Torturing
-
కట్న పిశాచులు
► పెళ్లైన ఇరవై రోజులకే కట్నం వేధింపులు ► పాలు, పండ్లలో విషం కలిపి చంపేందుకు ప్రయత్నం ►ఎదురు తిరిగినందుకు ఇంట్లో బంధించి చిత్రహింసలు ►ఆపై తాడుతో గొంతుకు బిగించి ఉరేసే యత్నం ►చాకచక్యంగా తప్పించుకున్న నవ వధువు పెళ్లంటే పందిళ్లు, తప్పెట్లు, తాళాలు, తలంబ్రాలు, మూడుముళ్లు, ఏడడుగులు..మొత్తం కలిపి నూరేళ్లు’ అంటూ.. ఓ సినీకవి సెలవిచ్చారు. వైవాహిక బంధం ఎలా ఉండాలో తెలుపుతూ ‘పెళ్లి పుస్తకం ’ సినిమాలో మరో కవి రాసిన పాట అందరినీ ఆలోచింపజేసింది. ప్రతి ఆడపిల్ల తన వైవాహిక జీవితంపై ఎన్నో కలలు కంటుంది. అమ్మలేని లోటు తెలియకుండా నాన్న పెంపకంలో పెరిగిన ఆమె కూడా సగటు ఆడపిల్లల్లాగే ఎన్నో కలలు కంది. కాబోయే భర్తపై ఎన్నో ఆశలు పెట్టుకుంది. అత్తారింట అడుగుపెట్టిన మరుసటి రోజు నుంచే నరకం అంటే ఏమిటో ఆమెకు అనుభవమైంది. ఇచ్చిన కట్నం చాలదంటూ భర్త, అత్త కలసి ఆమెను ఇంట్లో బంధించి చిత్రహింసలు పెట్టారు. పాలు, పండ్లలో విషం కలిపి చంపాలని ప్రయత్నించారు. అదీ చాలక ఉరివేసి మట్టుబెట్టేం దుకు యత్నించారు. అయితే ఆ రాక్షసుల నుంచి ఆమె ఎలాగోలా తప్పించుకుని ప్రాణాలు కాపాడుకుంది. - కుందుర్పి కుందుర్పి: కుందుర్పి మండలం బెస్తరపల్లి కి చెందిన వడ్డె మూర్తి కుమార్తె చంద్రకళ(28)ను కర్ణాటకలోని మాగడి పట్టణంలో బిల్డింగ్ కాంట్రాక్టర్ జగన్నాథ్‌తో గత ఏప్రిల్ 4న పెళ్లైంది. ఆ సమయంలో కట్నకానుకల కింద నాలుగు తులాల బంగారం రూ.25 వేల నగదు ఇచ్చారు. కాపురానికి వెళ్లిన 20 రోజులకే అత్త లీలావతి, భర్త జగన్నాథ్ కలసి చంద్రకళను కట్నం చాలా తక్కువ ఇచ్చారని, వేరేవాళ్లు మా వాడికి రూ.2 లక్షల కట్నం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారంటూ సాధించడం మొదలుపెట్టారు. అదనపు కట్నం తీసుకురాని పక్షంలో ఇంటినుంచి వెళ్లిపోవాలంటూ అత్త లీలావతి పోరు పెట్టింది. ఎదురు తిరగడంతో... తల్లిలేని తాను పుట్టింటికి ఎలా వెళ్లాలని చంద్రకళ ప్రశ్నించడంతో అత్త మరింత కసి పెంచుకుంది. నన్నే ప్రశ్నిస్తావా? అంటూ రోజూ పాలు, పళ్ల రసాల్లో మత్తుమాత్రలు వేసి చిత్రహింసలకు గురి చేసేవారు. పగలంతా నిర్భంధించి విషక్షణారహితంగా కొట్టేవారు. కుట్రను పసిగట్టి.. గత నెల 25న భర్త జగన్నాథ్, అత్త లీలావతి కలసి తాడుతో ఉరివేసేందుకు ప్రయత్నించగా వారి నుంచి తప్పించుకున్న చంద్రకళ బెంగళూరులోని బంధువుల ఇంటికి చేరింది. రెండ్రోజుల అనంతరం స్వగ్రామం బెస్తరపల్లి చేరింది. పట్టించుకోని పోలీసులు తనకు జరిగిన అన్యాయంపై కర్ణాటక పోలీసులకు జూన్ ఒకటిన ఫిర్యాదు చేసినా స్పందించ లేదని చంద్రకళ ఆవేదన వ్యక్తం చేసింది. తన భర్త జగన్నాథ్, అత్త లీలావతిపై చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలంటూ బాధితురాలు తన తండ్రితో కలసి కళ్యాణదుర్గం డీవైఎస్పీ పులిపాటి అనిల్‌కుమార్‌ను శనివారం కలసి ఫిర్యాదు చేసింది. -
రియాద్‌లో పాతబస్తీ యువతి మృతి
మృతదేహాన్ని తీసుకొచ్చేందుకు సహకరించాలని సీఎంకు తల్లి వేడుకోలు యాకుత్‌పురా: ఉపాధి కోసం రియాద్ దేశానికి వెళ్లిన తన కూతురు తోటి పని వారి చేతిలో చిత్రహింసలకు గురై మృతి చెందిందని, మృతదేహాన్ని నగరానికి తీసుకొచ్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవ తీసుకోవాలని మృతురాలు ఆసిమా ఖతూన్ తల్లి గౌసియా ఖతూన్ కోరారు. చంచల్గూడలోని తన నివాసంలో గురువారం ఎంబీటీ నాయకుడు, మాజీ కార్పొరేటర్ అంజదుల్లా ఖాన్‌తో కలిసి ఆమె విలేకరులతో మాట్లాడుతూ... నాలుగు నెలల క్రితం హౌస్ మెయిడ్ (ఇంట్లో పని) వీసాపై తమ కూతురు ఆసిమా ఖతూన్ (25) రియాద్ వెళ్లిందన్నారు. అక్కడ తన కూతుర్ని తోటి పని వారు ఓ గదిలో వేసి బంధించి, హింసించారని చెప్పింది. తీవ్ర అనారోగ్యానికి గురైన తన కూతురు ఆసియాఖతూన్‌కు ఛాతీలో నొప్పి రావడంతో ఇంటికి తీసుకెళ్లమని తనకు ఫోన్ చేసి పలుమార్లు కోరిందన్నారు. 20 రోజుల తనకు ఫోన్ చేయకపోవడంతో ఆరా తీయగా.. రియాద్‌లోని కింగ్ సౌద్ చెస్ట్ డిసీస్ ఆసుపత్రిలో చికిత్సపొందుతూ మృతి చెందినట్లు తెలిసిందన్నారు. దీనిపై తాము ఎంబాసీ, ఎన్నారై కార్యాలయాలతో పాటు పోలీసులకు సమాచారం అందించామన్నారు. తమ కూతురి మృతదేహాన్ని నగరానికి త్వరగా తీసుకొచ్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకరించాలని ఆమె కోరారు. -
రోజూ కొడుతూ.. సిగరెట్లతో కాలుస్తూ..!
బాలికపై ఓ వ్యక్తి క్రూరత్వం * పెళ్లి చేసుకుని.. ఏడాదిపాటు నరకం * ఎస్పీని ఆశ్రయించిన బాధితురాలు సంగారెడ్డి క్రైం/హత్నూర: బాలికను బలవంతంగా మూడో వివాహం చేసుకుని ఏడాది పాటు ఇంట్లో నిర్బంధించి చిత్రహింసలకు గురిచేసిన ఓ వ్యక్తి ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇతరుల సాయంతో తప్పించుకున్న సదరు బాలిక మెదక్ జిల్లా ఎస్పీ సుమతిని గురువారం కలసి తన గోడును వెళ్లబోసుకుంది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. హత్నూర మండలం నాగారం గ్రామ పంచాయతీ పరిధిలోని కొడపాకకు చెందిన 16 ఏళ్ల బాలిక తల్లి మృతిచెందింది. తండ్రి ఎల్లాగౌడ్ పక్షవాతంతో బాధ పడుతున్నారు. దీంతో ఆమె తాత బాలాగౌడ్ పెద్ద దిక్కుగా ఉంటున్నారు. వారికి దూరపు బంధువైన నిజామాబాద్ జిల్లా నిజాంసాగర్ మండలం బూర్గుల గ్రామానికి చెందిన దస్తాగౌడ్(45).. ఆ బాలికతో చనువు పెంచుకొని గతేడాది మార్చిలో ఆమెను ఇంటి నుంచి బలవంతంగా తీసుకెళ్లాడు. ఏడుపాయల సమీపంలోని సరస్వతీ దేవాలయంలో గుట్టు చప్పుడు కాకుండా పెళ్లి చేసుకొని అక్కడి నుంచి హైదరాబాద్‌కు మకాం మార్చాడు. బంజారాహిల్స్‌లోని పలు దుకాణల్లో, కొన్ని ఇళ్లల్లో బాలికతో ఇంటి పనులు చేయించేవాడు. అంతేగాక రోజూ రాత్రివేళ బాలికను కొట్టడం, సిగరెట్‌తో కాల్చడం, వాతలు పెట్టడం వంటి చిత్రహింసలకు గురిచేసేవాడు. ఇలా చిత్రహింసలు భరించలేని బాలిక బాధలు చూడలేక కొందరు ఇరుగుపొరుగు వారు సాయం చేయడంతో దస్తాగౌడ్ బారి నుంచి తప్పించుకొని తన సొంత గ్రామమైన కొడపాకకు చేరుకుంది. ఈ విషయాన్ని గ్రామ పెద్దలకు తెలియజేయడంతో వారు బాధితురాలిని ఎస్పీ సుమతి దగ్గరికి తీసుకెళ్లారు. స్పందించిన ఎస్పీ విచారణ జరిపి నిందితుణ్ని వెంటనే అరెస్ట్ చేయాలని పోలీసులను ఆదేశించారు. ఎస్పీకి బాలల హక్కుల రక్షణ కమిషన్ మెమో ఈ విషయంలో హత్నూర పోలీసులకు ఫిర్యాదు చేసినా, పట్టించుకోవడం లేదంటూ స్టేట్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ సభ్యులు అచ్యుతరావు జిల్లా ఎస్పీ సుమతికి గురువారం మెమో జారీ చేశారు. నిందితునిపై హత్నూర పోలీసులకు ఫిర్యాదు చేస్తే పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. బాధితురాలికి సరైన న్యాయం అందజేసేలా ఆదేశాలు జారీ చేయాలని అచ్యుతరావు ఎస్పీకి సూచించారు. -
వివాహిత దారుణ హత్య
- హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించిన భర్త, అత్త - చిత్రహింసలకు గురిచేసి హత్యచేశారని మృతురాలి తల్లిదండ్రుల ఆరోపణ, ఫిర్యాదు - హత్య కేసు నమోదు చేసిన పోలీసులు కందుకూరు అర్బన్ : ఓ వివాహితను ఆమె భర్త, అత్త కలిసి చిత్రహింసలకు గురిచేసి హత్యచేశారు. ఆపై ఆమే కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకుందని చిత్రీకరించారు. మృతురాలి తల్లిదండ్రులు తెలిపిన వివరాలు, ఇచ్చిన ఫిర్యాదుతో పాటు సంఘటన స్థలంలో ఆధారాల ప్రకారం పోలీసులు వరకట్న వేధింపుల హత్యకేసుగా నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బుధవారం కందుకూరు పట్టణంలో జరిగిన ఈ సంఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. ఆ వివరాల ప్రకారం... చినగంజాం మండలం కడవకుదురు గ్రామానికి చెందిన తోట యానాది, లక్ష్మిల కుమార్తె గౌతమి (22)ని కందుకూరు పట్టణం తూర్పుకమ్మపాలేనికి చెందిన గంటా సత్యవతి కుమారుడు చలపతికి ఇచ్చి 2011లో వివాహం చేశారు. ప్రస్తుతం వీరికి నాలుగేళ్ల కుమార్తె హనీ, 11 నెలల కుమారుడు అయ్యప్ప సంతానం. కొంతకాలంగా అత్త సత్యవతి చెప్పిన విధంగా వినడం లేదని భర్త చలపతి, అత్త కలిసి గౌతమిని వేధిస్తున్నారు. అనేకసార్లు కొట్టి చిత్రహింసలకు గురిచేశారు. గౌతమి తన తల్లిదండ్రులకు చెప్పుకుని బాధపడగా, వారు నచ్చజెప్పారు. ఈ నేపథ్యంలో మంగళవారం కూడా గౌతమిపై భర్త, అత్త దాడిచేశారు. రాత్రి తొమ్మిది గంటల సమయంలో తండ్రి యానాదికి ఫోన్‌చేసి బుధవారం ఉదయం తన దగ్గరికి రావాలని గౌతమి కోరింది. అయితే, బుధవారం వేకువజామున నాలుగున్నర గంటల సమయంలో తన కోడలు కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుందని సత్యవతి కేకలు వేయడంతో స్థానికంగా ఉన్న ఓ వ్యక్తి పరిగెత్తుకుంటూ ఆ ఇంటి వద్దకు వచ్చాడు. మెయిన్ గేటుకు తాళం వేసి ఉండటం, తాళం తీయమని అడిగినా సత్యవతి తీయకపోవడంతో గోడదూకి లోపలికి వెళ్లి పక్కనున్న ఇసుకను గౌతమిపై పోసి మంటలు ఆర్పివేశాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న చలపతి చూస్తూ ఉండిపోయాడు. హత్యచేసి ఆపై దహనం చేశారు : తల్లిదండ్రులు తమ కుమార్తెను చాలాకాలంగా భర్త, అత్త కలిసి వేధిస్తున్నారని, దానిలో భాగంగానే కొట్టి హత్యచేసి, ఆపై కిరోసిన్ పోసి దహనం చేశారని గౌతమి తండ్రి యానాది, తల్లి లక్ష్మి కన్నీటిపర్యంతమయ్యారు. సంఘటనకు 8 గంటల ముందు తమ కుమార్తె తమకు ఫోన్‌చేసి వేధింపులపై ఆవేదనతో మాట్లాడిందని, బుధవారం ఉదయం రావాలని కోరిందని చెప్పారు. కచ్చితంగా తమ కుమార్తెను హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు కుట్రపన్నుతున్నారని ఆరోపించారు. ఆ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు సంఘటన స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ జి.శ్రీనివాసరావు వరకట్న వేధింపుల హత్య కేసుగా నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సీఐ లక్ష్మణ్ సంఘటన స్థలాన్ని పరిశీలించి విచారించారు. ఇవీ అనుమానాలు... గౌతమి కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ఆమె భర్త, అత్త చెబుతుండగా, సంఘటన స్థలంలో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గౌతమి మృతదేహం పడి ఉన్న చుట్టుపక్కల ఎక్కడా ఆమె కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆ బాధ భరించలేక అటూఇటూ పరిగెత్తినట్లు గుర్తులు లేవు. ఉద్దేశపూర్వకంగా హత్యచేసి ఆపై కిరోసిన్‌పోసి తగులబెట్టినట్లు తెలుస్తోంది. కలచివేసిన చిన్నారుల రోదన... తల్లి చనిపోవడంతో ఆమె ఇద్దరు చిన్నారులు రోదించడం చూపరులను కలచివేసింది. పాలకోసం 11 నెలల కుమారుడు ఏడుస్తుంటే ఓదార్చడం ఎవరివల్లా కాలేదు. -
చిత్రహింసలు పెట్టి చంపేశారు?
పుల్కల్ : పోలీసులు చిత్రహింసలు పెట్టి తన కుమారుడు చంపేశారని పుల్కల్ పోలీస్‌స్టేషన్‌లో మృతి చెందిన లక్ష్మయ్య తల్లి ఎల్లమ్మ ఆరోపించింది. తన కుమారుడిని నా లుగు రోజుల క్రితం అదుపులోకి తీసుకుని థర్డ్ డిగ్రీ ప్రయోగించారని, దెబ్బలకు తాళలేకే లక్ష్మయ్య మాకు కాకుండా పోయాడని శుక్రవారం తనను కలిసిన విలేకరులతో ఆవేదన వ్యక్తం చేసింది. విచారణ సమయంలో పోలీసులు రెండు లక్షలు చెల్లించమంటున్నారు..? ఎలా ఇవ్వాలని లక్ష్మయ్య చెప్పినట్లు ఎల్లమ్మ ఆరోపించింది. డబ్బులు చెల్లించనిదే తనను చంపేస్తారేమోనని తనతో కుమారుడు గోడును వెల్లబోసుకున్నట్లు ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఇదిలా ఉండగా.. పుల్కల్ పోలీసుస్టేషన్‌లోని లాక ప్ గదిలో గురువారం తెల్లవారు జా మున సదాశివపేట మండలం ఎల్లా రం గ్రామానికి చెందిన తలారి లక్ష్మ య్య మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే పోలీసులు వ్యూహాత్మకంగానే ఎప్పుడే లేని విధంగా లాక ప్లో గొలుసుతో కూడిన సంకెళ్లు వేశారన్న ఆరోపణలున్నాయి.. నిజంగా పోలీసులు అదుపులోకి తీసుకుని మరుసటి రోజు రిమాండ్ చేసేందుకు పుల్కల్ స్టేషన్‌కు తీసుకువచ్చి ఉంటే సంకెళ్లు ఎందుకు వేయాల్సి వచ్చింది? అరెస్టు చేయనప్పుడు సంకెళ్లు వేయడం చట్ట విరుద్ధం. కానీ.. నాలుగు రో జు లు పోలీసులు పెట్టిన తీవ్ర చిత్ర హింసలకు గురిచేయడం తట్టుకోలేకనే గురువారం తెల్లవారు జామున లాకప్‌లో లక్ష్మయ్య మృతి చెందిన ట్లు స్పష్టం అవుతోంది. అయితే.. స్టేషన్లో చనిపోయాకే లాకప్‌లో గొ లుసుతో కూడిన సంకెళ్లతోనే ఆత్మహత్య చేసుకున్నట్లుగా చిత్రీకరించారన్నారు. అందులో భాగంగా లాకప్‌లో వాటిని వేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాగా.. మృ తుడు దళితుడు కావడంతో అసెంబ్లీ సమావేశాలు నడుస్తున్నందున ప్రతి పక్షాలు గొడవ చేసే అవకాశం ఉం టుందేమోనని భావించి లక్ష్మయ్య ను సికింద్రాబాద్‌లోని గాంధీకి తరలించారనే విమర్శలున్నాయి. -
నెలరోజులు ప్రత్యక్ష నరకం..
* అరబ్ షేక్‌ల చెర నుంచి మహిళలకు విముక్తి * చెప్పలేని పనులు చేయించారు * తిరిగివస్తామనుకోలేదు:బాధిత మహిళలు చాంద్రాయణగుట్ట : ‘‘ పేదరికాన్ని ఆసరాగా చేసుకున్నారు. నెలకు రూ. 30 వేలు జీతం వచ్చేలా చూస్తామన్నారు. గత నెల 19న అబుదాబీకి పంపారు. పిల్లలను ఉన్నత చదువులు చదివించవచ్చని ఆశపడ్డాం. తీరా అక్కడికి వెళితే షేక్‌లు గదిలో బంధించి చిత్ర హింసలకు గురిచేశారు. నెల రోజులుగా ప్రత్యక్షనరకాన్ని అనుభవించాం’’అంటూ దళారులు చేతుల్లో మోసపోయిన మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. అరబ్‌షేక్‌ల చెర నుంచి మహిళలను చంద్రాయణగుట్ట పోలీసులు సురక్షితంగా ఆదివారం నగరానికి తీసుకువచ్చారు. దక్షిణ మండలం డీసీపీ వి.సత్యనారాయణ, బాధిత మహిళలతో కలసి వివరాలను విలేకరులకు తెలిపారు. గుంటూరు జిల్లా వడ్లమూడి గ్రామానికి చెందిన ముంతాజ్ బేగం (37), హసీనా బేగం (35) హైదరాబాద్ పాతబస్తీలో కుటుంబ సభ్యులతో నివాసం ఉంటూ కూలీ నాలీ చేసుకొని జీవిస్తున్నారు. వీరి పేదరికాన్ని ఆసరాగా చేసుకున్న బార్కాస్ ప్రాంతానికి చెందిన దళారులు ఫాతిమా, ఇంతియాజ్ దుబాయిలో వంటింటి పనులు చేస్తే నెలకు 20-30 వేలు ఇస్తారని నమ్మించారు. తమ జీవితాలతో పాటు పిల్లలు జీవితాలు మెరుగుపడతాయని ముంతాజ్ బేగం, హసీనా బేగం ఆశపడ్డారు. గత నెల 19న అబుదాబీ వెళ్లారు. ఇందుకు వీరి నుంచి దళారులు 30 వేల చొప్పున వసూలు చేశారు. తీరా అక్కడికి వెళ్లాక వారికి అసలు విషయం తెలిసి ఖంగుతిన్నారు. వారిని గదిలో బంధించి చిత్ర హింసలకు గురి చేశారు. షేక్‌లు లైంగిక కార్యకలాపాలకు పాల్పడడంతో పాటు చిత్రహింసలకు గురిచేశారు. పది రోజుల కిందట ముంతాజ్ బేగానికి గుండెనొప్పి వచ్చింది. ఆమెకు ఏదైనా జరిగితే ఇబ్బందులు తలెత్తుతాయని భావించిన షేక్‌లు ముంతాజ్ బేగాన్ని హైదరాబాదాద్కు పంపించారు. ఇక్కడికి వచ్చిన అనంతరం ఆమె షేక్‌ల అరాచకాలపై చాంద్రాయణగుట్ట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బార్కాస్ చెందిన దళారులు ఫాతిమా, ఇంతియాజ్‌లను అదుపులోకి తీసుకున్నారు. షేక్‌ల చెరలో ఉన్న హసీనా బేగాన్ని ఇక్కడికి తీసుకువచ్చేలా ఒత్తిడి చేశారు. దుబాయి దళారులతో వారు మాట్లాడి హసీనాను హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. ఆదివారం ఉదయం 7 గంటలకు హసీనా శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంది. పోలీసులు వెంటనే హసీనాను పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చి విచారించారు. ఈ ఘటనపై ఇంతియాజ్, ఫాతిమాలపై చీటింగ్ కేసుతో పాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని డీసీపీ స్యతనారాయణ తెలిపారు. దళారులు ఇంకెవరినైనా ఇలా దుబాయికి పంపించారా...? అన్న విషయాన్ని విచారిస్తున్నామన్నారు. ముంతాజ్, హసీనాలను చిత్ర హింసలకు గురి చేసిన షేక్‌లకు కూడా సీఐడీ సహకారంతో నోటీసులు పంపించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. అన్ని కోణాల్లో కేసును దర్యాప్తుచేస్తున్నామన్నారు.విలేకర్ల సమావేశంలో దక్షిణ మండలం అదనపు డీసీపీ కె.బాబురావు, చాంద్రాయణగుట్ట అదనపు ఇన్స్పెక్టర్ ఎస్.రాఘవేందర్, ఎస్సై లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు. బాధితురాలిని సురక్షితంగా తీసుకొచ్చేలా కృషి చేసిన చాంద్రాయణగుట్ట ఇన్స్పెక్టర్, ఎస్సైలకు రివార్డులను అందిస్తామని డీసీపీ తెలిపారు. తిరిగి వస్తామనుకోలేదు: బాధిత మహిళలు తాము తిరిగి ప్రాణాలతో వస్తామనుకోలేదని బాధిత మహిళలు ముంతాజ్, హసీనా కన్నీటిపర్యంతమయ్యారు. రోజుల తరబడి భోజనం పెట్టకుండా చిత్ర హింసలకు గురిచేశారని, నిర్భందించి చెప్పుకోలేని పనులు చేయించారన్నారు. తమ లాంటి వారు చాలా మంది తెలియక దుబాయికి వెళ్లి నరకం అనుభవిస్తున్నారన్నారు. అలాంటి వారందరిని ఇక్కడికి తీసుకురావాలన్నారు. ఒంటిపై నగలను లాక్కొన్నారని హసీనా ఆవేదన చెందింది.