దినకరన్ అస్త్రం.. పళనికి పదవీగండం!
గవర్నర్‌కు 19 మంది ఎమ్మెల్యేల ఫిర్యాదు
చెన్నై: తమిళనాడులో రాజకీయ పరిణామాలు రోజుకో రకంగా మారుతున్నాయి. నిన్నటికి నిన్న అన్నాడీఎంకేలో బద్ధవిరోధులుగా ముద్రపడిన ఓ. పన్నీర్ సెల్వం (ఓపీఎస్), ఎడపాటి పళనిస్వామి (ఈపీఎస్) వర్గాలు విలీనం కాగా.. ఈ విలీనానికి వ్యతిరేకంగా శశికళ వర్గం పావులు కదుతుపుతోంది. తమను పక్కనబెట్టి మరీ ఓపీఎస్, ఈపీఎస్ గ్రూపులు ఏకంకావడంతో.. పళని సర్కారును కూల్చి బుద్ధి చెప్పాలని శశికళ వర్గం భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే శశికళ అక్క కొడుకు దినకరన్ నేతృత్వంలో 19మంది ఎమ్మెల్యేలు మంగళవారం గవర్నర్ సీహెచ్ విద్యాసాగరరావును కలిశారు. పళనిస్వామి నేతృత్వంలోని ప్రభుత్వానికి తమ మద్దతు లేదని వెల్లడించారు. పళనిస్వామిని ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించాలని గవర్నర్‌ను కోరారు.
తాజా పరిణామంతో పళని-పన్నీర్ సర్కారు మైనారిటీలో పడే అవకాశముందని రాజకీయ నిపుణులు భావిస్తున్నారు. అయితే, పళని సర్కారుకు పూర్తి సంఖ్యాబలం ఉందని అన్నాడీఎంకే సీనియర్ నేత మైత్రేయేన్ చెప్తున్నారు. మరికాసేపట్లో ఆయన గవర్నర్‌ను కలిసి పళని ప్రభుత్వానికి ఉన్న సంఖ్యాబలాన్ని వివరించనున్నారు.
దినకరన్ వర్గం రాజీనామా చేస్తే!
తమిళనాడు అసెంబ్లీలో ప్రస్తుత ఎమ్మెల్యేల సంఖ్య 234 (జయలలిత మరణంతో ఆర్కేనగర్ ఖాళీగా ఉంది). ఇందులో ప్రభుత్వాన్ని నిలుపుకునేందుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 118. జయ మరణం తర్వాత పన్నీర్ వర్గం విడిపోవటంతో జరిగిన విశ్వాస పరీక్షలో పళనిస్వామి 122 సీట్లతో గట్టెక్కారు. ఇందులో పళనిస్వామి వద్ద 94 మంది ఎమ్మెల్యేలుండగా.. దినకరన్ మద్దతుదారులైన 28మంది సభ్యులు అండగా నిలిచారు.
అయితే తాజా విలీనం, శశికళను పార్టీనుంచి బహిష్కరించేందుకు జరుగుతున్న ప్రయత్నాలతో దినకరన్ అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలో 19మంది తన మద్దతుదారులైన ఎమ్మెల్యేలతో దినకరన్ గవర్నర్‌ను కలిశారు. ఒకవేళ వీరందరితో దినకరన్ రాజీనామా చేయిస్తే.. (చెన్నైలో ఈ చర్చ జరగుతోంది) మ్యాజిక్ ఫిగర్ తగ్గి.. పన్నీర్, పళనిలకు మేలు జరుగుతుంది. అయితే, ఇన్నిరోజులు కష్టపడీ దినకరన్ ఇంత సులువుగా పళనికి అవకాశమిస్తారా అనేది ప్రశ్నార్థకమే.
మద్దతు వెనక్కి తీసుకుంటే?
ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు ఈ 19 మంది ఎమ్మెల్యేలు గవర్నర్‌కు వెల్లడిస్తే.. పళని సర్కారు మైనారిటీలో పడే అవకాశముంది. అప్పుడు స్టాలిన్ పెట్టే అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా వీరు ఓటేస్తే.. ప్రభుత్వం కూలే అవకాశాలు కనిపిస్తున్నాయి. అసెంబ్లీలో డీఎంకేకు 89, కాంగ్రెస్‌కు 8 మంది ఎమ్మెల్యేలుండగా ముస్లింలీగ్‌కు ఒక సభ్యుడున్నాడు. స్టాలిన్‌కు దినకరన్ వర్గం మద్దతిచ్చినట్లయితే.. ఈ కూటమి బలం (89+8+1+19) 117కు చేరుతుంది. మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా శశికళ వర్గంతో చేతులు కలిపితే.. పళని సర్కారు బలపరీక్షలో ఓడిపోతుంది.