బీహార్లో దారుణం..12 మంది మృతి
ఓ వైపు మద్య నిషేధం కొనసాగుతుండగానే.. మరోవైపు 12 మంది వ్యక్తులు అక్రమ మద్యం సేవించి తమ జీవితాలను అర్థాంతరంగా కోల్పోయారు. బీహార్ రాష్ట్రంలోని గోపాల్గంజ్ జిల్లాలో స్థానిక ప్రాంతంలో మంగళవారం సాయంత్రం ఈ దారుణం చోటుచేసుకుంది. మద్య నిషేధం కొనసాగుతున్న తమ ప్రాంతంలో స్థానిక ప్రజలు అక్రమ మద్యం సేవించారు. ఆ మద్యం తాగిన వెంటనే వారు వాంతులు చేసుకోవడం ప్రారంభించారు. వారిని వెంటనే ప్రాథమిక చికిత్స కోసం దగ్గర్లోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే కొంతమంది పరిస్థితి విషమంగా మారడంతో గోరఖ్పూర్లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. కానీ ఐదుగురు చికిత్స జరుగుతుండగానే మద్యలోనే ప్రాణాలను వదిలారు. ఇప్పటివరకు మొత్తం 12 మంది మృతిచెందినట్టు వెల్లడవుతోంది.
అక్రమమద్యం సేవించడం వల్లనే వీరు మృతిచెందారని కుటుంబీకులు, స్థానిక ప్రజలు వాపోతున్నారు. ముందస్తు రిపోర్టులు సైతం అక్రమ మద్యానికే వీరు బలైనట్టు వెల్లడిస్తున్నాయి. కానీ స్థానిక పోలీసులు, అధికారులు మాత్రం తమ నిర్లక్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి దీన్ని ఖండిస్తున్నారు. మద్యం అమ్మకాలను పూర్తిగా నిషేధించిన నితీష్ కుమార్ ప్రభుత్వంలో ఈ ఘటన చోటుచేసుకోవడంతో తీవ్ర ఆసక్తికరమైన చర్చకు దారితీసింది. ఈ బ్యాన్ దీర్ఘకాలంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితిని మెరుగుపరుస్తుందా అనే సందేహం నెలకొంటోంది. ఈ ఘటనపై ముగ్గురు సభ్యులతో టీమ్ను ప్రభుత్వం ఏర్పాటుచేసింది.