2 కూటములు, 6 ప్రాంతాలు
మహారాష్ట్రలో సై అంటే సై
వైరి సేనల హోరాహోరీ
రేపే(నవంబర్ 20న) 288 స్థానాలకు పోలింగ్.. 23న కౌంటింగ్-ఫలితాల వెల్లడి
రెండు జాతీయ పార్టీలు. నాలుగు ప్రాంతీయ పార్టీలు. పలు చిన్న పార్టీలు. భారీ సంఖ్యలో స్వతంత్రులు, రెబెల్స్. వెరసి మహారాష్ట్ర చరిత్రలోనే అత్యంత సంకుల సమరానికి రంగం సిద్ధమైంది. కనీవినీ ఎరగనంత పోటాపోటీగా సాగుతున్న అసెంబ్లీ ఎన్నికల పోరు చివరి దశకు చేరుకుంది. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని ఆరు ప్రాంతాలకు గాను ఏకంగా నాలుగింట విపక్ష మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) ఆధిపత్యమే సాగింది. అధికార మహాయుతి కూటమి కొంకణ్‌లో మాత్రమే కాస్త పరువు నిలుపుకుంది. అదే జోరును కొనసాగించాలని ఎంవీఏ, మిగతా ప్రాంతాల్లోనూ పాగా వేయాలని మహాయుతి శాయశక్తులా ప్రయత్నిస్తున్నాయి.
పశ్చిమ మహారాష్ట్ర.. షుగర్ బెల్ట్‌గా పిలిచే ఈ ప్రాంతం అత్యధికంగా 70 అసెంబ్లీ స్థానాలకు నిలయం. గత అసెంబ్లీ ఎన్నికల్లో అవిభక్త ఎన్సీపీ ఏకంగా 27 స్థానాలు నెగ్గింది. బీజేపీకి 20, కాంగ్రెస్‌కు 12, అవిభక్త శివసేనకు 5 స్థానాలు దక్కాయి. శివసేన, ఎన్సీపీల్లో చీలిక అనంతరం జరిగిన ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో ఈ ప్రాంతంలోని 10 లోక్‌సభ స్థానాల్లో ఎంవీఏ ఐదింటిని నెగ్గి స్వల్ప పైచేయి సాధించగా మహాయుతి నాలుగింటితో సరిపెట్టుకుంది. మిగతా స్థానంలో నెగ్గి్గన స్వతంత్ర అభ్యర్థి కూడా కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా లోక్‌సభ ఫలితాలే పునరావృతం కావచ్చని భావిస్తున్నారు. ఇక్కడ ఎన్సీపీ అజిత్, శరద్ పవార్ వర్గాలు ఏకంగా 20 స్థానాల్లో ముఖాముఖి తలపడుతుండటం విశేషం.
లోక్‌సభ పోరులో పవార్ వర్గం ఏకంగా 3 స్థానాల్లో నెగ్గగా అజిత్ వర్గానికి ఒక్క సీటూ దక్కకపోవడం విశేషం. పవార్ల కంచుకోట బారామతి ఈ ప్రాంతంలోనే ఉంది. ఆ స్థానంపై పట్టు నిలుపుకునేందుకు శరద్ పవార్ సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. పార్టీని చీల్చిన అజిత్ పవార్ ఇక్కడ బరిలో ఉండటంతో ఆయన్ను ఎలాగైనా ఓడించాలని కంకణం కట్టుకున్నారు. మేనల్లుడు యుగేంద్రను అజిత్‌పై బరిలో దించారు. పశ్చిమ మహారాష్ట్రలో సహకార సంఘాల హవా నడుస్తుంటుంది. రైతు సమస్యలు ఈసారి ఇక్కడ ప్రధానాంశంగా మారాయి.
కొంకణ్.. ఎంవీఏపై పాలక కూటమి స్పష్టమైన ఆధిక్యం ప్రదర్శించిన ఏకైక ప్రాంతం. లోక్‌సభ ఎన్నికల్లో ఇక్కడి 6 స్థానాల్లో మహాయుతి ఏకంగా ఐదింట నెగ్గింది. దాన్ని నిలుపుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా కొంకణ్‌కు పోర్టు, మలీ్టమోడల్ కారిడార్, మెగా రిఫైనరీ తదితర భారీ ప్రాజెక్టులను ప్రకటించింది. దాంతో ఎంవీఏ కూటమి తన ప్రచారాన్ని ఈ ప్రాంతంలో శివాజీ విగ్రహం కూలిపోయిన ఘటన చుట్టే తిప్పుతూ లబ్ధి పొందే ప్రయత్నాల్లో పడింది. కొంకణ్ శివసేన చీఫ్, సీఎం ఏక్‌నాథ్ షిండే కంచుకోట. ఇక్కడి కోప్రీ–పచ్‌పాఖడీ నుంచి ఆయన బరిలో దిగారు. షిండేపై ఆయన రాజకీయ గురువు ఆనంద్ డిఘే మేనల్లుడు కేదార్ ప్రకాశ్‌ను ఉద్ధవ్ సేన పోటీకి నిలిపింది.
విదర్భ.. మహారాష్ట్రలో అత్యంత వెనకబడ్డ ప్రాంతాల్లో ఒకటి. లోక్‌సభ ఎన్నికల్లో ఇక్కడి 10 స్థానాల్లో ఏకంగా ఏడు ఎంవీఏ ఖాతాలో పడ్డాయి. వాటిలో ఐదింటిని కాంగ్రెసే నెగ్గింది. మరాఠాలతో పాటు ఓబీసీలు, దళితులు ఇక్కడ చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉంటారు. ఒకప్పుడు ఈ ప్రాంతం కాంగ్రెస్ కంచుకోట. కానీ 20 ఏళ్లుగా ఇక్కడ బాగా బలహీనపడుతుండగా బీజేపీ పుంజుకుంటోంది. దీనికి తోడు ప్రత్యేక విదర్భ రాష్ట్ర డిమాండ్‌కు మద్దతివ్వడం బీజేపీకి ఆదరణను మరింత పెంచింది. అధికారాన్ని నిలుపుకోవాలంటే విదర్భలో వీలైనన్ని ఎక్కువ స్థానాలు నెగ్గడం మహాయుతికి కీలకం. దాంతో పారిశ్రామిక హబ్‌తో పాటు ఈ ప్రాంతంపై వరాల వర్షం కురిపించింది. ఇక్కడ దాదాపుగా అన్ని పారీ్టలకూ రెబెల్స్ బెడద తీవ్రంగా ఉంది. రైతు సమస్యలు కూడా ఇక్కడ ఓటర్లను బాగా ప్రభావితం చేసేలా కనిపిస్తున్నాయి. ఈ ప్రాంతంలో బీజేపీ నుంచి ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, పీసీసీ చీఫ్ నానా పటోలే పోటీ చేస్తున్నారు.
మరాఠ్వాడా.. రాష్ట్రంలో అత్యంత వర్షాభావ ప్రాంతం. లోక్‌సభ ఎన్నికల్లో ఎంవీఏ హవా సాగింది. ఏడింట 6 స్థానాలు విపక్ష కూటమి ఖాతాలోకే వెళ్లాయి. మిగతా ఒక్క స్థానాన్ని షిండే శివసేన గెలుచుకుంది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన బీజేపీ, అవిభక్త శివసేన 46 స్థానాలకు గాను 28 సీట్లను గెలుచుకున్నాయి. మరాఠాలను ఓబీసీ జాబితాలో చేర్చాలంటూ మనోజ్ జరంగే ఉద్యమించిన నేపథ్యంలో ఈసారి మాత్రం ఆ పరిస్థితి లేదు. మరాఠా రిజర్వేషన్లు కీలకంగా మారడం మహాయుతికి ఇబ్బంది కలిగించేదే. మరాఠా ఓట్లపై ఎంవీఏ, ఓబీసీ ఓట్లపై మహాయుతి ఆశలు పెట్టుకున్నాయి. మరాఠాలు, ఓబీసీలతో పాటు ముస్లింలు కూడా ఇక్కడ చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉంటారు.
ఉత్తర మహారాష్ట్ర.. ఇది ప్రధానంగా వ్యవసాయ ప్రాంతం. లోక్‌సభ ఎన్నికల్లో ఏడింటి ఆరు సీట్లు ఎంవీఏ ఖాతాలో పడగా బీజేపీ ఒక్క స్థానంతో సరిపెట్టుకుంది. ఈ ప్రాంతంలో ఉల్లి రైతులు ఎక్కువ. ఉల్లి ఎగుమతుల నిషేధంతో కేంద్రం తమ పొట్ట కొట్టిందన్న ఆగ్రహం వారిలో కనిపిస్తోంది. ఇది మహాయుతికి బాగా చేటు చేసేలా కనిపిస్తోంది. నాసిక్, పరిసర ప్రాంతాల్లో గణనీయంగా ఉన్న గిరిజనుల ఓట్లు కూడా ఇక్కడ కీలకమే. గత అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఇటీవలి లోక్‌సభ పోరులోనూ వారు ఎంవీఏ కూటమికే దన్నుగా నిలిచారు.
ముంబై.. దేశ ఆర్థిక రాజధాని. ముంబైతో పాటు శివారు ప్రాంతాల్లో కలిపి 36 అసెంబ్లీ స్థానాలున్నాయి. లోక్‌సభ ఎన్నికల్లో ఇక్కడి ఆరు స్థానాల్లో మహాయుతికి దక్కింది రెండే. ముంబైపై బాగా పట్టున్న ఉద్ధవ్ శివసేన 3 స్థానాలు చేజిక్కించుకుంది. ఈసారి షిండే, ఉద్ధవ్ సేనల మధ్య ఇక్కడ హోరాహోరీ సాగుతోంది. వీటికి తోడు మహారాష్ట్ర నవనిర్మాణ సేన కూడా ఇక్కడ గట్టి ప్రభావమే చూపుతుంది.
వరాల జల్లులు
⇒ రెండు కూటములూ ఈసారి తమ మేనిఫెస్టోల్లో అన్ని వర్గాలపైనా వరాల వర్షం కురిపించాయి.
⇒ లడ్కీ బెహన్ యోజన మొత్తాన్ని రూ.1,500 నుంచి రూ.2,100కు పెంచుతామని మహాయుతి ప్రకటించగా తామొస్తే ఏకంగా రూ.3,000 ఇస్తామని ఎంవీఏ పేర్కొంది.
⇒ మహాయుతి రైతు రుణ మాఫీ హామీకి పోటీగా తాము ఏకంగా రూ.3 లక్షల దాకా రైతు రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించింది.
⇒ 25 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని మహాయుతి హామీ ఇస్తే నిరుద్యోగ యువతకు నెలకు రూ.4,000 ఇస్తామని ఎంవీఏ చెప్పింది.
Comments
Please login to add a commentAdd a comment