త్వరలోనే వెయ్యి నోటు రాబోతున్నది!
న్యూఢిల్లీ: దేశంలోని నల్లధనాన్ని అణచివేసేందుకు రూ. 500, రూ. వెయి నోట్లను ప్రధాని నరేంద్రమోదీ రద్దు చేసిన సంగతి తెలిసిందే. వాటిస్థానంలో కొత్తగా రూ. 2వేలు, రూ. 500 నోట్లను ప్రవేశపెట్టారు. ఇప్పుడు కొత్తగా రూ. వెయ్యినోట్లను కూడా మళ్లీ ప్రవేశపెట్టే అవకాశముందని తెలుస్తోంది. కొత్త సిరీస్ వెయ్యినోట్లను ప్రవేశపెట్టడానికి భారత రిజర్వు బ్యాంకు, కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నాయని, ఈ కసరత్తు తుదిదశకు చేరుకున్నదని 'ఇండియన్ ఎక్స్‌ప్రెస్' పత్రిక ఓ ప్రభుత్వ అధికారిని ఉటంకిస్తూ పేర్కొన్నది.
ఇప్పటికే రూ. వెయ్యినోట్ల ముద్రణ ప్రక్రియను ఆర్బీఐ ప్రారంభించిందని, అయితే ఎప్పటిలోగా మార్కెట్లోకి ఇవి రానున్నాయన్నది కచ్చితంగా తెలియదని పేర్కొంది. రద్దైన పాత నోట్ల లోటును భర్తీ చేయడానికి కొత్తగా రూ. వెయ్యి నోట్లను ప్రవేశపెట్టనున్నట్టు తెలుస్తోంది. గత జనవరిలోనే కొత్త వెయ్యినోట్లు మార్కెట్లోకి రానున్నాయని ప్రచారం జరిగింది. అయితే, మార్కెట్‌లో తగినంత చిల్లర లేక సమస్యలు ఎదురవుతుండటంతో మొదట రూ. 500 నోట్లను ముద్రణకు ప్రాధాన్యం ఇవ్వడంతో కొత్త రూ. వెయ్యి నోట్ల రాక ఆగిపోయిందని అంటున్నారు. గత ఏడాది నవంబర్ 8న పెద్దనోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రధాని మోదీ ప్రకటించడంతో రూ. 15.44 లక్షల విలువైన రూ. వెయ్యి, రూ. 500 నోట్లను మార్కెట్ నుంచి ఉపసంహరించి.. బ్యాంకుల ద్వారా వీటి బదిలీ ప్రక్రియ చేపట్టిన సంగతి తెలిసిందే.