ఐదేళ్లలో 36 శాతం వృద్ధి
భారత ఈ కామర్స్ హవా
టెక్‌సై రీసెర్చ్ వెల్లడి
కోల్‌కత: భారత ఈ-కామర్స్ మార్కెట్ ఐదేళ్లలో 36 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి సాధించగలదని కెనడాకు చెందిన టెక్‌సై రీసెర్చ్ సంస్థ తాజా నివేదిక తెలిపింది. భారీ డిస్కౌంట్లు, స్మార్ట్‌ఫోన్‌ల విని యోగం బాగా పెరగడం, తలసరి వ్యయార్హ వేతనాలు పెరగడం, యువ జనాభా పెరుగుతుండడం వంటి కారణాల వల్ల 2015-20 కాలానికి ఈ కామర్స్ మార్కెట్ ఈ స్థాయిలో దూసుకుపోతుందని పేర్కొంది. ఈ వివరాలను టెక్‌సై రీసెర్చ్ డెరైక్టర్ కరణ్ చెచి వెల్లడించారు. నివేదిక ప్రకారం..
భారత ఉద్యోగుల్లో యువ జనాభా అధికంగా ఉంది. సంప్రదాయ షాపులకు వెళ్లి షాపింగ్‌కు చేసేంత తీరిక సమయం వీరికి ఉండడం లేదు. దీంతో ఆన్‌లైన్ షాపింగ్ జోరుగా పెరుగుతోంది.ఈ-కామర్స్ కంపెనీలు ఒకదానితో ఒకటి పోటీపడుతూ భారీ డిస్కౌంట్లను ఇస్తున్నాయి. దీంతో ఆన్‌లైన షాపింగ్ పట్ల ఆసక్తి పెరుగుతోంది.భారత ఈ-కామర్స్ మార్కెట్లో ఈ సేవల సెగ్మెంట్ జోరు బాగా ఉంది. అన్నింటిలోకి ఆన్‌లైన్ ట్రావెల్ మార్కెట్ జోరుగా ఉంది. సెలవు రోజులు గడపటానికి, హోటళ్లు, బస్, రైలు, విమా న టికెట్ల బుకింగ్స్ కారణంగా ఆన్‌లైన్ ట్రావెల్ మార్కెట్ లావాదేవీలు దూసుకెళ్తున్నాయి.
ఈ-కామర్స్ మార్కెట్లో చెల్లింపుల విధానం చెప్పుకోదగిన స్థాయిలో మెరుగుపడుతోంది. దీంతో ఆన్‌లైన్ షాపింగ్ సురక్షితం కాదనే భావన నుంచి వినియోగదారులు బైటపడుతున్నారు.కన్సూమర్ ఎలక్ఠ్రానిక్స్, ఆన్‌లైన్ ట్రావెల్, అప్పారెల్, యాక్సెసరీలు... ఈ సెగ్మెంట్లలో వృద్ధి అంతకంతకూ జోరందుకుంటోంది.కొన్న రోజే డెలివరీ చేసే అవకాశంతో ఆన్‌లైన్ కిరాణా పోర్టల్స్ బిజినెస్ పుంజుకుంటోంది.