
19 మంది ఎమ్మెల్యేలపై వేటు
ముంబై: మహారాష్ట్ర శాసనసభలో గలాభా సృష్టించిన విపక్ష ఎమ్మెల్యేలపై వేటు పడింది. 19 మంది ఎమ్మెల్యేలను 9 నెలల పాటు సస్పెండ్ చేస్తూ అసెంబ్లీ స్పీకర్ హరిభావ్ బాగాడే తీవ్ర నిర్ణయం తీసుకున్నారు. డిసెంబర్ 31 వరకు సభలో అడుగుపెట్టకుండా సస్పెండ్ చేశారు.
ఈ నెల 18న శాసనసభలో రాష్ట్ర ఆర్థిక మంత్రి సుధీర్ ముంగంటివార్ బడ్జెట్ ప్రవేశపెడుతుండగా కాంగ్రెస్, ఎన్సీపీ తదితర విపక్ష సభ్యులు తీవ్ర గందరగోళం సృష్టించారు. బడ్జెట్ ప్రతులు చదువుతున్న సమయంలో మంత్రిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. అక్కడితో ఆగకుండా బడ్జెట్ ప్రసంగం వినపడకుండా గట్టిగా నినాదాలు చేశారు.
ప్రతిపక్ష సభ్యుల వ్యవహారశైలిని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తప్పుబట్టారు. ప్రజాస్వామ్య ప్రతిష్టను దిగజార్చేలా ప్రవర్తించారని మండిపడ్డారు. విపక్ష సభ్యుల క్రమశిక్షణారాహిత్యాన్ని సీరియస్ గా తీసుకున్న స్పీకర్ వారిపై వేటు వేశారు.