అబుదాబి: కరోనా వైరస్(కోవిడ్-19) విజృంభిస్తున్న తరుణంలో తమ దేశంలో చిక్కుకుపోయిన పౌరులను స్వదేశాలకు తీసువెళ్లని దేశాలపై కఠిన చర్యలు తీసుకుంటామని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ హెచ్చరించింది. వర్క్ వీసాలపై ఆంక్షలు కఠినతరం చేస్తామని పేర్కొంది. ఈ మేరకు మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రణాళికలు రచిస్తున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. కాగా తమ దేశంలో చిక్కుకుపోయిన ఇతర దేశాల పౌరులకు కరోనా నిరార్ధరణ పరీక్షల్లో నెగటివ్ ఫలితం వస్తే స్వదేశాలకు పంపిస్తామని యూఏఈ ప్రభుత్వం పేర్కొన్న విషయం తెలిసిందే. అన్ని దేశాల రాయబార కార్యాలయాలకు ఈ మేరకు సమాచారం అందించింది. అయితే ఇప్పటి వరకు చాలా దేశాలు ఇందుకు స్పందించకపోవడంతో వర్క్ వీసాలపై ఆంక్షలు విధించే అవకాశం ఉందని హెచ్చరికలు జారీచేసింది.(కుప్పలుగా శవాలు.. అక్కడే ఎందుకు ఎక్కువ మరణాలు? )
కాగా దాదాపు 90 లక్షల జనాభా కలిగిన యూఏఈలో చాలా మంది పొట్టికూటి కోసం వచ్చిన వారే ఉన్నారు. ఇక ప్రస్తుతం కరోనా విస్తరిస్తున్న తరుణంలో కరోనా నెగటివ్‌గా తేలి... స్వదేశాలకు వెళ్లాలని భావిస్తున్న వారిని తమ దేశాలకు పంపుతామని రెండు వారాల క్రితం యూఏఈ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో దాదాపు 25 వేల మంది పాకిస్తానీలు దుబాయ్, అబుదాబిలో చిక్కుకుపోయారని పాకిస్తాన్ యూఏఈ రాయబారి గులాం దస్తగిర్ గల్ఫ్ న్యూస్‌కు వెల్లడించారు. వారిని స్వదేశానికి తరలించే యోచనలో ఉన్నట్లు పేర్కొన్నారు. అయితే మిగతా దేశాల నుంచి సరైన స్పందన రాకపోవడంతో యూఏఈ తాజాగా ఈ హెచ్చరికలు జారీ చేసింది. ఇక కరోనా ధాటికి ఇప్పటివరకు యూఏఈలో 20 మంది మరణించగా.. 3736 మంది దీని బారిన పడ్డారు. కరోనా వ్యాప్తిని నియంత్రించే చర్యల్లో భాగంగా మాల్స్, రెస్టారెంట్లు మూసివేసింది. అంతర్జాతీయ ప్రయాణాలపై నిషేధం విధించింది.(కరోనా: భారత్ నుంచి 444 మంది స్వదేశాలకు)
Comments
Please login to add a commentAdd a comment