దేశంలో 40 శాతం రోడ్లు అవేనట!
న్యూఢిల్లీ : పల్లె అయినా, పట్టణమైనా అభివృద్ధిలో పరుగులు తీయాలంటే ముందు రోడ్లు బాగుండాలి. కానీ దేశ ఆర్థికవ్యవస్థలో ఎంతో కీలక పాత్ర పోషిస్తున్న రహదారుల అభివృద్ధి అరకొరగానే సాగిందని రిపోర్టులు వెల్లడిస్తున్నాయి. ఒక రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాలకు అనుసంధానమయ్యే జాతీయ రహదారుల్లో 78శాతం ఒకటి లేదా రెండు వరుసల బాటలేనట. మరో విచారకర విషయమేమిటంటే 40శాతం గ్రామ రహదారులు, జిల్లాలను అనుసంధానించే రోడ్లు, రాష్ట్ర రహదారులు మట్టితో వేసినవేనని రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ వెల్లడించిన గణాంకాల్లో వెల్లడైంది. అంటే గ్రామీణప్రాంతాల్లో రోడ్ల రవాణా వ్యవస్థ ఇంకా అస్తవ్యస్తంగా ఉందనడానికి ఇదో ఉదాహరణగా నిలుస్తున్నట్లు రిపోర్టులో తెలిసింది. ప్రస్తుతం ప్రభుత్వాలు ఎక్కువగా దృష్టిసారిస్తున్న నాలుగు లైన్ల రహదారుల అభివృద్ధి ప్రయత్నాలు దేశ ఆర్థికవ్యవస్థకు సవాలుగా నిలుస్తున్నట్టు తాజా గణాంకాలు చెబుతున్నాయి.
మారుమూల ప్రదేశాల్లో రవాణా వ్యవస్థను మెరుగుపరిస్తే, వచ్చే ఏళ్లలో ఉద్యోగవకాశాలు పుష్కలంగా కల్పించవచ్చని ఆశిస్తున్నట్టు రిపోర్టు తెలిపింది. ఇంకా 14 లక్షల కిలోమీటర్ల పైగా రహదారులను విస్తరించాల్సి ఉండగా.. వాటిలో 11.5 లక్షల కిలోమీటర్ల రోడ్లు గ్రామీణ, ప్రాజెక్టు రోడ్లేనని రిపోర్టు తెలిపింది. గ్రామీణ ప్రాంతాల్లో రహదారులు నిర్మించాల్సిన బాధ్యత పంచాయతీలకు, జిల్లా పరిషత్తులకు ఉంటుందని, ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన కింద కూడా గ్రామాల్లో రోడ్లను నిర్మస్తారు. ప్రాజెక్టు రోడ్లకు ఫారెస్ట్, ఇరిగేషన్, ఎలక్టిసిటీ డిపార్ట్మెంట్ ఇతరాత్ర డిపార్ట్మెంట్లు బాధ్యత వహిస్తుంటాయని రిపోర్టు తెలిపింది. మట్టి రోడ్లు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో అసోం(2.67 లక్షల కిలోమీటర్లతో) మొదటిస్థానంలో ఉండగా దాని తర్వాతి స్థానాల్లో పశ్చిమబెంగాల్, మహారాష్ట్రలు ఉన్నట్టు రిపోర్టు తెలిపింది. ఎక్కువ పట్టణ రోడ్ల వ్యవస్థ కలిగిన ప్రాంతంగా నాలుగో స్థానంలో ఉన్న ఢిల్లీలో కూడా 8,700 కిలోమీటర్ల వరకు మట్టిరోడ్లు విస్తరించి ఉన్నాయని రిపోర్టు వెల్లడించింది.
రోడ్ల వ్యవస్థను మెరుగుపరిస్తే దేశ ఆర్థికవ్యవస్థలో బహుళ ప్రయోజనాలుంటాయని, భారీగా ఉద్యోగవకాశాలు సృష్టించవచ్చని రోడ్డు రహదారుల మంత్రిత్వశాఖ అధికారులు చెబుతున్నారు. ఓ వైపు భారత్లో ఉద్యోగవకాశాలు భారీగా కనుమరుగవుతాయని అంచనాల నేపథ్యంలో రోడ్ల అభివృద్ధి చేపట్టి నిరుద్యోగులకు ఉపాధి కల్పించవచ్చని పేర్కొంటున్నారు. ఇటీవలే రోడ్లు రహదారుల శాఖా మంత్రి నితిన్ గడ్కరీ కూడా జాతీయ రహదారులను 1.05 లక్షల కిలోమీటర్ల నుంచి 1.40 లక్షల కిలోమీటర్ల వరకు విస్తరించాలని ఆమోదించినట్టు అధికారులు తెలిపారు.