100 మంది ఎమ్మెల్యేలకు మొండిచేయి!
న్యూఢిల్లీ: 2017లో ఉత్తరప్రదేశ్ లో జరగనున్న ఎన్నికల్లో దాదాపు వంద మంది ఎమ్మెల్యేలు తమ అభ్యర్ధిత్వాన్ని కోల్పోనున్నారా? అంటే అవుననే గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం అధికారంలో ఉన్న సమాజ్ వాదీ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు వచ్చే ఎన్నికల్లో ఉద్వాసన పలకడానికి నిర్ణయించుకున్నట్లు సమాచారం. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుండటంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
మొత్తం 403 నియోజకవర్గాలు కలిగిన అతిపెద్ద రాష్ట్రంలో సమాజ్ వాదీ పార్టీకి 229 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారు. రాజ్యసభకు ఎన్నికలు ముగిసిన తర్వాత క్రాస్ ఓటింగ్ చేసిన నలుగురు ఎమ్మెల్యేలపై పార్టీ వేటు వేసింది. అంతేకాకుండా, సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో వ్యతిరేకత ఉన్నవారికి ఎన్నికల్లో సీట్ ఇవ్వకూడదని నిర్ణయించినట్లు పార్టీకి చెందిన ఓ కీలక నేత తెలిపారు. సీఎం అఖిలేష్ యాదవ్ పై ప్రజల్లో కొంచెం వ్యతిరేకత ఉన్నా.. ఎమ్మెల్యేలపై ఎక్కువగా ఉందని వివరించారు. వ్యతిరేకత ఉన్నవారికి టికెట్లు ఇవ్వకపోవడమే మంచి పని అన్నారు. కాగా, పార్టీ తీసుకోబోతున్న ఈ నిర్ణయం ఎక్కడ ఫెయిల్ అవుతుందోనని పార్టీలోని మరికొంత మంది గాబరా పడుతున్నారు.
ఇప్పటికే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను మొదలుపెట్టిన సమాజ్ వాదీ పార్టీ ప్రత్యర్థులు చేసిన సభ్యులను ఖరారు చేసిన స్థానాల్లో 150 మంది అభ్యర్థులను ఎంపిక చేసింది. మిగతా అభ్యర్థులను ఖరారు చేసేందుకు ఎస్పీ చీఫ్ ములాయాం సింగ్ యాదవ్ నియోజకవర్గాల నుంచి నాయకుల సమాచారాన్ని తెప్పించుకుంటున్నారు. కాగా, ములాయాం ఎంపిక చేసిన అభ్యర్థులకే సీటు దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.