రోజూ కొడుతూ.. సిగరెట్లతో కాలుస్తూ..!
బాలికపై ఓ వ్యక్తి క్రూరత్వం
* పెళ్లి చేసుకుని.. ఏడాదిపాటు నరకం
* ఎస్పీని ఆశ్రయించిన బాధితురాలు
సంగారెడ్డి క్రైం/హత్నూర: బాలికను బలవంతంగా మూడో వివాహం చేసుకుని ఏడాది పాటు ఇంట్లో నిర్బంధించి చిత్రహింసలకు గురిచేసిన ఓ వ్యక్తి ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇతరుల సాయంతో తప్పించుకున్న సదరు బాలిక మెదక్ జిల్లా ఎస్పీ సుమతిని గురువారం కలసి తన గోడును వెళ్లబోసుకుంది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. హత్నూర మండలం నాగారం గ్రామ పంచాయతీ పరిధిలోని కొడపాకకు చెందిన 16 ఏళ్ల బాలిక తల్లి మృతిచెందింది. తండ్రి ఎల్లాగౌడ్ పక్షవాతంతో బాధ పడుతున్నారు.
దీంతో ఆమె తాత బాలాగౌడ్ పెద్ద దిక్కుగా ఉంటున్నారు. వారికి దూరపు బంధువైన నిజామాబాద్ జిల్లా నిజాంసాగర్ మండలం బూర్గుల గ్రామానికి చెందిన దస్తాగౌడ్(45).. ఆ బాలికతో చనువు పెంచుకొని గతేడాది మార్చిలో ఆమెను ఇంటి నుంచి బలవంతంగా తీసుకెళ్లాడు. ఏడుపాయల సమీపంలోని సరస్వతీ దేవాలయంలో గుట్టు చప్పుడు కాకుండా పెళ్లి చేసుకొని అక్కడి నుంచి హైదరాబాద్‌కు మకాం మార్చాడు.
బంజారాహిల్స్‌లోని పలు దుకాణల్లో, కొన్ని ఇళ్లల్లో బాలికతో ఇంటి పనులు చేయించేవాడు. అంతేగాక రోజూ రాత్రివేళ బాలికను కొట్టడం, సిగరెట్‌తో కాల్చడం, వాతలు పెట్టడం వంటి చిత్రహింసలకు గురిచేసేవాడు. ఇలా చిత్రహింసలు భరించలేని బాలిక బాధలు చూడలేక కొందరు ఇరుగుపొరుగు వారు సాయం చేయడంతో దస్తాగౌడ్ బారి నుంచి తప్పించుకొని తన సొంత గ్రామమైన కొడపాకకు చేరుకుంది. ఈ విషయాన్ని గ్రామ పెద్దలకు తెలియజేయడంతో వారు బాధితురాలిని ఎస్పీ సుమతి దగ్గరికి తీసుకెళ్లారు. స్పందించిన ఎస్పీ విచారణ జరిపి నిందితుణ్ని వెంటనే అరెస్ట్ చేయాలని పోలీసులను ఆదేశించారు.
ఎస్పీకి బాలల హక్కుల రక్షణ కమిషన్ మెమో
ఈ విషయంలో హత్నూర పోలీసులకు ఫిర్యాదు చేసినా, పట్టించుకోవడం లేదంటూ స్టేట్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ సభ్యులు అచ్యుతరావు జిల్లా ఎస్పీ సుమతికి గురువారం మెమో జారీ చేశారు. నిందితునిపై హత్నూర పోలీసులకు ఫిర్యాదు చేస్తే పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. బాధితురాలికి సరైన న్యాయం అందజేసేలా ఆదేశాలు జారీ చేయాలని అచ్యుతరావు ఎస్పీకి సూచించారు.