పెరూలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. పరిమితికి మించి ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు ఆండీస్ పర్వతాల సముదాయంలోని లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 15 మంది ప్రయాణికులు అక్కడికక్కడే మరణించారు. మృతుల్లో ఏడాది వయస్సు గల చిన్నారి కూడా ఉందని ఉన్నతాధికారులు శుక్రవారం ఇక్కడ వెల్లడించారు. మరో 58 మంది ప్రయాణికులు గాయపడ్డారని చెప్పారు. నిన్న సాయంత్రం ఆ బస్సు చోటు చేసుకుందని పేర్కొన్నారు.
దుర్ఘటన చోటు చేసుకున్న ప్రదేశం పెరూ రాజధాని లిమాకు 216 కిలోమీటర్ల దూరంలో ఉందని, అదికాక నిర్మానుష్య ప్రదేశం కావడంతో ఆ ఘటనపై తమకు చాలా ఆలస్యంగా సమాచారం అందిందని తెలిపారు. సమాచారం అందిన వెంటనే హుటాహుటిన ప్రమాద స్థలికి చేరుకుని సహయక చర్యలు చేపట్టినట్లు వివరించారు.
గాయపడిన వారిని వివిధ ఆసుపత్రిలకు తరలించి చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. అయితే వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. అండీస్ పర్వత శ్రేణుల్లో ప్రయాణం అంటేనే అత్యంత ప్రమాదకరమని అధికారులు వ్యాఖ్యానించారు. గత ఏడాది ఆదే రహదారిపై జరిగిన వివిధ ప్రమాదాలలో దాదాపు 4 వేల మంది మృత్యువాత పడ్డారని అధికారులు వెల్లడించారు. ఆ ఘటనకు గల కారణాలపై విచారణ జరుపుతున్నట్లు ఉన్నతాధికారులు వివరించారు.