ఫండ్స్ లోకి 1.5 లక్షల కోట్లు!
ఫండ్స్ లోకి 1.5 లక్షల కోట్లు!
Published Mon, Nov 21 2016 2:18 AM | Last Updated on Mon, Sep 4 2017 8:38 PM
భారీగా నిధులు వస్తాయని మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ అంచనా...
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ నోట్ల రద్దు చర్య(డీమోనిటైజేషన్) ప్రభావంతో ఫండ్స్ ఇతరత్రా ఆర్థిక సాధనాల్లోకి పెట్టుబడులు పోటెత్తనున్నాయని మ్యూచువల్ ఫండ్స్(ఎంఎఫ్) పరిశ్రమ భావిస్తోంది. మధ్యాకాలానికి రిటైల్, హైనెట్‌వర్త్ ఇన్వెస్టర్ల(హెచ్‌ఎన్‌ఐలు) నుంచి ఫండ్‌సలోకి దాదాపు రూ.1.5 లక్షల కోట్ల భారీ నిధులు రావచ్చనేది పరిశ్రమ నిపుణుల అంచనా. అంతేకాకుండా.. రానున్న కొద్ది నెలల్లో ద్రవ్యోల్బణం తగ్గుముఖం, ప్రభుత్వ ఆదాయం పుంజుకోవడం, వడ్డీరేట్ల కోత వంటివి చోటుచేసుకోనున్నాయని వారు చెబుతున్నారు.
దీంతో ఇన్వెస్టర్లు మ్యూచువల్ ఫండ్స్ వంటివాటిలో పెట్టుబడులపై దృష్టిసారించనున్నారని నిపుణులు పేర్కొంటున్నారు. ‘డీమోనిటైజేషన్ వ్యవధి తర్వాత 2-3 క్వార్టర్ల పాటు సర్దుబాట్లు ఉండొచ్చు. ఆతర్వాత స్టాక్ మార్కెట్లు పరుగులు తీస్తాయని(అత్యంత బుల్లిష్ ధోరణి) భావిస్తున్నాం. ప్రధానంగా బ్లాక్ మనీపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో బంగారం, రియల్ ఎస్టేట్‌లలో పెట్టుబడులకు వెనకాడే పరిస్థితులు ఉన్నారుు. దీంతో మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమకు ప్రయోజనం లభించనుంది. వచ్చే మూడేళ్లలో ఎంఎఫ్ పరిశ్రమ రెట్టింపు కావచ్చనేది మా అంచనా’ అని మోతీలాల్ ఓశ్వాల్ అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ(ఏఎంసీ) ఎండీ, సీఈఓ ఆశిష్ సోమయా పేర్కొన్నారు.
‘మొత్తం ఆర్థిక పొదుపు సాధనాల్లో దాదాపు 9 శాతం నగదు రూపంలో(కరెన్సీ నోట్లు) ఉంటాయని అంచనా. క్యాపిటల్ మార్కెట్ అసెట్స్‌లో ఇది 6 శాతమే. ఇప్పుడు డీమోనిటైజేషన్ కారణంగా బంగారం, రియల్టీ ఇతరత్రా సాంప్రదాయ పెట్టుబడులతో పాటు నగదు లావాదేవీలు కూడా తగ్గుముఖం పట్టొచ్చు. దీంతో పెద్ద మొత్తంలో నిధులు క్యాపిటల్ మార్కెట్లోకి వస్తాయని భావిస్తున్నాం’ అని డీహెచ్‌ఎఫ్‌ఎల్ ప్రమెరికా ఏఎంసీ సీఐఓ(ఈక్విటీస్) ఈఏ సుందరం వ్యాఖ్యానించారు. 2015 మార్చి నాటికి బ్యాంకుల్లో వ్యక్తిగత డిపాజిట్ల(కార్పొరేట్లు, ఇతరత్రా సంస్థలు కాకుండా) విలువ దాదాపు రూ.50.6 లక్షల కోట్లుగా అంచనా.
దీంతో పోల్చితే ప్రస్తుతం ఎంఎఫ్‌లలో రిటైల్, హెచ్‌ఎన్‌ఐల పెట్టుబడుల విలువ 15 శాతం(రూ.7.5 లక్షల కోట్లు) మాత్రమే కావడం గమనార్హం. ‘డీయోనిటైజేషన్ ప్రభావంతో బ్యాంకింగ్‌లోకి రూ.8-12 లక్షల కోట్ల నిధులు రావచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఇక ఎంఎఫ్‌ల 15 శాతం వాటా అలాగే కొనసాగినా కూడా మధ్యకాలికంగా చూస్తే రూ.1-1.5 లక్షల కోట్లు రిటైల్, హెచ్‌ఎన్‌ఐల నుంచి ఫండ్‌సలోకి వచ్చే అవకాశం ఉంది’అని ఫండ్‌సఇండియా.కామ్ సహ వ్యవస్థాపకులు, సీఓఓ శ్రీకాంత్ మీనాక్షి పేర్కొన్నారు.
లిక్విడ్, షార్ట్‌టర్మ్ డెట్‌ఫండ్‌సలోకి...
బ్యాంకింగ్ రంగంలోకి అదనపు ద్రవ్య లభ్యత పెరుగుతుండటంతో.. ఈ నిధుల్లో కొంత లిక్విడ్, షార్‌టర్మ్ డెట్ ఫండ్‌సలోకి రావచ్చని క్వాంటమ్ ఏఎంసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జిమ్మీ పటేల్ అభిప్రాయపడ్డారు. మరోపక్క, ద్రవ్యోల్బణం, వడ్డీరేట్ల తగ్గుదల అంచనాల నేపథ్యంలో కొంత మొత్తం షార్ట్‌టర్మ్, డైనమిక్ బాండ్ ఫండ్‌సలోకి ప్రవహించే అవకాశం ఉందన్నారు. ‘ప్రభుత్వ డీమోనిటైజేషన్ చర్యలు.. ఎంఎఫ్ పరిశ్రమ మొత్తానికి సానుకూలంగా నిలవనుంది.
ఇన్వెస్టర్లు సురక్షితమైన, మరింత వ్యవస్థీకృతమైన పెట్టుబడి సాధనాలపైపు దృష్టిసారించనుండటమే దీనికి కారణం’ అని రిలయన్‌స ఎంఎఫ్ సీఈఓ సుదీప్ సిక్కా వ్యాఖ్యానించారు. ఈ ఏడాది అక్టోబర్ నాటికి దేశీయంగా ఎంఎఫ్ పరిశ్రమ మొత్తం నిర్వహణ ఆస్తులు(ఏయూఎం) రూ.16.3 లక్షల కోట్లకు చేరింది. కాగా, డీమోనిటైజేషన్ ప్రభావంతో త్వరలోనే ఈ మొత్తం రూ.20 లక్షల కోట్ల మార్కును అధిగమించే అవకాశం ఉందని సిక్కా పేర్కొన్నారు.
Advertisement