రియాద్‌లో పాతబస్తీ యువతి మృతి
మృతదేహాన్ని తీసుకొచ్చేందుకు సహకరించాలని సీఎంకు తల్లి వేడుకోలు
యాకుత్‌పురా: ఉపాధి కోసం రియాద్ దేశానికి వెళ్లిన తన కూతురు తోటి పని వారి చేతిలో చిత్రహింసలకు గురై మృతి చెందిందని, మృతదేహాన్ని నగరానికి తీసుకొచ్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవ తీసుకోవాలని మృతురాలు ఆసిమా ఖతూన్ తల్లి గౌసియా ఖతూన్ కోరారు. చంచల్‌గూడలోని తన నివాసంలో గురువారం ఎంబీటీ నాయకుడు, మాజీ కార్పొరేటర్ అంజదుల్లా ఖాన్‌తో కలిసి ఆమె విలేకరులతో మాట్లాడుతూ... నాలుగు నెలల క్రితం హౌస్ మెయిడ్ (ఇంట్లో పని) వీసాపై తమ కూతురు ఆసిమా ఖతూన్ (25) రియాద్ వెళ్లిందన్నారు.
అక్కడ తన కూతుర్ని తోటి పని వారు ఓ గదిలో వేసి బంధించి, హింసించారని చెప్పింది. తీవ్ర అనారోగ్యానికి గురైన తన కూతురు ఆసియాఖతూన్‌కు ఛాతీలో నొప్పి రావడంతో ఇంటికి తీసుకెళ్లమని తనకు ఫోన్ చేసి పలుమార్లు కోరిందన్నారు. 20 రోజుల తనకు ఫోన్ చేయకపోవడంతో ఆరా తీయగా.. రియాద్‌లోని కింగ్ సౌద్ చెస్ట్ డిసీస్ ఆసుపత్రిలో చికిత్సపొందుతూ మృతి చెందినట్లు తెలిసిందన్నారు. దీనిపై తాము ఎంబాసీ, ఎన్నారై కార్యాలయాలతో పాటు పోలీసులకు సమాచారం అందించామన్నారు. తమ కూతురి మృతదేహాన్ని నగరానికి త్వరగా తీసుకొచ్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకరించాలని ఆమె కోరారు.