అలాంటి వాడైతే కచ్చితంగా ప్రేమిస్తానంటోంది ‘ప్రీతి’ అలియాస్ శాలినిపాండే. ఎక్కడో ఉత్తరాదిలో పుట్టిర ఈ అమ్మడు ప్రస్తుతం సౌత్‌లో క్రేజీ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంటున్నారు ప్రీతి. టాలీవుడ్‌లో వచ్చిన ‘అర్జున్‌రెడ్డి’ చిత్రం విజయం సాధించడంతో ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీ అయ్యారు శాలినిపాండే. ‘100 శాతం కాదల్’ చిత్రంతో తమిళ పరిశ్రమకు పరిచయం అవుతున్న శాలినిపాండే ఆ చిత్రం విడుదల కాకముందే మరో రెండు మూడు చిత్రాల్లో నటించే అవకాశాన్ని దక్కించుకున్నారు. ‘100 శాతం కాదల్’ తెలుగులో మంచి విజయాన్ని సాధించిన ‘100% లవ్’ చిత్రానికి రీమేక్ అన్నది గమనార్హం. జీవీ.ప్రకాశ్‌కుమార్ హీరోగా ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. దీంతో పాటు జీవాకు జంటగా గొరిల్లా, విజయ్ ఆంటోని సరసన అగ్ని సిరగుగళ్ చిత్రాల్లోనూ నటిస్తున్నారు శాలిని పాండే.
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాల గురించి ముచ్చటించారు శాలిని పాండే. సినిమాలంటే చిన్నప్పటి నుంచే చాలా ఇష్టం అని పేర్కొన్నారు. చదుకుంటున్నప్పుడే సినిమాల్లో నటించాలన్న ఆసక్తి కలిగిందని చెప్పిందన్నారు. అయితే తాను నటించడం తన తండ్రికి అసలు ఇష్టం లేదని తెలిపారు. వేరేదన్నా ఉద్యోగం చేసుకోమని ఒత్తిడి చేశారని, దీంతో తాను ముంబై వెళ్లి సినిమా అవకాశాల వేటలో పడ్డానని చెప్పింది. ఆ సమయంలో తినడానికే చాలా కష్ట పడ్డానని అన్నారు. అలా కొన్ని నెలల తరువాతనే తెలుగు చిత్రం అర్జున్‌రెడ్డి కోసం నిర్వహించిన ఆడిషన్‌లో ఎంపికై నటించే అవకాశాన్ని పొందినట్లు తెలిపారు. అప్పుడు కూడా ముద్దు సన్నివేశాల్లో, హీరోతో సన్నిహితంగా ఉండే సన్నివేశాల్లో నటింపజేయరాదని దర్శకుడికి తన తండ్రి షరతులు విధించారని చెప్పుకొచ్చారు. అలాంటిది ఆ చిత్రం విడుదలై సక్సెస్ కావడంతో ప్రశంసల వర్షం కురిపించారని అన్నారు.
ఇకపోతే ప్రేమ గురించి అడుగుతున్నారని, నిజ జీవితంలో ‘అర్జున్‌రెడ్డి’ లాంటి వ్యక్తి లభిస్తే కచ్చితంగా ప్రేమిస్తానని చెప్పారు శాలిని పాండే. ‘అర్జున్‌రెడ్డి’ చిత్రం తరువాత చాలా అవకాశాలు వచ్చాయని చెప్పింది. అదే విధంగా రెండేళ్ల సినీ జీవితంలో చాలా నేర్చుకున్నానని అన్నారు. గ్లామరస్‌గా ఫొటోలు దిగి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడం తనకు ఇష్టం ఉండదని తెలిపారు. నటుడు కమలహాసన్, దర్శకుడు మణిరత్నంలకు వీరాభిమానినని చెప్పుకొచ్చారు శాలిని పాండే. ఇక తిండి విషయంలో ఎలాంటి నియమాలు లేవని, వారానికి ఐదు రోజులు మాత్రం శారీరక కసరత్తులు చేస్తానని చెప్పారు. పుస్తకాలు బాగా చదువుతానని, స్నేహితులు తక్కువేనని నటి శాలినిపాండే చెప్పుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment