చిన్న పట్టణాల్లో మ్యూచువల్‌ ఫండ్స్‌ హవా | Mutual funds Hava in small towns | Sakshi
Sakshi News home page

చిన్న పట్టణాల్లో మ్యూచువల్‌ ఫండ్స్‌ హవా

Published Thu, Apr 26 2018 1:03 AM | Last Updated on Thu, Apr 26 2018 1:03 AM

Mutual funds Hava in small towns - Sakshi

న్యూఢిల్లీ: చిన్న పట్టణాల్లో మ్యూచువల్‌ ఫండ్స్‌కు ఆదరణ పెరుగుతోంది. 2017–18 ఆర్థిక సంవత్సరంలో ఈ పట్టణాల్లో ఫండ్స్‌ మార్కెట్‌ వాటా 38 శాతం పెరిగింది. ఈ పట్టణాల నుంచి పెట్టుబడుల విలువ రూ.4.27 లక్షల కోట్లకు చేరింది. పరిశ్రమ చేపట్టిన అవగాహన కార్యక్రమం వల్లే చిన్న పట్టణాల్లో (బీ15 ప్రాంతాల్లో) మ్యూచువల్‌ ఫండ్స్‌ ఆస్తులు పెరగడానికి కారణమని ఆన్‌లైన్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాట్‌ఫామ్‌ గ్రో సీవోవో హర్‌‡్షజైన్‌ తెలిపారు. అలాగే, డీమోనిటైజేషన్, రిటైల్‌ ఇన్వెస్టర్ల బలమైన ప్రాతినిధ్యం కూడా ఇందులో ఉందన్నారు. చిన్న పట్టణాల నుంచి మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టుబడుల మొత్తం విలువ గత ఆర్థిక సంవత్సరంలో రూ.1.2 లక్షల కోట్లు లేదా 38 శాతం పెరిగి రూ.3.09 లక్షల కోట్ల నుంచి రూ.4.27 లక్షల కోట్లకు చేరినట్టు మ్యూచువల్‌ ఫండ్స్‌ అసోసియేషన్‌ ‘యాంఫి’ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

సంప్రదాయ సాధనాలైన రియల్‌ ఎస్టేట్, బంగారం నుంచి మ్యూచువల్‌ ఫండ్స్‌ వైపు ఇన్వెస్టర్ల అడుగులు పడుతున్నాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు. మరోవైపు పరిశ్రమలోని మొత్తం 42 అస్సెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీల నిర్వహణలోని ఆస్తుల విలువ గత ఆర్థిక సంవత్సరం ముగింపు నాటికి 26 శాతం వృద్ధితో రూ.23.5 లక్షల కోట్లకు చేరింది. వీటిలో బీ15 ప్రాంతాల వాటా 19 శాతంగా ఉంది. టాప్‌ 15 పట్టణాల నుంచి వచ్చిన పెట్టుబడుల్లో ఈక్విటీల వాటా 36 శాతమే కాగా, బీ15 ప్రాంతాల నుంచి వచ్చిన పెట్టుబడుల్లో 62 శాతం ఈక్విటీల్లోనే ఉండటం విశేషం. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, కోల్‌కతా, అహ్మదాబాద్, పుణె, ముంబై, ఢిల్లీ సహా తొలి 15 పట్టణాలను టీ15గా, మిగిలిన పట్టణాలను బీ15 పట్టణాలుగా పిలుస్తున్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement