కట్న పిశాచులు
► పెళ్లైన ఇరవై రోజులకే కట్నం వేధింపులు
► పాలు, పండ్లలో విషం కలిపి చంపేందుకు ప్రయత్నం
►ఎదురు తిరిగినందుకు ఇంట్లో బంధించి చిత్రహింసలు
►ఆపై తాడుతో గొంతుకు బిగించి ఉరేసే యత్నం
►చాకచక్యంగా తప్పించుకున్న
నవ వధువు
పెళ్లంటే పందిళ్లు, తప్పెట్లు, తాళాలు, తలంబ్రాలు, మూడుముళ్లు, ఏడడుగులు..మొత్తం కలిపి నూరేళ్లు’ అంటూ.. ఓ సినీకవి సెలవిచ్చారు. వైవాహిక బంధం ఎలా ఉండాలో తెలుపుతూ ‘పెళ్లి పుస్తకం ’ సినిమాలో మరో కవి రాసిన పాట అందరినీ ఆలోచింపజేసింది. ప్రతి ఆడపిల్ల తన వైవాహిక జీవితంపై ఎన్నో కలలు కంటుంది. అమ్మలేని లోటు తెలియకుండా నాన్న పెంపకంలో పెరిగిన ఆమె కూడా సగటు ఆడపిల్లల్లాగే ఎన్నో కలలు కంది. కాబోయే భర్తపై ఎన్నో ఆశలు పెట్టుకుంది. అత్తారింట అడుగుపెట్టిన మరుసటి రోజు నుంచే నరకం అంటే ఏమిటో ఆమెకు అనుభవమైంది. ఇచ్చిన కట్నం చాలదంటూ భర్త, అత్త కలసి ఆమెను ఇంట్లో బంధించి చిత్రహింసలు పెట్టారు. పాలు, పండ్లలో విషం కలిపి చంపాలని ప్రయత్నించారు. అదీ చాలక ఉరివేసి మట్టుబెట్టేం దుకు యత్నించారు. అయితే ఆ రాక్షసుల నుంచి ఆమె ఎలాగోలా తప్పించుకుని ప్రాణాలు కాపాడుకుంది. - కుందుర్పి
కుందుర్పి: కుందుర్పి మండలం బెస్తరపల్లి కి చెందిన వడ్డె మూర్తి కుమార్తె చంద్రకళ(28)ను కర్ణాటకలోని మాగడి పట్టణంలో బిల్డింగ్ కాంట్రాక్టర్ జగన్నాథ్‌తో గత ఏప్రిల్ 4న పెళ్లైంది. ఆ సమయంలో కట్నకానుకల కింద నాలుగు తులాల బంగారం రూ.25 వేల నగదు ఇచ్చారు. కాపురానికి వెళ్లిన 20 రోజులకే అత్త లీలావతి, భర్త జగన్నాథ్ కలసి చంద్రకళను కట్నం చాలా తక్కువ ఇచ్చారని, వేరేవాళ్లు మా వాడికి రూ.2 లక్షల కట్నం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారంటూ సాధించడం మొదలుపెట్టారు. అదనపు కట్నం తీసుకురాని పక్షంలో ఇంటినుంచి వెళ్లిపోవాలంటూ అత్త లీలావతి పోరు పెట్టింది.
ఎదురు తిరగడంతో...
తల్లిలేని తాను పుట్టింటికి ఎలా వెళ్లాలని చంద్రకళ ప్రశ్నించడంతో అత్త మరింత కసి పెంచుకుంది. నన్నే ప్రశ్నిస్తావా? అంటూ రోజూ పాలు, పళ్ల రసాల్లో మత్తుమాత్రలు వేసి చిత్రహింసలకు గురి చేసేవారు. పగలంతా నిర్భంధించి విషక్షణారహితంగా కొట్టేవారు.
కుట్రను పసిగట్టి..
గత నెల 25న భర్త జగన్నాథ్, అత్త లీలావతి కలసి తాడుతో ఉరివేసేందుకు ప్రయత్నించగా వారి నుంచి తప్పించుకున్న చంద్రకళ బెంగళూరులోని బంధువుల ఇంటికి చేరింది. రెండ్రోజుల అనంతరం స్వగ్రామం బెస్తరపల్లి చేరింది.
పట్టించుకోని పోలీసులు
తనకు జరిగిన అన్యాయంపై కర్ణాటక పోలీసులకు జూన్ ఒకటిన ఫిర్యాదు చేసినా స్పందించ లేదని చంద్రకళ ఆవేదన వ్యక్తం చేసింది. తన భర్త జగన్నాథ్, అత్త లీలావతిపై చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలంటూ బాధితురాలు తన తండ్రితో కలసి కళ్యాణదుర్గం డీవైఎస్పీ పులిపాటి అనిల్‌కుమార్‌ను శనివారం కలసి ఫిర్యాదు చేసింది.