వివాహిత దారుణ హత్య
- హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించిన భర్త, అత్త
- చిత్రహింసలకు గురిచేసి హత్యచేశారని మృతురాలి తల్లిదండ్రుల ఆరోపణ, ఫిర్యాదు
- హత్య కేసు నమోదు చేసిన పోలీసులు
కందుకూరు అర్బన్ : ఓ వివాహితను ఆమె భర్త, అత్త కలిసి చిత్రహింసలకు గురిచేసి హత్యచేశారు. ఆపై ఆమే కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకుందని చిత్రీకరించారు. మృతురాలి తల్లిదండ్రులు తెలిపిన వివరాలు, ఇచ్చిన ఫిర్యాదుతో పాటు సంఘటన స్థలంలో ఆధారాల ప్రకారం పోలీసులు వరకట్న వేధింపుల హత్యకేసుగా నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బుధవారం కందుకూరు పట్టణంలో జరిగిన ఈ సంఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. ఆ వివరాల ప్రకారం... చినగంజాం మండలం కడవకుదురు గ్రామానికి చెందిన తోట యానాది, లక్ష్మిల కుమార్తె గౌతమి (22)ని కందుకూరు పట్టణం తూర్పుకమ్మపాలేనికి చెందిన గంటా సత్యవతి కుమారుడు చలపతికి ఇచ్చి 2011లో వివాహం చేశారు. ప్రస్తుతం వీరికి నాలుగేళ్ల కుమార్తె హనీ, 11 నెలల కుమారుడు అయ్యప్ప సంతానం.
కొంతకాలంగా అత్త సత్యవతి చెప్పిన విధంగా వినడం లేదని భర్త చలపతి, అత్త కలిసి గౌతమిని వేధిస్తున్నారు. అనేకసార్లు కొట్టి చిత్రహింసలకు గురిచేశారు. గౌతమి తన తల్లిదండ్రులకు చెప్పుకుని బాధపడగా, వారు నచ్చజెప్పారు. ఈ నేపథ్యంలో మంగళవారం కూడా గౌతమిపై భర్త, అత్త దాడిచేశారు. రాత్రి తొమ్మిది గంటల సమయంలో తండ్రి యానాదికి ఫోన్‌చేసి బుధవారం ఉదయం తన దగ్గరికి రావాలని గౌతమి కోరింది. అయితే, బుధవారం వేకువజామున నాలుగున్నర గంటల సమయంలో తన కోడలు కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుందని సత్యవతి కేకలు వేయడంతో స్థానికంగా ఉన్న ఓ వ్యక్తి పరిగెత్తుకుంటూ ఆ ఇంటి వద్దకు వచ్చాడు. మెయిన్ గేటుకు తాళం వేసి ఉండటం, తాళం తీయమని అడిగినా సత్యవతి తీయకపోవడంతో గోడదూకి లోపలికి వెళ్లి పక్కనున్న ఇసుకను గౌతమిపై పోసి మంటలు ఆర్పివేశాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న చలపతి చూస్తూ ఉండిపోయాడు.
హత్యచేసి ఆపై దహనం చేశారు : తల్లిదండ్రులు
తమ కుమార్తెను చాలాకాలంగా భర్త, అత్త కలిసి వేధిస్తున్నారని, దానిలో భాగంగానే కొట్టి హత్యచేసి, ఆపై కిరోసిన్ పోసి దహనం చేశారని గౌతమి తండ్రి యానాది, తల్లి లక్ష్మి కన్నీటిపర్యంతమయ్యారు. సంఘటనకు 8 గంటల ముందు తమ కుమార్తె తమకు ఫోన్‌చేసి వేధింపులపై ఆవేదనతో మాట్లాడిందని, బుధవారం ఉదయం రావాలని కోరిందని చెప్పారు. కచ్చితంగా తమ కుమార్తెను హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు కుట్రపన్నుతున్నారని ఆరోపించారు. ఆ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు సంఘటన స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ జి.శ్రీనివాసరావు వరకట్న వేధింపుల హత్య కేసుగా నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సీఐ లక్ష్మణ్ సంఘటన స్థలాన్ని పరిశీలించి విచారించారు.
ఇవీ అనుమానాలు...
గౌతమి కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ఆమె భర్త, అత్త చెబుతుండగా, సంఘటన స్థలంలో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గౌతమి మృతదేహం పడి ఉన్న చుట్టుపక్కల ఎక్కడా ఆమె కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆ బాధ భరించలేక అటూఇటూ పరిగెత్తినట్లు గుర్తులు లేవు. ఉద్దేశపూర్వకంగా హత్యచేసి ఆపై కిరోసిన్‌పోసి తగులబెట్టినట్లు తెలుస్తోంది.
కలచివేసిన చిన్నారుల రోదన...
తల్లి చనిపోవడంతో ఆమె ఇద్దరు చిన్నారులు రోదించడం చూపరులను కలచివేసింది. పాలకోసం 11 నెలల కుమారుడు ఏడుస్తుంటే ఓదార్చడం ఎవరివల్లా కాలేదు.