'చీకటి రోజులను తలపించిన ఎమర్జెన్సీ'
న్యూఢిల్లీ: భారతదేశానికి ఎమర్జెన్సీ విధించి 40 ఏళ్లు పూర్తి అయిన నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. భారత్లో ఎమర్జెన్సీ చీకటి రోజులను తలపించిందని ఆయన గురువారం తన ట్విట్టర్లో పేర్కొన్నారు. దేశంలో ఎమర్జెన్సీ విధించిన కాంగ్రెస్ పార్టీపై మోదీ ఈ సందర్భంగా విమర్శలు గుప్పించారు. ఎమర్జెన్సీ సమయంలో ప్రధాని ఇందిరాగాంధీ వ్యవహారించిన తీరును ఆయన ఎండగట్టారు. ఆ సమయంలో పలువురు ప్రతిపక్ష నాయకులు జైళ్లలో బంధించారని అన్నారు.
అంతేకాకుండా పత్రిక స్వేచ్ఛపై ఆంక్షలు విధించారని మోదీ గుర్తు చేసుకున్నారు. స్వేచ్ఛాపూరిత ప్రజాస్వామ్యంతో దేశ ప్రగతి సాధ్యమన్నారు. ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు చెప్పారు. ఎమర్జెన్సీ సమయంలో దేశంలో లక్షలాది మంది ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడారని... వారిని చూసి గర్వపడుతున్నట్లు మోదీ పేర్కొన్నారు.
ఆ సమయంలో లోక్నాయక్ జయప్రకాశ్ నారాయణ్ పిలుపు మేరకు ఎమర్జెన్సీపై పోరాడేందుకు దేశవ్యాప్తంగా ప్రజలు స్వచ్ఛందంగా కదం తొక్కారని వివరించారు. ప్రభుత్వంపై జరిపిన పోరాటంలో ప్రతిపక్షాలతోపాటు బీజేపీ నుంచి నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారన్నారు. ఎమర్జెన్సీ నాటి రోజులను తాను వ్యక్తిగతంగా నెమరేసుకున్నారన్నారు. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా జరిపిన పోరాటంలో నాటి యువకులు ఎన్నో విషయాలు నేర్చుకున్నారని విశదీకరించారు.
తాను ఎందరో నాయకులతోపాటు పలు సంస్థలతో కలసి పోరాటం చేసే అవకాశాన్ని ఎమర్జెన్సీ కల్పించిందని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. 1975 నాటి ఎమర్జెన్సీ పూర్తి అయి 40 ఏళ్లు అయిన సందర్భంగా గురువారం దేశవ్యాప్తంగా అధికార బీజేపీ పలు కార్యక్రమాలను ఏర్పాటు చేసింది.