అవి ఓకే.. మరి ఇవి? | ZPTC Elections Updates In Warangal | Sakshi
Sakshi News home page

అవి ఓకే.. మరి ఇవి?

Published Tue, Jun 11 2019 11:15 AM | Last Updated on Tue, Jun 11 2019 11:15 AM

ZPTC Elections Updates In Warangal - Sakshi

సాక్షి, వరంగల్‌: జిల్లా ప్రజా పరిషత్‌ల తుదిరూపుపై స్పష్టమైన మార్గదర్శకాలు అందకపోవడంతో అధికార యంత్రాంగం మల్లగుల్లాలు పడుతోంది. ఈనెల 7, 8వ తేదీల్లో ఎంపీపీ, జిల్లా పరిషత్‌ చైర్మన్ల ఎన్నికతో ప్రాదేశిక ఎన్నికల ప్రక్రియ ముగిసింది. ఉమ్మడి వరంగల్‌లోని ఆరు జిల్లా పరిషత్‌లు, మండల పరిషత్‌ల అధ్యక్షుల ఎన్నిక పూర్తి కాగా కొత్త పాలకవర్గాలు కొలువుదీరడమే మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో కొత్త జిల్లాల్లో జిల్లా పరిషత్‌ కా ర్యాలయాల ఏర్పాటు, సిబ్బంది, ఉద్యోగుల కేటాయింపు, మౌలిక వసతులపై మార్గదర్శకాలు అందకపోవడంతో అధికారులు సందిగ్దావస్థలో ఉన్నారు.

గత ఐదునెలలుగా ఎంపీటీసీ స్థానాల పునర్విభజన, రిజర్వేషన్ల ఖరారు, ఓటర్ల జాబితా తయారీ, పోలింగ్, లెక్కింపు, పాలకవర్గాల ఎన్నిక ప్రక్రియలో జెడ్పీ అధికారులు తలమునకలై ఉన్నారు. ఇక కొత్త పాలకవర్గాలు వచ్చే నెల 5వ తేదీ కొలువు దీరేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాల్సి ఉంది. అయితే, జిల్లా పరిషత్‌ల కొత్త భవనాలు, సిబ్బంది కేటాయింపు, మౌలిక సదుపాయాల కల్పన కోసం ముందుకు సాగాలంటే ప్రభుత్వం నుంచి సూచనలు, సలహాలతో కూడిన మార్గదర్శకాలు అందకపోవడంతో గందరగోళం నెలకొంది.

ఉద్యోగుల విభజన, కేటాయింపే సమస్య
ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో 2014 ఎన్నికల సమయంలో ఒకే జిల్లా పరిషత్, 50 మండల పరిషత్‌లు ఉండగా... జిల్లా పునర్విభజన తర్వాత ప్రస్తుతం ఆరు జిల్లా ప్రజాపరిషత్‌లు, 71 మండల పరిషత్, జెడ్పీటీసీ స్థానాలు ఏర్పడ్డాయి. వరంగల్‌ అర్బన్, వరంగల్‌ రూరల్, జయశంకర్‌ భూపాలపల్లి, జనగామ, మహబూబాబాద్, ములుగు జిల్లా పరిషత్‌లు, ఆ జెడ్పీల పరిధిలో 70 జెడ్పీటీసీ, 780 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఆరు జిల్లా పరిషత్‌లకు చైర్మన్లు, వైస్‌ చైర్మన్లు, కోఆప్షన్‌ సభ్యుల ఎన్నిక కూడా పూర్తయింది. ఇక 67 మండల పరిషత్‌లకు ఎంపీపీలు, వైస్‌ ఎంపీపీలు, కోఆప్షన్‌ సభ్యులు కూడా ఎన్నికయ్యారు. ఈ ప్రక్రియ మొత్తం సజావుగానే సాగినా జిల్లా పరిషత్‌ విభజనపై ఇప్పటికీ మార్గదర్శకాలు అందలేదు.

కొత్త పాలకవర్గాలు కొలువు దీరేందుకు అవసరమైన కొత్త భవనాలు, సిబ్బంది కేటాయింపు, మౌలిక సదుపాయాల కల్పనపై కసరత్తుతో పాటు ఉద్యోగులకు పదోన్నతులు ఇస్తారా.. లేదా వర్క్‌ టు సర్వ్‌ కింద ఉన్న సిబ్బందినే ఆయా జిల్లాలకు కేటాయిస్తారా అన్నది తేలాల్సి ఉంది. కాగా జిల్లా పరిషత్‌ల ఏర్పాటుపై పంచాయతీరాజ్‌ కమిషనర్‌ నుంచి ఇంకా పూర్తిస్థాయి మార్గదర్శకాలు అందలేదని అధికారులు చెబుతున్నారు. ఆరు జిల్లాలకు నోడల్‌ జెడ్పీగా ఉన్న వరంగల్‌ జిల్లా పరిషత్‌ పరిధిలోని ఉద్యోగుల వివరాలు కేడర్ల వారీగా.. ఇప్పటి వరకు ఉన్న మౌలిక సదుపాయాలు, సామగ్రి వివరాలను రెండు నెలల క్రితమే ఉద్యోగులు కమిషనర్‌కు నివేదించారు.

ప్రస్తుతం 74 మంది..
వరంగల్‌ జెడ్పీలో ప్రస్తుతం జెడ్పీ సీఈఓ, డిప్యూటీ సీఈఓతో పాటు 8 మంది సూపరింటెండెంట్లు, ఆరుగురు సీనియర్‌ అసిస్టెంట్లు, 29 జూనియర్‌ అసిస్టెంట్లు, ఆరుగురు టైపిస్టులు సహా రికార్డు అసిస్టెంట్లు, అటెండర్లు, డ్రైవర్లు మొత్తం 74 మంది ఉన్నారు. కొత్తగా ఏర్పడే ఒక్కో జిల్లా పరిషత్‌కు కనీసం 19 మంది సిబ్బంది అవసరం. సీఈఓ, డిప్యూటీ సీఈఓ, ఇద్దరు సూపరింటెండెంట్లు, ముగ్గురు సీని యర్‌ అసిస్టెంట్లు, ఐదుగురు జూనియర్‌ అసిస్టెంట్లు, ఒక టైపిస్టు, ఆరుగురు ఆఫీస్‌ సబార్డినేట్లు ఇలా మొత్తం ఒక్కో జెడ్పీలో ఎంత తక్కువ అనుకున్నా కనీసం 19 మంది అవసరం అవుతుందని అంచనా. ఈ లెక్కన ఆరు జిల్లాలకు కలిపి 114 మంది అవసరమవుతా రు. అదే విధంగా ఫర్నీచర్, కంప్యూటర్లు, ఫ్యాన్లు, జిరాక్సు యంత్రాలు తదితర సామగ్రి కూడా కావాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో పంచాయతీరాజ్‌ శాఖ ద్వారా పదోన్నతులు కల్పించి కొత్త జిల్లాలకు సిబ్బందిని బదిలీ చేస్తారా లేదా సర్వ్‌ టు రూల్‌ కింద ఆయా జిల్లాల కలెక్టర్లే సిబ్బందిని కేటాయిస్తారా అన్న అంశాలు జిల్లా పరిషత్‌ ఉద్యోగుల్లో ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.

ఎంపీడీఓలు ఏరీ?
ఉమ్మడి జిల్లాలో జిల్లాల పునర్విభజనతో పాటే కొత్త మండలాలు ఏర్పడగా వాటిలో ఎంపీడీఓ కార్యాలయాలు ఏర్పాటు చేయాల్సి ఉంది. వరంగల్‌ అర్బన్, వరంగల్‌ రూరల్, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, జనగాం జిల్లాల్లో ఖిలా వరంగల్, కాజీపేట, ఐనవోలు, వేలేరు, దామెర, టేకుమట్ల, కన్నాయిగూడెం, పలిమెల, గంగారం, చిన్నగూడూరు, దంతాలపల్లి, పెద్ద వంగర, తరిగొప్పుల, చిల్పూరు తదితర మండలాలు ఏర్పడగా ప్రాదేశిక ఎన్నికలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ మండలాల్లో కొత్త ఎంపీడీఓ కార్యాలయాల ఏర్పాటుతోపాటు ఉద్యోగులను విభజించి కేటాయించాల్సి ఉంది.

ఒక్కో మండల పరిషత్‌కు కనీసం 9 మంది ఉద్యోగులను నియమిస్తే పాలన సాఫీగా కొనసాగుతుందని అధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపారు. ఓ ఎంపీడీఓ, సూపరింటెండెంట్, సీనియర్‌ అసిస్టెంట్, జూనియర్‌ అసిస్టెంట్, టైపిస్టు, నలుగురు ఆఫీస్‌ సబార్డినేట్లు అవసరమని పేర్కొన్నారు. కాగా, కొత్త కార్యాలయాలు, సిబ్బంది కేటాయింపుల మార్గదర్శకాలు సైతం జెడ్పీకి ఇంకా రాలేదని అధికారిక సమాచారం. ఇదిలా ఉంటే ఇటీవల జిల్లా పరిషత్‌  చైర్మన్లు, వైస్‌ ఛైర్‌పర్సన్లతో పాలకవర్గాలు ఏర్పడగా.. వచ్చే జులై 5న కొత్త పాలకవర్గాలు కొలువుదీరాల్సి ఉంది. ఈలోగా కొత్త జిల్లా పరిషత్‌ కార్యాలయాలతో పాలన ప్రారంభిస్తారా లేదా.. అద్దె భవనాల్లోనా, ఖాళీగా ఉన్న ప్రభుత్వ భవనాలను జెడ్పీకి కేటాయిస్తారా? అన్న దానిపై స్పష్టత లేదు. ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు వస్తే తప్ప ఏమీ చేయలేని పరిస్థితి నెలకొందని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. 

ఉమ్మడి జిల్లాలో ఇలా... 

జిల్లా పరిషత్‌లు 06
మండల పరిషత్‌లు
(4 మండలాల్లో ఎన్నికల ప్రక్రియ పూర్తికాలేదు)
71
ప్రస్తుతం వరంగల్‌ జెడ్పీలో ఉద్యోగులు 74
ఒక్కో కొత్త జెడ్పీకి కావాల్సిన ఉద్యోగులు 19
ఒక్కో ఎంపీడీఓ కార్యాలయానికి కావాల్సిన ఉద్యోగులు 9

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement