాత్రం కేవలం నామినేషన్ పద్ధతిపైనే అప్పజెప్పారు. గత పాలకవ ర్గ సమయంలోనే అప్పటి జెడ్పీచైర్మన్ గెస్ట్‌హౌస్‌ను మరమ్మతు చేయించడం, కొత్త ఫర్నిచర్ కొనుగోలు తదితరాల కోసం ఖర్చు పెట్టారు. అయినా, నిర్వహ ణలోపంతో కొంత రిపేర్లకు గురైంది.
దీంతో ఏకంగా రూ.15లక్షలు ఖర్చుపెట్టడం విమర్శల పాలైంది. అదీ అందులో ఏకంగా రూ.5లక్షల పనులకు ఎలాంటి టెండర్ నిర్వహించకుండా, తమవాడైన ఓ కాంట్రాక్టర్‌కు లబ్ధిచేకూర్చేలా నామినేషన్ పద్ధతిపై ఈ పనులు అప్పజ్పెడం విశేషం. కొత్త పాలకవర్గం కొలువుదీరాక కూడా సదరు కాంట్రాక్టర్‌కు ఉపాధి కల్పించే పనిలో ఉన్నారు. జెడ్పీచైర్మన్ చాంబర్, యాంటీ రూం అన్నీ కూడా ఆధునికంగానే తయారు చేశారు. అయినా, మరోసారి రూ.5లక్షలు వెచ్చించి చాం బర్‌కు రిపేర్లు చేయాలని నిర్ణయించారు. అదీ ఎలాంటి టెండర్ నిర్వహించకుండా, మళ్లీ నామినేషన్ పద్ధతిపైన.. ‘ జెడ్పీ పనుల దత్తపుత్రుడిగా ’ పేరున్న కాంట్రాక్టర్‌కే ఈ పనులు కూ డా అప్పజెబుతున్నారని సమాచారం. విద్యుత్ షార్ట్ సర్య్కూట్ కారణంగా తగలబడి పోయిం దని చెబుతున్న జెడ్పీ సమావేశ మందిరాన్ని ఆధునికీకరించేందుకు అధికారులు ఇప్పటికే రూ.40లక్షలతో ప్రతిపాదనలు తయారు చేసి ప్రభుత్వానికి నివేదికలు పంపించారు.
ఇంకా, ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతీ రాలేదు. దీనిలో భాగంగానే అవసరమైన మేర జెడ్పీచైర్మ న్ చాంబర్‌కు మరమ్మతులు చేయించే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. కానీ ఇదేమీ పట్టించుకోకుండా ఏసీల్లో ఎలుకలు కని పించాయన్న సాకుతో, ఎలాంటి అంచనాలు సిద్ధం చేయకుండానే, ఎలాంటి టెండర్లు పిలవకుండానే రూ.5లక్షలతో రిపేర్ పనులకు సిద్ధమవుతున్నారు. ఈ మొత్తంతో ఏసీలు, సీలింగ్‌కు పీఓపీ, టాయిలెట్ల మరమ్మతులు చేపట్టాలని నిర్ణయించినట్లు సమాచారం. ‘వాస్తవానికి ఈ పనులు ఇప్పుడు ప్రత్యేకంగా చేపట్టాల్సిన పనిలేదు. కేవలం రాజకీయ ఒత్తిళ్లతో, ఎవరికో లబ్ధి చేకూరేందుకే ఈ పనులు...’ అని జిల్లా పరిషత్ అధికార వర్గాలు వ్యాఖ్యానించాయి.