అండగా ఉన్నా.. అభివృద్ధి సాధిద్దాం | the development of Has supported | Sakshi
Sakshi News home page

అండగా ఉన్నా.. అభివృద్ధి సాధిద్దాం

Published Mon, Oct 12 2015 2:29 AM | Last Updated on Mon, Oct 1 2018 2:09 PM

అండగా ఉన్నా.. అభివృద్ధి సాధిద్దాం - Sakshi

అండగా ఉన్నా.. అభివృద్ధి సాధిద్దాం

జగదేవ్‌పూర్: ‘మిమ్మల్ని నమ్ముకుని పని చేస్తున్నా.. నా పేరు నిలబెట్టాలి.. కొండంత అండగా ఉన్నా.. విజయం సాధిస్తామన్న నమ్మకమూ ఉంది.. ఇప్పుడు ఏమి కాలే.. ఒక్కటో తరగతి చదవుతున్నాం.. ఇంకా ఓనమాలు నేర్చుకోవాలి.. గమ్యం చేరాలంటే ప్రయత్నం చేయాలి.. హైదరాబాద్‌లో అమలవుతున్న అభివృద్ధి తీరునే రెండు గ్రామాల్లో అమలు చేసుకుందాం.. ఇళ్ల టెండర్లు పూర్తి అయ్యాయి.. ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి ఉగాదికి ఇళ్లలోకి పోదాం.. ఊరంతా పండుగ చేసుకుందాం..

ఇక పెద్ద పని వ్యవసాయం.. మన బతుకుదెరువైన వ్యవసాయాన్ని బతికించుకోవాలి’ అని రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు తన దత్తత గ్రామాల ప్రజలకు సూచించారు. ఆదివారం ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాల్లోని ప్రజలకు కంటి అద్దాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ ఈ గ్రామాలు రాష్ట్రానికే ఆదర్శంగా నిలిచేలా అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు చెప్పారు. రెండు గ్రామాల్లో ఇళ్లకు భూమిపూజ ఒకే రోజు చేస్తానని చెప్పారు.  

హైదరాబాద్‌లో అమలవుతున్న తీరు లో ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాల్లో అభివృద్ధి పనులు అమలు చేసేలా అన్ని రకాలుగా అభివృద్ధి పనులు చేపడతామని సీఎం కేసీఆర్ అన్నారు. నాలుగైదు నెలల్లోనే డబుల్‌బెడ్రూంల నిర్మాణం పనులు పూర్తి చేసుకునే విధంగా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని సఎం అధికారులను ఆదేశించారు. గ్రామాల్లో అండర్ డ్రైనేజీ మురికి కాల్వలు, వాడవాడలా సీసీ రోడ్లు, రోడ్ల పక్కన పచ్చని మొక్కలు నాటుకోవాలని సూచించారు.
 
రాష్ట్రానికి ఆదర్శం...
ఎర్రవల్లి, నర్సన్నపేట రెండు గ్రామాలు రాష్ట్రానికే అదర్శం అయ్యేలా అభివృద్ధి సాధిస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు. రెండు గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. గ్రామంలో ఏ ఒక్కరు కూడా ఖాళీగా ఉండకుండా ఉపాధి కల్పిస్తామని చెప్పారు. గ్రామాభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలని, ఐకమత్యంతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు. రెండు గ్రామాల్లో పోటా పోటీగా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, పోటీలో ఏది ముందు గెలుస్తుందో చూడాలన్నారు.
 
భూ కమతాల ఏకీకరణకు రైతులు ముందుకు రావాలి....
తాతముత్తాతల కాలం నుంచి ఇప్పటి వరకు వారు చూపెట్టిన భూములనే సాగు చేసుకుని పంటలను పండిస్తున్నాం. అయితే చాలా మంది రైతులకు అక్కడో 10 గుంటలు, ఇక్కడో 20 గుంటలు భూమితో ఎన్నో ఇబ్బందులు పడుతున్నట్లు తెలిసింది. అయితే అందరు రైతులు భూ కమతాల ఏకీకరణ కోసం ముందుకు రావాలని కోరారు.

రూపాయి ఖర్చు లేకుండా అన్ని ప్రభుత్వామే భరిస్తుందని చెప్పారు. ఎర్రవల్లిలో 40, 50 మంది రైతులు మాత్రమే సమస్యల్లో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. కానీ ఎర్రవల్లి అన్నింట్లో ఆదర్శం కావాలంటే రైతులంతా భూ కమతాల ఏకీకరణకు ముందుకు రావాలన్నారు. భూ కమతాల ఏకీకరణకు ప్రభుత్వం ప్రత్యేక పథకాన్ని ప్రవేశపెట్టినట్లు చెప్పారు.
 
పేదలందరికీ ఉపాధి కల్పిస్తా...
రెండు గ్రామాల్లో భూమి లేని పేదలకు ఉపాధి కల్పిస్తామని సీఎం కేసీఆర్ చెప్పారు. తన గ్రామంలోనే స్వయం ఉపాధి పొందేలా వివిధ రకాల ఉపాధి పనులు కల్పించే విధంగా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ట్రాక్టర్లు ఇప్పిస్తామని, దీంతో వారు గ్రామంలోనే వ్యవసాయ పనులు చేపడుతూ ఉపాధి పొందాలని చెప్పారు. అలాగే బోరు బావులు లేని రైతులకు బోరు తవ్వించి మెటారు ఇప్పిస్తామని తెలిపారు. ఎలాంటి ఖర్చు లేకుండా ప్రభుత్వం అన్ని రకాలుగా ఉపాధి కల్పిస్తుందని చెప్పారు. ఎర్రవల్లిలో 8 ట్రాక్టర్లు ఉన్నాయని, మరో 20 ట్రాక్టర్లు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు.
 
రెండు గ్రామాల్లో కలిసి 11 వందల కంటి అద్దాలను పంపిణీ చేసినట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. ఎర్రవల్లిలో 7 వందలు, నర్సన్నపేటలో 4 వందల మందికి కంటి అద్దాలు పంపిణీ చేశామని తెలిపారు. ప్రతి ఒక్కరూ అద్దాలను జాగత్త్రగా చూసుకోవాలని, ప్రతి ఆరు నెలలకోసారి   యశోద హాస్పిటల్ వారు మీ గ్రామాలకు వచ్చి కంటి వైద్య పరీక్షలు చేపడతారన్నారు. కంటి చూపు బాగుంటేనే పని చేస్తామని, నా ఎడమ కంటికి కూడా ఆపరేషన్ అయిందని సీఎం చెప్పారు.
 
మెగా వైద్య శిబిరాలు..
ఈ నెల 13న ఎర్రవల్లిలో, 15న నర్సన్నపేటలో నిర్వహించే మెగా వైద్య శిబిరాలను గ్రామస్తులు సద్వినియోగం చేసుకోవాలని సీఎం రెండు గ్రామాల ప్రజలకు సూచించారు. ‘ఆరోగ్యమే మహాభాగ్యం, అందరు మంచిగా ఉంటేనే గ్రామం బాగుంటుంది. అందుకే యశోద హస్పటల్ ఆధ్వర్యంలో మెగా వైద్యశిబిరాలను నిర్వహించడానికి హాస్పిటల్ యాజమాన్యం ముందుకు వచ్చిందని చెప్పారు.  
 
నమ్మకాన్ని వమ్ము చేయవద్దు...
‘ఎర్రవల్లి, నర్సన్నపేట ప్రజలను నమ్ముకుని ముందుకు వచ్చిన, నా నమ్మకాన్ని వమ్ము చే యవద్ద’ని గ్రామస్తులకు సీఎం కేసీఆర్ సూచించారు. నేను మీకు అన్ని రకాలుగా అండగా ఉన్నానని విజయం సాధన కోసం కృషి చేయాలని కోరారు. రాష్ట్రంలో కాదు దేశంలోనే రెండు గ్రామాలు అదర్శవంతం అవుతాయని చెప్పారు.

ఇళ్లు పూర్తి అయ్యేవరకు తాత్కలికంగా షేడ్లు వేస్తున్నామని, వాటిలో గ్రామ ప్రజలు ఉండి గ్రామాభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు. ఈ నెల18న మళ్లీ వస్తానని చెప్పారు.  కార్యక్రమంలో కలెక్టర్ రోనాల్డ్‌రాస్, జేసీ వెంకట్రామిరెడ్డి, ఆర్డీఓ ముత్యంరెడ్డి, గడా అధికారి హన్మంతరావు, తహశీల్దార్ పరమేశం, ఎంపీడీఓ రామారావు, సర్పంచ్‌లు భాగ్యబాల్‌రాజు, బాల్‌రెడ్డి, జెడ్‌పీటీసీ రాంచంద్రం, ఎర్రవల్లి వీడీసీ కమిటీ అధ్యక్షులు కిష్టారెడ్డి, టీఆర్‌ఎస్ నాయకులు భూంరెడ్డి, శ్రీనువాస్‌రెడ్డి, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement