
అనితారెడ్డి
‘మా అమ్మానాన్న ఆండాళమ్మ, స్వామిరెడ్డిలకు మేము నలుగురు కూతుళ్లమే. అమ్మాయిలని వివక్ష చూపకుండా.. విలువ కట్టలేని ప్రేమను పంచి మమ్మల్ని మా అమ్మానాన్న బాగా పెంచారు. అందరినీ చదివించారు. నేను డాక్టర్‌గా ఎదగాలన్నది నాన్న ఆకాంక్ష. ఈ గమ్యాన్ని చేరడంతో ఎంతో సంతోషపడ్డారు. అమ్మ మూడేళ్ల క్రితం మా నుంచి దూరమైంది. అప్పటి నుంచి నాన్న బాగోగులు బిడ్డలమే చూసుకుంటున్నాం. కొడుకులేని లోటు తీరుస్తున్నాం. ఒక ఆడబిడ్డగా దేవుడు మాకిచ్చిన వరమిది’ అని జిల్లా పరిషత్ నూతన చైర్‌పర్సన్ డాక్టర్ తీగల అనితారెడ్డి చెప్పారు. ఆమె ‘సాక్షి’తో మాట్లాడుతూ తన విశేషాలను పంచుకున్నారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే..
సాక్షి, రంగారెడ్డి జిల్లా: మా అమ్మనాన్నలది హయత్‌నగర్ మండలం అనాజ్‌పూర్. అప్పట్లో మలక్‌పేట టీవీ టవర్ వద్ద ఉండేవాళ్లు. మాకు దగ్గర్లోని తిరుమల హిల్స్‌లో నా భర్త హరినాథ్‌రెడ్డి వాళ్ల ఇల్లు. ఒకే ప్రాంతంలో ఉన్నప్పటికీ ఒకరి కంట ఒకరం పడలేదు. మాది పెద్దలు కుదిర్చిన వివాహమే. పెళ్లి నాటికే మా ఇద్దరిదీ ఎంబీబీఎస్ పూర్తయింది. వివాహం తర్వాత నేను ఉన్నత చదువులు అభ్యసించడంలో హరి ప్రోత్సాహం ఎంతో ఉంది. నేను గుల్బర్గాలో ఎండీ, డీజీఓలో చేరగా.. ఆయన తమ విద్యా సంస్థల నిర్వహణ బాధ్యతలు చూసుకునేవారు. పీజీలో ఉండగానే కూతురు త్రిష పుట్టింది. మూడు నెలల వయసులో పాపను అత్తమ్మ దగ్గరే ఉంచాను. ఆలనాపాలనా తనే చూసుకున్నారు. అప్పుడు పరీక్షలు ఉండటంతో గుల్బర్గా వెళ్లక తప్పలేదు. ఇలా పీజీ అయ్యే వరకు వారానికోసారి పాప వద్దకు వచ్చే వెళ్లేదాన్ని. మాది ఉమ్మడి కుటుంబం కావడంతో ఎటువంటి ఇబ్బందీ రాలేదు. ఆప్యాయతకు, అనురాగానికి ఏమాత్రం కొదవ లేదు. మామ తీగల కృష్ణారెడ్డి, అత్తయ్య అరుంధతి, మరిది అమర్‌నాథ్‌రెడ్డి, తోటి కోడలు తులసి, మా వారు, ఇద్దరు పిల్లలం కలిసే నివసిస్తాం. నిత్యం ఎవరి బిజీలో వాళ్లుంటారు. ప్రతి శనివారం సాయంత్రం అందరం కలిసే భోజనం చేస్తాం. మా ఆడపడుచు కుటుంబమూ ఈ విందుకు హాజరవుతుంది. సమయాన్ని బట్టి కలిసే చోటు మారుతుంది. ఇలా ఇంటిల్లిపాదితో వారానికోసారి భేటీ ఉండటం గొప్ప సంతోషానిచ్చే అంశం.
చిన్నప్పటి నుంచి టాపర్‌ని
బాల్యం నుంచి చదువుల్లో ముందజలో ఉండేదాన్ని. పోటీతత్వం, ఇష్టంతో చదివేదాన్ని. ఏ క్లాస్‌ని తీసుకున్నా ఫస్ట్ లేదా సెకండ్ వచ్చేదాన్ని. టెన్త్ వరకు హైదరాబాద్‌లో చదవగా.. విజయవాడలో ఇంటర్ పూర్తయింది. గుల్బర్గాలోని ఎంఆర్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్, ఎండీ, డీజీఓ చేశా. వైద్య విద్యలో పీజీ కాగానే నగరంలో ఓవైసీ ఆస్పత్రికి అనుబంధంగా ఉన్న డక్కన్ మెడికల్ కాలేజీలో ఐదేళ్లపాటు అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తూ ఇదే ఆస్పత్రిలో వైద్య సేవలందించాను. అనంతరం రెండేళ్లపాటు మహబూబ్‌నగర్‌లోని ఎస్వీఎస్ మెడికల్ కాలేజ్‌లో అసోసియేట్ ప్రొఫెసర్‌గా కొనసాగాను. మామ, మా ఆయన ప్రోత్సాహంతో 2010లో దిల్‌సుఖ్‌నగర్‌లో టీకేఆర్–ఐకాన్ మల్టీస్పెషాలిటీ ఆస్పత్రి స్థాపించాను.
స్వీట్స్ తినేందుకు కిలోమీటర్లు వెళ్లేవాళం..
వైద్యవిద్య చదివే సమయంలో నచ్చిన ఆహారం తినేందుకు క్లాస్‌లకు డుమ్మా కొట్టేవాళ్లం. మా కాలేజీకి ఐదు కిలోమీటర్ల దూరంలో రసమలై స్వీట్ తినేందుకు వెళ్లేవాళ్లం. అలాగే అక్కడ ఆశీర్వాద్ హోట్‌లో చికెన్ ఫ్రైడ్ రైస్, జనతా ఐస్‌క్రీం పార్లర్‌లో వివిధ రకాల ఫేవర్లలో ఐస్‌క్రీంలు చాలా ఫేమస్. చాలా ఆకర్షనీయంగా, టేస్టీగా ఉండటంతో తరగతులకు డుమ్మాకొట్టి ఆ రుచులను ఆస్వాదించేవాళ్లం. మా బెస్ట్ ఫ్రెండ్స్ మ్తొతం ఏడుగురు. ఎక్కడికి వెళ్లినా మేమంతా ఒకే జట్టుగా కదిలేవాళ్లం.
16ఏళ్ల నాటి కోరిక.. నెరవేరిన వేళ
పెళ్లయిన కొత్తలో మేమిద్దరం మారీషస్‌కి వెళ్లాం. హెలికాప్టర్ రైడ్ చేయాలన్న కోరికను ఆయన ముందుంచా. అయితే, ఆ రైడ్ చేయడం వీలుపడలేదు. ఈ విషయాన్ని 16 ఏళ్లపాటు తనలో దాచుకున్న ఆయన నా 40వ పుట్టిన రోజు సందర్భంగా నిజం చేశారు. సౌతాఫ్రికాకు తీసుకెళ్లి ముందస్తు సమాచారం ఇవ్వకుండా అక్కడ హెలికాప్టర్ రైడ్ చేయించారు. ఈ ఘటన చాలా సర్‌ప్రైజ్ కలిగించింది. ఆ క్షణాన నాకసలు మాటలు రాలేదు. నా ఇష్టం పట్ల ఆయన చూపిన ప్రేమ నా జీవితకాలపు తీపిజ్ఞాపకం. వైద్య వృత్తి వల్ల నేను.. టీకేఆర్ విద్యాసంస్థల నిర్వహణలో మా భర్త చాలా బిజీ. ఉదయం లేచింది మొదలు రాత్రి 8 గంటల వరకు ఈ వ్యవహారాలే ఉంటాయి. కానీ, ప్రతి ఆదివారం పూర్తిగా మేం కుటుంబానికే కేటాయిస్తాం. ఆ రోజు ఎటువంటి పనులూ పెట్టుకోం. ఆయనది విశాల మనస్తత్వం. అన్నీ అర్థం చేసుకోగల గొప్ప వ్యక్తిత్వం ఆయన సొంతం.
నాన్‌వెజ్ అంటే మహాఇష్టం..
మావారికి నాన్‌వెజ్ అంటే ఇష్టం. మటన్ మహాఇష్టం. మా ఇద్దరు పిల్లలు త్రిష, కృష్ణారెడ్డిలు కూడా వాళ్ల నాన్ననే అనుసరిస్తారు. రోజు వడ్డించినా వద్దనకుండా లాగించేస్తారు. నేనేమో నాన్‌వెజ్‌కు కొంచెం దూరం. నాన్‌వెజ్‌ని నేనే వండాలి..వడ్డించాలి. ఇక ఆరోజు క్రికెట్ ఉంటే పండగే. వారి ముంగిటకే వంటకాలను తీసుకెళ్లాలి. ఆ మ్యాచ్ అయ్యేదాకా టీవీని వదలరు. నేను పెద్దగా టీవీ చూడను. చూసే సమయమూ ఉండదు. పిల్లల చదువులో మాత్రం చాలా సీరియస్‌గా ఉంటాను. ఎక్స్‌ట్రా యాక్టివిటీస్, ఎడ్యుకేషన్‌కు అధిక ప్రాధాన్యత ఇస్తాను. నన్ను స్ఫూర్తిగా తీసుకున్న మా కూతురు డాక్టర్ కావాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం నీట్‌లో మెరిట్ వచ్చింది. ఎంబీబీఎస్‌లో చేరనుంది. అబ్బాయి.. సెకండ్ క్లాస్. సినిమాలో విషయంలో మా అభిరుచులు వేరు. నేను హిందీ సినిమాలు చూస్తా, ఆయన తెలుగు కామెడీ మూవీలు ఎక్కువగా చూస్తారు. అయినా ఒకరి అభిప్రాయాలను మరొకరం గౌరవిస్తూ రెండు భాషల సినిమాలకు వెళ్తుంటాం. బేసిక్‌గా నేను చిరంజీవి ఫ్యాన్‌ని. జగదేకవీరుడు.. అతిలోకసుందరి బాగా నచ్చిన సినిమా.
సేవకు కదిలి.. ప్రాణాలు కాపాడి
మా ఆస్పత్రికి గ్రామీణ ప్రాంత మహిళలు అధికంగా వస్తుంటారు. వాళ్లంతా పెద్దగా పరిశుభ్రతను, ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా పూర్తి సమయాన్ని కేటాయిస్తున్నారని తెలిసింది. విశ్రాంతి పెద్దగా తీసుకోరని, మానసిక, శారీరక ఒత్తిడికి గురవుతున్నట్లు నా కౌన్సెలింగ్ ద్వారా తేలింది. ఇటువంటి మహిళలు చాలా మంది అనారోగ్యం పాలవుతున్నారు. ముఖ్యంగా డయాబెటిస్, హైపర్ టెన్షన్, థైరాయిడ్ వంటి వారిని వేధిస్తున్నాయి. తొలుత వారికి చైతన్యం కల్పించడం ద్వారా కొంత అనారోగ్య సమస్యలను దూరం చేయవచ్చని భావించా.
ఇందుకోసం ‘ఆర్ట్’ ఫౌండేషన్‌ను స్థాపించి.. గ్రామీణ మహిళల్లో పరిశుభ్రత, ఆరోగ్యంపై విస్తృతంగా అవగాహన కల్పించాం. 60కి పైగా క్యాంపులు ఏర్పాటు చేశాం. అలాగే ప్రభుత్వ పాఠశాలల బాలికల్లోనూ చైతన్యం తెచ్చాం. దీంతోపాటు రొమ్ము, గర్భాశయ క్యాన్సర్ స్క్రీనింగ్‌ని మా ఆస్పత్రిలో ఉచితంగా చేయించాం. ఇలా 1,350 మంది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగా.. ఇందులో నలుగురికి క్యాన్సర్ ఉన్నట్లు తేలింది. ప్రాథమిక స్థాయిలోనే గుర్తించడంతో వీరి ప్రాణాలను కాపాడగలిగాం. ఇప్పటికే నిత్యం ఒక గంట ఆ ఆస్పత్రిలో గర్భిణులకు ఉచిత ఓపీ సౌకర్యాన్ని కొనసాగిస్తున్నాం.

అత్త, పిల్లలకు భోజనం వడ్డిస్తున్న అనితారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment