షాలినీపాండే
సాక్షి, సిటీబ్యూరో: ‘అవును.. నేను ప్రేమలో ఉన్నాను. నా ఫ్యామిలీ, ఫ్రెండ్స్.. ఇలా అందరినీ ప్రేమిస్తాను. అలాగని మీరంటున్న ప్రేమలో పడనని కాదు. ఎప్పుడు ప్రేమలో పడతామో చెప్పలేం. అది తెలియకుండా జరిగిపోతుంది. ఇప్పుడు మాత్రం ప్రేమలో లేన’ని చెప్పింది షాలినీపాండే. ‘అర్జున్‌రెడ్డి’ సినిమాతో అందరినీ ఆకట్టుకున్న ఈ బొద్దుగుమ్మ.. కుటుంబంతో గడిపే సమయమే చిక్కడం లేదు. ఇక ప్రేమలో పడే సమయం ఎక్కడా? అని సెలవిచ్చింది. తొలి సినిమాతోనే ప్రశంసలందుకున్న షాలిని... ఇప్పుడు ‘నా ప్రాణమే’ పాటతో ఓ మ్యూజిక్ ఆల్బమ్‌లో మెరిసింది. వాలెంటైన్స్ డేకి విడుదలైన ఈ ఆల్బమ్ మంచి హిట్స్ సాధించింది. సింగర్‌గానూ అలరించిన షాలిని ‘సాక్షి’తో పంచుకున్న విశేషాలివీ...
షాలినీపాండే
నేను థియేటర్ (రంగస్థలం) బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చాను. రంగస్థలం, సినిమా రెండు వేర్వేరు. నాటకంలో ప్రత్యక్షంగా ప్రేక్షకుల స్పందన చూస్తూ పాత్రను పండించాల్సి ఉంటుంది. సినిమా పూర్తయి విడుదలైతే గానీ ప్రజల అభిప్రాయం తెలియదు. అయితే దేని గొప్పదనం దానిదే. నా మట్టుకు నాకు అభినయానికి అవకాశమున్న పాత్ర లభిస్తే ఏదైనా ఇష్టమే. ప్రస్తుతం తెలుగులో ‘సావిత్రి’ సినిమాలో ప్రాధాన్యమున్న పాత్ర పోషిస్తున్నాను. ఇంకా కొన్ని చర్చల్లో ఉన్నాయి. తమిళంలో రెండు సినిమాలు చేస్తున్నాను. ఒక భాషా పరిశ్రమలో సెటిలవ్వాలని అనుకోవడం లేదు. ఏ భాషలో అయినా సరే పాత్ర బాగుండాలి.
అది నేను చేయాలి అనుకోవాలి. అభినయానికి అవకాశం ఉండాలి. అర్థరహిత పాత్రలు చేయాలనుకోవడం లేదు. నటించడం నాకు ఇష్టం. అలాగే డ్యాన్స్ కూడా పెర్ఫార్మెన్స్‌లో భాగమేనని నా అభిప్రాయం. అలాగే ఇప్పుడు టాప్‌లో ఉన్న వారిని చూసి, ఆ పొజిషన్‌లోకి వెళ్లాలనే లక్ష్యాలు పెట్టుకోను. నాకు రోల్ మోడల్స్ అంటూ లేరు. మాధురి దీక్షిత్, గురుదత్, కమల్‌హాసన్... ఇలా ఎందరినో అభిమానిస్తాను. వారి అభినయాన్ని ఇష్టపడతాను. అయితే ప్రేక్షకులకు నేను షాలినిగా మాత్రమే గుర్తుండాలి. నాకు సొంత ఐడెంటిటీ ఉండాలి. నటన అనేది నాకొక ప్రొఫెషన్ మాత్రమే కాదు... అదొక ఎమోషనల్ థింగ్ ఫర్ మి.
నాకు పాటలంటే మహా ఇష్టం. సంగీతం మాత్రం నేర్చుకోలేదు. మా అమ్మగారు క్లాసికల్ సింగర్. ఓ రకంగా ఈ సింగింగ్ టాలెంట్ కొంతం దైవ ప్రసాదం, కొంత అమ్మ నుంచి వచ్చింది. బెంగళూర్‌కి చెందిన లగోరి బ్యాండ్‌ని ముంబైలో తొలిసారి కలిశాను. నాలుగేళ్లుగా వారితో ప్రయాణం సాగుతోంది. విభిన్న భాషల్లో పాటలు విడుదల చేసిన వీరు... వాలెంటైన్స్ డేకి తెలుగులో పాట రూపొందించాలని అనుకున్నారు. తెలుగులో పాడడం అనగానే నేను వెంటనే ఒప్పుకున్నాను. ఈ ఆల్బమ్‌ను బెంగళూర్‌లో సినిమా షూటింగ్‌లు చేసే ప్లేస్‌లో కేవలం ఒక్క రోజులోనే షూటింగ్ చేశారు. ఇందులో నాతో పాటు బ్యాండ్‌కు చెందిన గాయకుడు తేజాస్ మేల్ వాయిస్ ఇచ్చారు. గీత్ బ్యాండ్ మేనేజర్, సినీ గీత రచయిత కృష్ణకాంత్ పాట రాశారు. కరణ్ చావ్లా డైరెక్టర్‌గా వ్యవహరించారు. వ్యక్తిగతంగా ఈ ఆల్బమ్ చాలా ఆనందాన్నిచ్చింది. ఇంకెవరైనా మంచి కాన్సెప్ట్‌తో వస్తే ఇలాంటి ఆల్బమ్స్ చేయడానికి నేను రెడీ. భవిష్యత్తులో సొంత సినిమాల్లో పాడే అవకాశం వస్తే ఫుల్ హ్యాపీ.
ఐ లైక్ సిటీ...
అర్జున్‌రెడ్డి సినిమా కోసం చాలా రోజులు హైదరాబాద్‌లో ఉన్నాను. ఈ సిటీ నాకు బాగా నచ్చింది. ఇక్కడ ఫుడ్ చాలా బాగుంటుంది. అలాగే నాకు చాలా ఇష్టమైన ప్లేస్‌లు కూడా ఎన్నో ఉన్నాయి. నాకు మంచి ఫ్రెండ్స్ ఉన్నారు. ముఖ్యంగా నా స్టైలిస్ట్ మేఘనతో చాలా టైమ్ స్పెండ్ చేస్తాను. ప్రస్తుతం ముంబై నుంచి హైదరాబాద్, చెన్నైకి రాకపోకలు సాగుతున్నాయి. అయితే హైదరాబాద్‌లో సెటిలవుతానా? మరెక్కడైనానా? అనేమీ అనుకోలేదు.
సరికొత్త షాలిని...
‘అర్జున్‌రెడ్డి’ సినిమాలో ప్రీతి క్యారెక్టర్ కోసం బరువు పెరిగాను. నిజానికి నేను సన్నగా ఉంటాను. ఆ క్యారెక్టర్‌కి బొద్దుగా ముద్దుగా ఉండడం అవసరం కాబట్టి, దానికి అనుగుణంగా బరువు పెరిగాను. అయితే ఇప్పుడు మళ్లీ బరువు తగ్గాను. సో... కొత్త పాత్రలో సరికొత్త షాలినీని చూస్తారు మీరు.
Comments
Please login to add a commentAdd a comment