‘‘నేను ఏ కథ రాసినా క్రైమ్ వైపు మర్డర్ వైపు వెళ్లిపోతుంది. నాకు అలాంటి సినిమాల మీదే ఎక్కువ ఆసక్తి ఉండటం కూడా కారణం అనుకుంటా. నేను చేస్తున్న సినిమాలతో నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నాకు రాని జానర్‌లు ట్రై చేసి హీరోల కెరీర్‌లు, నిర్మాతల డబ్బులు రిస్క్‌లో పెట్టదలుచుకోలేదు’’ అన్నారు సుధీర్ వర్మ. శర్వానంద్ హీరోగా సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రణరంగం’. కాజల్ అగర్వాల్, కల్యాణీ ప్రియదర్శన్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని పీడీవీ ప్రసాద్ సమర్పణలో నాగవంశీ నిర్మించారు. ఈ సినిమా రేపు విడుదల కానున్న సందర్భంగా సుధీర్ వర్మ చెప్పిన విశేషాలు.
- ఈ కథను రవితేజగారితో తీయాలని సిద్ధం చేసుకున్నాను. ఆయన వేరే సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ మధ్యలో శర్వానంద్, నేను ఓ సినిమా చేయాలనుకున్నాం. కొన్ని కథలు అనుకున్నాం. మాటల్లో రవితేజగారి కోసం అనుకున్న కథ గురించి చెప్పాను. నచ్చి, చేస్తాను అన్నాడు శర్వా. రవితేజగారిని అడిగితే చేసుకోమన్నారు.
- శర్వా సినిమాల్లో నాకు ‘ప్రస్థానం’ బాగా ఇష్టం. అందులో తన పాత్ర చాలా డెప్త్‌గా ఉంటుంది. తనతో చేస్తే ఇంటెన్స్ సబ్జెక్టే చేయాలనుకున్నాను. ఈ సినిమాతో అది కుదిరింది. ఇందులో హీరో పాత్ర రెండు షేడ్స్‌లో ఉంటుంది. 40 ఏళ్ల వయసు పాత్రలో శర్వా సూట్ అవుతాడా? అని చిన్న సందేహం ఉంది. లుక్ టెస్ట్ జరిగాక పూర్తి నమ్మకం వచ్చేసింది.
- ఈ సినిమాకు ముందు ‘దళపతి’ టైటిల్ పెట్టాలనుకున్నాం. కానీ అది వేరేవాళ్లు రిజిస్టర్ చేసుకున్నారు. మా నిర్మాత నాగవంశీగారు ‘రణరంగం’ టైటిల్ సూచించారు. నా కెరీర్‌లో చాలెంజింగ్ సినిమా ఇది. ఈ సినిమా కథ 1990 నుంచి 2015 వరకూ జరుగుతుంది. 1990 కాలంలో జరిగిన సీన్లు చిత్రీకరించినప్పుడు కొంచెం కష్టపడాల్సి వచ్చింది. అందుకే ఓ కాలనీ సెట్‌ను హైదరాబాద్‌లో వేశాం.
- ‘స్వామిరారా’ తర్వాత చినబాబుగారు అడ్వాన్స్ ఇచ్చారు. ఇప్పటికి వాళ్ల బ్యానర్‌లో చేయడానికి కుదిరింది. ఈ సినిమాకు బడ్జెట్ ఎంతైందో నాకు తెలియదు. నాగవంశీ అంత ఫ్రీడమ్ ఇచ్చారు. నెక్ట్స్ సినిమా మాకే చేయాలి.. ఏ హీరో కావాలని అడుగుతుంటారు.
- సినిమా ప్రోమోల్లో కాజల్‌ను ఎక్కువ చూపించకపోవడానికి కారణం తనది చిన్న పాత్ర కావడమే. ప్రేక్షకుడు సినిమాకి వచ్చి నిరాశ చెందకూడదు.
- కమర్షియల్ స్టైల్‌లో చేసిన ‘దోచేయ్’ అనుకున్నంత ఆడలేదు. ఈ సినిమాను నాకు నచ్చిన విధంగా తీశాను. ఏమనుకున్నానో అదే తీశాను. ఏ సినిమా అయినా నాకు కంఫర్ట్‌బుల్‌గా ఉండేలా, నాకు తెలిసిందే తీస్తాను.
- ఈ సినిమాకు సీక్వెల్ తీయొచ్చు అనే ఐడియాను శర్వానంద్ ఈ మధ్య చెప్పాడు. ఐడియా బావుంది. చూడాలి. నెక్ట్స్ రవితేజగారితో సినిమా ఉంటుంది.
- ఈ సినిమా రెండేళ్ల నుంచి మేకింగ్‌లో ఉంది. సుమారు 700 రోజుల్లో మేం షూట్ చేసింది 70 రోజులు మాత్రమే. శర్వా ‘పడిపడి లేచె మనసు’ పూర్తయ్యే వరకు వేచి ఉండాల్సి వచ్చింది. ఆ సినిమాలో లుక్ ఇందులో లుక్ డిఫరెంట్. అందుకే ఆలస్యం అయింది.
- ఈ సినిమా ఐడియాను ‘గాడ్ ఫాదర్ 2’ నుంచి తీసుకున్నాను. మనం ఎక్కడ నుంచి స్ఫూర్తి పొందామో ముందే చెప్పేస్తే ఇది అందులో ఉంది.. ఇందులో ఉంది అని చెప్పకుండా చూస్తారని నమ్ముతాను.
Comments
Please login to add a commentAdd a comment