టి20 ప్రపంచకప్‌తో బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ, కార్యదర్శి జై షా (ఫైల్)
ముంబై: మన ‘పొట్టి’ ఆటలకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) రాజధాని అవుతోంది. కల్లోల కరోనా సమయంలో టి20 ప్రపంచకప్ కూడా భారత్‌లో ఆతిథ్యమిచ్చే అవకాశం లేకుండా పోయింది. అందుకే యూఏఈ సౌజన్యంతో ఐపీఎల్ లాగే మెగా ఈవెంట్‌ను కూడా అక్కడే నిర్వహించాలనే నిర్ణయానికి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) వచ్చింది. దీనిపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)కి సమాచారమిచ్చింది. టి20 ప్రపంచకప్ అక్టోబర్ 17న మొదలవుతుంది. నవంబర్ 14న జరిగే టైటిల్ పోరుతో టోర్నీ ముగుస్తుంది. సరిగ్గా ఐపీఎల్ ఫైనల్ (అక్టోబర్ 15) ముగిసిన రెండో రోజే మెగా ఈవెంట్ ప్రారంభవుతుంది.
ఓ వార్త సంస్థకిచ్చిన ఇంటర్వ్యూలో జై షా మాట్లాడుతూ ‘దేశంలో కోవిడ్ ఉధృతిని దృష్టిలో ఉంచుకునే టి20 ప్రపంచకప్‌ను భారత్ నుంచి యూఏఈకి తరలిస్తున్నాం. అన్ని అంశాలను పరిశీలించాకే ఈ నిర్ణయం తీసుకున్నాం. ఆటగాళ్ల ఆరోగ్యం, భద్రతకే మా ప్రాధాన్యం ఉంటుంది. త్వరలోనే దీనిపై అధికారికంగా ప్రకటిస్తాం’ అని అన్నారు. 16 దేశాలు పాల్గొనే మెగా ఈవెంట్‌ను అబుదాబి, షార్జా, దుబాయ్ వేదికల్లో నిర్వహించేందుకు రంగం సిద్ధమవుతుంది. యూఏఈలో సరళమైన క్వారంటైన్ నిబంధనలు... పటిష్టమైన బబుల్, మహమ్మారి కూడా అదుపులో ఉండటం వల్ల విదేశీ ఆటగాళ్లందరూ పాల్గొంటారు. పొట్టి ఆటలో పోటీ రసవత్తరంగా సాగుతుంది. స్పాన్సర్ల ప్రయోజనాలు, బీసీసీఐ ఆర్థిక అవసరాలు కూడా నెరవేరుతాయి. అందుకే బోర్డు యూఏఈకే జై కొట్టింది. నిజానికి యూఏఈ బ్యాకప్ వేదికగా ఉంది.
అక్కడే ఎందుకంటే...
బోర్డు అంతా ఆలోచించే వేదికను యూఏఈకి తరలించింది. కరోనాతో పాటు ఇతరత్రా కారణాలు ఇందులో ఇమిడి ఉన్నాయి. ఇన్నాళ్లు కోవిడ్ ఉధృతి తగ్గదా... మన దేశంలో మనం ఘనంగా నిర్వహించుకోలేమా అన్న ధీమాతో బోర్డు ఉండేది. కానీ డెల్టా, డెల్టా ప్లస్ వేరియంట్లు భారత ప్రభుత్వాన్నే కాదు... బీసీసీఐని కూడా కలవర పెడుతున్నాయి. ప్రమాదకరమైన ఈ వేరియంట్ వ్యాక్సిన్‌కు తలొగ్గుతుందా లేదా అనే కచ్చితమైన సమాచారం కూడా లేదు. ఇప్పటికే ఈ సీజన్ ఐపీఎల్‌లో బయో బబుల్ పేలడం... ముఖ్యంగా విదేశీ ఆటగాళ్లు భయాందోళనకు గురవడంతో అర్ధంతరంగా లీగ్‌ను వాయిదా వేశారు. ఇప్పుడు ప్రతిష్టకు పోయి భారత్‌లో నిర్వహించి ప్రమాదాన్ని తెచ్చుకోవడం... బుడగ పగిలి ప్రపంచకప్ కూడా వాయిదా పడితే పరువు కూడా పోతుంది. ఇదే జరిగితే భవిష్యత్తులో ఎన్నో క్రికెట్ సిరీస్‌లపై ఇది పెనుప్రభావం చూపిస్తుంది. పైగా ఈసారి భారత ప్రభుత్వం 2016లో ఇచ్చిన పన్ను మినహాయింపు కూడా ఇవ్వలేదు. యూఏఈలో జరిపితే ఆ ప్రయోజనం కూడా బోర్డుకు దక్కుతుంది. ఇవన్నీ ఆలోచించే వేదికను మారుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment