
నిమిషానికి 25 పైసలే..ఏ నెట్‌వర్క్‌కైనా
యునినార్ కొత్త ఆఫర్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెలికం రంగంలో మరో ధరల యుద్ధానికి తెరలేవనుందా? ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. ఒకవైపు నిర్వహణ వ్యయ భారాన్ని తట్టుకోలేక ఆపరేటర్లు టారిఫ్‌లను పెంచుతూ వస్తుంటే.. యునినార్ మాత్రం దానికి విరుద్ధంగా సంచలనాత్మక ఆఫర్‌ను ఆవిష్కరించింది. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న యునినార్ కస్టమర్లు దేశవ్యాప్తంగా ఏ నెట్‌వర్క్‌కైనా నిమిషానికి 25 పైసలకే కాల్ చేసుకునే సదుపాయాన్ని ప్రకటించింది. ‘సబ్ సే సస్తా’ వాగ్దానానికి ఇది కొనసాగింపు అని కంపెనీ స్పష్టం చేసింది. యునినార్ ఇప్పటికే మహారాష్ట్ర, గోవా సర్కిల్‌లో ఇటువంటి పథకాన్ని అందుబాటులోకి తెచ్చి విజయవంతమైంది. కంపెనీ సేవలందిస్తున్న మిగిలిన నాలుగు సర్కిళ్లకూ దీనిని విస్తరించనున్నారు. కేవలం స్థానిక కాల్స్ చేసుకునే కస్టమర్లు రూ.17 విలువగల స్పెషల్ టారిఫ్ వోచర్‌ను(ఎస్‌టీవీ) కొనుగోలు చేస్తే చాలు. ఎస్టీడీ కావాల్సినవారు రూ.29 విలువైన ఎస్‌టీవీని తీసుకోవాల్సి ఉంటుంది. వోచర్ల కాల పరిమితి 28 రోజులు.
50 శాతం ఆదా..: కొత్త ఆఫర్‌తో ప్రీపెయిడ్ కస్టమర్లు తమ నెలవారీ బిల్లులో 50 శాతం ఆదా చేసుకోవచ్చని యునినార్ ఆంధ్రప్రదేశ్ సర్కిల్ బిజినెస్ హెడ్ సతీశ్ కన్నన్ గురువారమిక్కడ మీడియాకు తెలిపారు. ‘టెలికం రంగంలో టాక్ టైం, కాల్ రేట్లు ప్రధానమైనవి. దీనిని దృష్టిలో పెట్టుకుని కొత్త ప్యాక్‌కు రూపకల్పన చేశాం. ఆంధ్రప్రదేశ్‌లో ఇదే చవకైన పథకం. మార్కెట్లో సంచలనం సృష్టించడం ఖాయం’ అని అన్నారు. ప్రవేశపెడుతున్న అన్ని ఉత్పత్తులను కొనసాగిస్తున్నట్టు చెప్పారు. మొబైల్ ఫోన్ వాడకందార్లలో 90% మంది డ్యూయల్ సిమ్ ఫోన్లను వినియోగిస్తున్నారని, ఇది కంపెనీకి కలిసి వస్తుందని వివరించారు.