
కూలిన11 అంతస్తుల భవనం : శిథిలాల్లో 50 మంది
చెన్నై: చెన్నైలో ఘోర ప్రమాదం సంభవించింది. మాన్‌గాడులో నిర్మాణంలో ఉన్న11 అంతస్తుల భవనం కుప్ప కూలిపోయింది. శిథిలాల్లో 50 మంది వరకు కూలీలులు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. శిథిలాలలో చిక్కుకున్న కూలీలు అందరూ తెలుగువారే. సాధారణంగా ఇక్కడ ఆంధ్ర, తెలంగాణ ప్రాంతానికి చెందిన తెలుగువారే కూలీలుగా పని చేస్తుంటారు.
వర్షం కురవడంతో భవనం పది అడుగుల లోపలకు కూరుకుపోయింది. భవనం కింద భూమి బలంగా లేనట్లు చెబుతున్నారు. 11 అంతస్తులు నిర్మించేందుకు అనుమతిలేకుండా ఈ భవనం నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాంతంలో ఇన్ని అంతస్తుల భవనం ఇంతకుముందు నిర్మించలేదు.
ప్రమాదం విషయం తెలిసిన వెంటనే అధికారులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద చిక్కుకుపోయినవారిని బయటకు తీయడానికి ప్రయత్నిస్తున్నారు. 15 అగ్నిమాపక దళాలు వచ్చి సహాయక చర్యలు చేస్తున్నారు. దాదాపు 200 మంది సహాయక చర్యల్లో పాల్గొన్నారు. 21 మంది క్షతగాత్రులను బయటకు తీశారు. ఈ భవనం నిర్మించే కాంట్రాక్టర్, యజమానులు అందుబాటులో లేరు.