![ZP Chairperson Shobha Comments on Disha Case - Sakshi](/styles/webp/s3/article_images/2019/12/12/shobha.jpg.webp?itok=0XJAPlBr)
కామారెడ్డి జెడ్పీ చైర్‌పర్సన్ శోభ
‘దిశ’ ఘటనపై కామారెడ్డి జెడ్పీ చైర్‌పర్సన్ శోభ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. తల్లిదండ్రులతో సఖ్యత లేకపోవడం వల్లే దిశ తన చెల్లికి ఫోన్ చేసిందని పేర్కొన్నారు.
కామారెడ్డి క్రైం: దిశ ఘటనపై కామారెడ్డి జెడ్పీ చైర్‌పర్సన్ దఫేదార్ శోభ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. దిశ తన చెల్లెలికి కాకుండా తల్లిదండ్రులకు ఫోన్ చేసి ఉంటే వారు వచ్చి తీసుకెళ్లేవారన్నారు. తల్లిదండ్రులతో దిశకు సఖ్యతతో లేనట్లు కనిపిస్తోందన్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి. కామారెడ్డి జిల్లాపరిషత్ స్థాయీ సంఘాల సమావేశం మంగళవారం స్థానిక జెడ్పీ కార్యాలయంలో జరిగింది. సమావేశంలో భాగంగా విలేకరులను ఉద్దేశించి మాట్లాడిన చైర్‌పర్సన్ దిశ ఘటనపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ సమయంలో దిశ తన సోదరికి కాకుండా తండ్రికి ఫోన్ చేయాల్సిందన్నారు. గెజిటెడ్ ఆఫీసర్ అయిన ఆమె తండ్రి వెంటనే అక్కడికి వచ్చి తీసుకువెళ్లేవారన్నారు. దిశ తన పేరెంట్స్ దగ్గర ధైర్యాన్ని కోల్పోయిందన్నారు. తమ పిల్లలకు తల్లిదండ్రులు ధైర్యాన్ని ఇవ్వాలన్నారు. అప్పటి వరకు ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉంటాయన్నారు. వీటిని ప్రభుత్వం ఎక్కడ ఆపగలదని ప్రశ్నించారు. ప్రతి ఒక్కరిని ప్రభుత్వం చూసుకోవడం ఎలా సాధ్యపడుతుందన్నారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి.
సరిగా అర్థం చేసుకోలేదు..
తన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో జెడ్పీ చైర్‌పర్సన్ స్పందించారు. బుధవారం ఈ విషయమై ఓ ప్రకటన విడుదల చేశారు. దిశ సంఘటన ఎంత బాధాకరమైనదో చెప్పడం మాటలకందని విషయమని పేర్కొన్నారు. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఒక ప్రజాప్రతినిధిగా కాకుండా ఒక మహిళగా, ఆడబిడ్డల తల్లిగా ప్రతిస్పందించానని వివరించారు. సభలు, సమావేశాలలో దిశ సంఘటనను తీవ్రంగా ఖండించడంతోపాటు సాటి మహిళగా ఆవేదనను వ్యక్తం చేశానని పేర్కొన్నారు. మంగళవారం కామారెడ్డిలో జరిగిన ఒక సమావేశంలో తాను మాట్లాడిన మాటలను కొంతమంది మీడియా మిత్రులు సరిగ్గా అర్థం చేసుకోకుండా వక్రీకరించడం బాధగా ఉందని పేర్కొన్నారు. ఏదైనా బాధాకరమైన సంఘటన జరిగినప్పుడు పిల్లలు తమ తల్లిదండ్రులతో స్వేచ్ఛగా పంచుకునే విధంగా సంబంధాలు ఉండాలన్నది తన ఉద్దేశమని వివరించారు. తన వ్యాఖ్యలు ఎవరి మనసునైనా నొప్పిస్తే క్షమించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment