
విమానం టాయ్‌లెట్‌లో 24 కిలోల బంగారం
కోల్‌కతా: విదేశాల నుంచి దేశంలోకి భారీస్థాయిలో అక్రమంగా తరలిస్తున్న బంగారం వ్యవహారం వెలుగులోకి వచ్చింది. బ్యాంకాక్ నుంచి కోల్‌కతాలోని ఎన్‌ఎస్‌సీ బోస్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చిన ఓ విమానం మరుగుదొడ్లో దాచిన 24 కిలోల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు రూ.7.22 కోట్లు ఉంటుందని వెల్లడించారు.
సోమవారం రాత్రి నగరానికి చేరుకున్న విమానంలో మరుగుదొడ్లు శుభ్రం చేస్తున్న సిబ్బంది రెండు బ్యాగులు గుర్తించి అధికారులు సమాచారం అందించారు. తొలుత బాంబులుగా భావించిన అధికారులు బాంబు నిర్వీర్య దళాన్ని రంగంలోకి దింపారు. అనంతరం వాటిని తెరిచి చూడగా వాటిలో ఒక్కొక్కటీ కిలో బరువున్న 24 బంగారు బిస్కట్లు కనిపించాయి.