
ఎనిమిది మంది టీచర్లు రేప్ చేశారు
ఎనిమిదిమంది ఉపాధ్యాయులు 13 ఏళ్ల బాలికపై సామూహిక లైంగికదాడి చేశారు.
బికనీర్: విద్యాబుద్దులు చెప్పాల్సిన ఉపాధ్యాయులు కీచకులుగా మారారు. ఎనిమిదిమంది ఉపాధ్యాయులు 13 ఏళ్ల బాలికపై సామూహిక లైంగికదాడి చేశారు. ఏడాదిన్నర పాటు ఈ దారుణానికి పాల్పడ్డారు. బాలిక తీవ్ర అనారోగ్యానికి గురవడంతో ఈ విషయం వెలుగు చూసింది. రాజస్థాన్‌లోని బికనీర్ జిల్లాలో ఈ దారుణం చోటు చేసుకుంది. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు. నిందితులను ఇంకా అరెస్ట్ చేయలేదు.
బాధిత బాలిక బ్లడ్ కేన్సర్‌తో బాధపడుతోంది. ఉపాధ్యాయులు తనపై అఘాయిత్యానికి పాల్పడినపుడు ఫొటోలు, వీడియో తీశారని, తనను, తన కుటుంబ సభ్యులను బ్లాక్ మెయిల్ చేశారని బాధితురాలు చెప్పింది. తనను చంపేస్తామని కూడా బెదిరించారని తెలిపింది. కాగా నిందితులైన ఉపాధ్యాయులందరి పేర్లు తనకు తెలియవని చెప్పింది. రాజస్థాన్ పంచాయతీ రాజ్ శాఖ మంత్రి రాజేంద్ర రాథోడ్ ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన చాలా బాధాకరమని, దురదృష్టకరమని, బాధితురాలికి వైద్యం చేయించే బాధ్యతను తాను తీసుకుంటానని తెలిపారు. ముఖ్యమంత్రి వసుంధర రాజె వ్యక్తిగతంగా ఈ కేసును పరిశీలిస్తున్నారని చెప్పారు.