నెలరోజులు ప్రత్యక్ష నరకం..
* అరబ్ షేక్‌ల చెర నుంచి మహిళలకు విముక్తి
* చెప్పలేని పనులు చేయించారు
* తిరిగివస్తామనుకోలేదు:బాధిత మహిళలు
చాంద్రాయణగుట్ట : ‘‘ పేదరికాన్ని ఆసరాగా చేసుకున్నారు. నెలకు రూ. 30 వేలు జీతం వచ్చేలా చూస్తామన్నారు. గత నెల 19న అబుదాబీకి పంపారు. పిల్లలను ఉన్నత చదువులు చదివించవచ్చని ఆశపడ్డాం. తీరా అక్కడికి వెళితే షేక్‌లు గదిలో బంధించి చిత్ర హింసలకు గురిచేశారు. నెల రోజులుగా ప్రత్యక్షనరకాన్ని అనుభవించాం’’అంటూ దళారులు చేతుల్లో మోసపోయిన మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. అరబ్‌షేక్‌ల చెర నుంచి మహిళలను చంద్రాయణగుట్ట పోలీసులు సురక్షితంగా ఆదివారం నగరానికి తీసుకువచ్చారు. దక్షిణ మండలం డీసీపీ వి.సత్యనారాయణ, బాధిత మహిళలతో కలసి వివరాలను విలేకరులకు తెలిపారు.
గుంటూరు జిల్లా వడ్లమూడి గ్రామానికి చెందిన ముంతాజ్ బేగం (37), హసీనా బేగం (35) హైదరాబాద్ పాతబస్తీలో కుటుంబ సభ్యులతో నివాసం ఉంటూ కూలీ నాలీ చేసుకొని జీవిస్తున్నారు. వీరి పేదరికాన్ని ఆసరాగా చేసుకున్న బార్కాస్ ప్రాంతానికి చెందిన దళారులు ఫాతిమా, ఇంతియాజ్ దుబాయిలో వంటింటి పనులు చేస్తే నెలకు 20-30 వేలు ఇస్తారని నమ్మించారు. తమ జీవితాలతో పాటు పిల్లలు జీవితాలు మెరుగుపడతాయని ముంతాజ్ బేగం, హసీనా బేగం ఆశపడ్డారు.
గత నెల 19న అబుదాబీ వెళ్లారు. ఇందుకు వీరి నుంచి దళారులు 30 వేల చొప్పున వసూలు చేశారు. తీరా అక్కడికి వెళ్లాక వారికి అసలు విషయం తెలిసి ఖంగుతిన్నారు. వారిని గదిలో బంధించి చిత్ర హింసలకు గురి చేశారు. షేక్‌లు లైంగిక కార్యకలాపాలకు పాల్పడడంతో పాటు చిత్రహింసలకు గురిచేశారు. పది రోజుల కిందట ముంతాజ్ బేగానికి గుండెనొప్పి వచ్చింది. ఆమెకు ఏదైనా జరిగితే ఇబ్బందులు తలెత్తుతాయని భావించిన షేక్‌లు ముంతాజ్ బేగాన్ని హైదరాబాదాద్‌కు పంపించారు. ఇక్కడికి వచ్చిన అనంతరం ఆమె షేక్‌ల అరాచకాలపై చాంద్రాయణగుట్ట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు బార్కాస్ చెందిన దళారులు ఫాతిమా, ఇంతియాజ్‌లను అదుపులోకి తీసుకున్నారు. షేక్‌ల చెరలో ఉన్న హసీనా బేగాన్ని ఇక్కడికి తీసుకువచ్చేలా ఒత్తిడి చేశారు. దుబాయి దళారులతో వారు మాట్లాడి హసీనాను హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. ఆదివారం ఉదయం 7 గంటలకు హసీనా శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంది. పోలీసులు వెంటనే హసీనాను పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చి విచారించారు.
ఈ ఘటనపై ఇంతియాజ్, ఫాతిమాలపై చీటింగ్ కేసుతో పాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని డీసీపీ స్యతనారాయణ తెలిపారు. దళారులు ఇంకెవరినైనా ఇలా దుబాయికి పంపించారా...? అన్న విషయాన్ని విచారిస్తున్నామన్నారు. ముంతాజ్, హసీనాలను చిత్ర హింసలకు గురి చేసిన షేక్‌లకు కూడా సీఐడీ సహకారంతో నోటీసులు పంపించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.
అన్ని కోణాల్లో కేసును దర్యాప్తుచేస్తున్నామన్నారు.విలేకర్ల సమావేశంలో దక్షిణ మండలం అదనపు డీసీపీ కె.బాబురావు, చాంద్రాయణగుట్ట అదనపు ఇన్‌స్పెక్టర్ ఎస్.రాఘవేందర్, ఎస్సై లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు. బాధితురాలిని సురక్షితంగా తీసుకొచ్చేలా కృషి చేసిన చాంద్రాయణగుట్ట ఇన్‌స్పెక్టర్, ఎస్సైలకు రివార్డులను అందిస్తామని డీసీపీ తెలిపారు.
తిరిగి వస్తామనుకోలేదు: బాధిత మహిళలు
తాము తిరిగి ప్రాణాలతో వస్తామనుకోలేదని బాధిత మహిళలు ముంతాజ్, హసీనా కన్నీటిపర్యంతమయ్యారు. రోజుల తరబడి భోజనం పెట్టకుండా చిత్ర హింసలకు గురిచేశారని, నిర్భందించి చెప్పుకోలేని పనులు చేయించారన్నారు. తమ లాంటి వారు చాలా మంది తెలియక దుబాయికి వెళ్లి నరకం అనుభవిస్తున్నారన్నారు. అలాంటి వారందరిని ఇక్కడికి తీసుకురావాలన్నారు. ఒంటిపై నగలను లాక్కొన్నారని హసీనా ఆవేదన చెందింది.